Jagan Delhi Tour : సీఎం జగన్ సడెన్ ఢిల్లీ టూర్ దేని కోసం ? కొత్త అప్పుల కోసమా ? ముందస్తు కోసం కసరత్తా ?
ఏపీ సీఎం జగన్ సడెన్ ఢిల్లీ టూర్ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలకు కారణం అవుతోంది. అదనపు అప్పుల కోసం లేదా ముందస్తు ఎన్నికలకు అనుమతి కోసంఆయన డిల్లీ పర్యటన చేస్తున్నారని అంటున్నారు.
![Jagan Delhi Tour : సీఎం జగన్ సడెన్ ఢిల్లీ టూర్ దేని కోసం ? కొత్త అప్పుల కోసమా ? ముందస్తు కోసం కసరత్తా ? AP CM Jagan's sudden Delhi tour is causing interesting discussions in the political circles. Jagan Delhi Tour : సీఎం జగన్ సడెన్ ఢిల్లీ టూర్ దేని కోసం ? కొత్త అప్పుల కోసమా ? ముందస్తు కోసం కసరత్తా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/26/4da7588adfdb50371fc683c4690e38d21672069803927228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jagan Delhi Tour : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారమే ఢిల్లీకి వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అమిత్ షా నూ కలుస్తారని చెబుతున్నారు. కొంత మంది కేంద్ర మంత్రుల్నీ కలిసే అవకాశం ఉంది. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు అన్న సమాచారం తప్ప.. దేని కోసం అనే విషయం ఎప్పుడూ ప్రభుత్వ వర్గాలు చెప్పవు. మోదీతో భేటీ అయిన తర్వాత ఓ ప్రెస్ నోట్ విడుదల చే్తారు. అందులో ఎప్పుడూ ఇచ్చే వినతి పత్రంలోని అంశాలే ఉంటాయి. అదే సమయంలో గతంలో ఢిల్లీకి వెళ్లే ప్రతీ ముఖ్యమంత్రి కీలక భేటీలు అయ్యాక.. మీడియాతో మాట్లాడేవారు. కానీ సీఎం జగన్ అసలు మీడియాతో మాట్లాడరు. దీంతో ఢిల్లీ పర్యటనల్లో జగన్ ఏం మాట్లాడారన్నదానిపై రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. ఈ సారి కూడా బయటకు తెలియని భేటీలే జరిగే అవకాశం ఉంది. కానీ ఈ సారి కీలక పరిణామాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
అదనపు అప్పుల కోసం ప్రయత్నాలు చేయడం మొదటి ప్రయారిటీ ?
ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం సీఎంవో కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆయనకు సమయం ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో సీఎం జగన్ ముందుగా ఖరారు చేసుకున్న టూర్స్ రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్తున్నారు. వాస్తవానికి 28వ తేదీన జగన్ నర్సీపట్నంలో పర్యటించాల్సి ఉంది. కానీ 30వ తేదీకి వాయిదా వేసుకుని ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అంటే ప్రధానంగా అందరికీ అదనపు అప్పలకు పర్మిషన్ అంశమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఒకటో తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో ఉద్యోగులకే కాదు.. ప్రభుత్వానికీ టెన్షన్ తప్పడం లేదు. నవంబర్ నెల జీతాలు డిసెంబర్ 22వ తారీఖుకు అందరికీ ఇవ్వగలిగారు. ఇప్పుడు మళ్లీ నెల వచ్చేస్తోంది. సామాజిక పెన్షన్లు.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు వంటి వాటికి కలిపి కనీసం ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఓడీలోనే ఉందన్న ప్రచారం జరుగుతోంది. తప్పనిసరిగా అప్పు పుట్టకపోతే.. సామాజిక పెన్షన్లు కూడా ఇవ్వలేరు. పైగా ఈ నెల 250 రూపాయలు పెంచుతున్నారు. అందుకే ముందస్తుగా అప్పుల కోసం జగన్ ప్రధాని మోదీ వద్దకు వెళ్తున్నారని అంటున్నారు.
ఢిల్లీలో బుగ్గన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సీఎం రంగంలోకి దిగారా ?
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటారు. అదనపు అప్పుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ సారి ఆయన స్థాయి కూడా దాటిపోవడంతో నేరుగా జగన్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీతో కేంద్ర ఆర్థిక మంత్రి ఉచితాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంట్ లో ఓ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోతోందని నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు. అది ఏపీని ఉద్దేశించేనని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అదనపు అప్పులకు అనుమతి రావాలంటే నేరుగా సీఎం రంగంలోకి దిగాల్సిందేనని భావించి.. జగన్ మోదీ అపాయింట్‌మెంట్ కోరినట్లుగా చెబుతున్నారు. అప్పులకు పర్మిషన్ దొరకకపోతే మాత్రం ఏపీ ప్రభుత్వం ఈ నెల కూడా తీవ్రంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
పెండింగ్‌లో ఎన్నో అంశాలు !
ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. విభజన సమస్యల దగ్గర్నుంచి పోలవరం ప్రాజెక్ట్ నిధుల వరకూ ఏ ఒక్కటీ పరిష్కారం కావడంలేదు. ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ. ఐదు వేల కోట్ల వరకూ నిధులు మంజూరు చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ వాటి విషయంలోనూ కోతలేస్తున్నారన్న సమాచారం రావడం ప్రభుత్వ వర్గాలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇవన్నీ మోదీతో భేటీలో చర్చించే అవకాశం ఉందంటున్నారు.
రాజకీయాలపైనా చర్చిస్తారా ? ముందస్తు ఊహాగానాలు నిజమేనా ?
సీఎం జగన్ ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే మార్చి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిపోతుంది. ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తారని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకపోతే..అసెంబ్లీని రద్దు చేయడం.. ఎన్నికలకు వెళ్లడం సాధ్యం కాదు. కేంద్రం సహకరించాలి. ఈ దిశగా కేంద్రాన్ని ఒప్పించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని.. కూడా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో వాస్తవ ఎంత అనేది అధికారికంగా చెబితేనే తెలుస్తుంది. అది ఇప్పుడల్లా చెప్పరు. ముందస్తు నిజమైతే.. అసెంబ్లీని రద్దు చేసిన రోజునే ప్రకటిస్తారు. అప్పటి వరకూ ఊహాగానాలే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)