AP BJP Vishnu : షా, ఎన్టీఆర్ భేటీతో రాజకీయాల్లో కీలక మార్పులు - వైఎస్ఆర్‌సీపీ అవినీతిపై చర్చకు సిద్ధమన్న విష్ణువర్ధన్ రెడ్డి !
ఏపీలో ప్రభుత్వ అవినీతిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేశారు. షా, ఎన్టీఆర్‌ల భేటీ రాజకీయాన్ని మారుస్తుందన్నారు.
AP BJP Vishnu : భారతీయ జనతా పార్టీ యువ సంఘర్షణ యాత్ర ముగింపు ర్యాలీలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ .. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. ఈ విమర్శలపై ఏపీ మంత్రులు జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. వీరికి ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పై ఎపి లో తీసేసిన తహశిల్దార్లు విమర్శలు చేస్తున్నారని.. వైఎస్ఆర్‌సీపీ మోసాలు, అవినీతి పై జోగి రమేష్, గుడివాడ అమర్నాధ్ తో బిజెపి చర్చకు సిద్ధమని సవాల్ చేసారు. ప్లేస్ మీరే డిసైడ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడిన ఆరు అంశాలపై తప్పు ఉంటే బిజెపి దేనికైనా సిద్ధమన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైఎస్ఆర్‌సీపీ నేతల బాగోతాలు త్వరలో వెలుగులోకి !
ఢిల్లీలో లిక్కర్ స్కాంలో రేపో మాపో ఏపీలోని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దొరకడం ఖాయమని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి మద్యాన్ని వేల కోట్లలో అమ్మడం మోసం కాదా అని ప్రశ్నించారు. జోగి రమేష్ జోకర్ మాటలు మాట్లాడుతున్నారు ..కేంద్రం 20 లక్షల ఇళ్లు ఇస్తే నాలుగు లక్షల ఇళ్లు కట్టామని చెబుతారా అని మండిపడ్డారు. గత టిడిపి, ప్రస్తుత వైసిపి కలిపి ఎనిమిదేళ్లలో మిగిలిన 16 లక్షల కుటుంబాలను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో కట్టిన ఇళ్లను ఎందుకు ఇవ్వలేదు.. మీరు బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చుకోవడమా అని ప్రశ్నించారు. ప్రజల నెత్తిన పన్నులేసి వాళ్లకి డబ్బులివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రికి ఏపీ అప్పుల గురించి తెలియదా ?
కేంద్రమంత్రి గతంలో కేంద్ర ఆర్ధిక సహాయ శాఖ మంత్రి గా ఠాకూర్ కి ఎపి లో వైసిపి చేసిన అడ్డగోలు అప్పు లు తెలియవా విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ నేతలను ప్రశ్నించారు. దేవాలయాల్లో దాడులపై మేం యాత్రలు చేస్తే సిసి కెమేరాలు పెట్టారన్నారు. జగన్ పై వ్యాఖ్యలు చేస్తే సిబిఐ అంక్వైరీ అంటారు. దేవాలయాల్లో దాడులు చేస్తే ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్పాలన్నారు. ఏపీలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం మైన్స్ పేరుతో వందల కోట్ల రూపాయలు దోచేసిందని.. ల్యాండ్, మైన్, శాండ్, వైన్ ప్రభుత్వం గా మారిందన్నారు. గుడివాడ అమర్నాధ్ మహా నటుడు..సినిమాల్లో నటిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. దావోస్ వెళ్లిన మీరు ఒక్క ఉద్యోగమైనా, ఒక్క రూపాయి అయినా ఏపీకి తెస్తే చూపించాలన్నారు. 19 లక్షల 86 వేల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకుంటే 1 లక్షా 66 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. జగన్ తప్పులను ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం..వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
షా , ఎన్టీఆర్ కలయికతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు !
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ కలవడంతో రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు రాబోతున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. మోదీ యువత అంతా రాజకీయాల్లో కి రావాలని పిలుపునిస్తున్నారన్నారు. 2009 ఎన్నికల్లో క్రియాశీలకంగా జూనియర్ ఎన్టీఆర్ పనిచేశారని.. రాజకీయ పరమైన అంశాలు మీడియాతో మాట్లాడకపోయినా జూనియర్ ఎన్టీఆర్ యంగ్ డైనమిక్ లీడర్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా కలయిక శుభ పరిణామానికి నాంది పలుకుతుందనుకుంటున్నామన్నారు. టిడిపి, వైసిపి వ్యతిరేక కూటమిలో మూడవ పార్టీ రావాలని పవన్ అన్నారని.. బిజెపి, జనసేన కూటమి రావాలని అన్నారు. *పవన్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలో అనుభవం కలిగిన వారు , ప్రముఖలు వారిద్దరికి బిజెపి సమానంగా నే గౌరవిస్తూందని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
వైఎస్ఆర్‌సీపీలో ఢిల్లీలో గల్లీ డ్రామాలు !
ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ గల్లీ డ్రామాలాడుతోందని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ ఆందోళనలు చేసినప్పుడల్లా ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ నేతలు హడావుడి చేస్తారన్నారు. వైఎస్ఆర్‌సీపీ ఢిల్లీలో రాజకీయ మోసాలు చేస్తోందన్నారు. భారత ప్రభుత్వం ను సిఎం జగన్ కలుస్తున్నారు.. బిజెపి ని కాదన్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఢిల్లీలో మాట్లాడింది ఎపి లో ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకే సిఎం ఢిల్లీ టూర్ అని విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేసీఆర్, కేటీఆర్ స్పందించారు.
తెలంగాణా పరిస్ధితి లే ఎపిలో ఉత్పన్నమవబోతున్నాయని విష్ణువర్దన్ రెడ్డి జోస్యం చెప్పారు.ఢిల్లీలో లిక్కర్ స్కాంలో తెలంగాణాలో ఎమ్మెల్సీ కవిత ఉందని బిజెపి ఎంపి చెప్పారు ఇప్పటిదాకా కెసిఆర్, కెటిఆర్ స్పందించలేదన్నారు. లిక్కర్ స్కాంలో ఎపి కి చెందిన వారు ఉన్నారు..మా పార్టీలో ఎవరూ లేరని ఆయా పార్టీలు ముందుకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాంలో ఉన్నవారు బయటకు రావాలి..లేకపోతే విచారణ సంస్ధలే బయటకు తెస్తాయని హెచ్చరించారు.