AP BJP Reaction : బీజేపీతో ఉంటేనే పవన్‌కు సీఎం చాన్స్ - చంద్రబాబుతో జనసేనాని భేటీలను లైట్ తీసుకున్న ఏపీ బీజేపీ !
చంద్రబాబుతో పవన్ భేటీలను ఏపీ బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం లేదు. సీఎం కావాలంటే పవన్ బీజేపీతోనే ఉండాలంటున్నారు. పంజాబ్‌లో జరిగినట్లే ఏపీలో జరుగుతోందని చెబుతున్నారు.
AP BJP Reaction : పవన్ కల్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన వ్యవహారం ఏపీ రాజకీయవర్గాల్లో పెను సంచలనం అయింది. తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ నేతల విమర్శలు, ప్రతి విమర్శల సంగతి పక్కన పెడితే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ స్పందనేమిటన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఇప్పటికీ జనసేన తెలుగుదేశం పార్టీతో వెళ్తుందని అనుకోవడం లేదు. రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషిస్తే ... ఇవాళ కాకపోతే రేపైనా పవన్ కల్యాణ్‌కు తాను వేస్తున్న అడుగుల వల్ల తనకు ఎంత రాజకీయ నష్టం జరుగుతుందో తెలుస్తుందని ఏపీబీజేపీ అంచనా వేస్తోంది. అందుకే పవన్ పై ఎక్కడా విమర్శలు చేయకుండా తమతోనే ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామంటున్నారు.
పవన్ బీజేపీతో ఉంటే సీఎం పదవి వస్తుందా ? టీడీపీతో వెళ్తే వస్తుందా?
పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో వెళ్తే్ సీఎం పదవి ఎలా వస్తుందని ఏపీ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో వెళ్తే.. సీఎం ఎవరు అనే ప్రశ్న వస్తుందని చంద్రబాబును కాదని.. పవన్ కల్యాణ్‌కు సీఎం పదవి ఇవ్వరని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, సోషల్ మీడియా ఇంచార్జ్ విష్ణువర్దన్ రెడ్డి విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఆయన బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే .. ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా.. కాపు వర్గం నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆయన అందుకునే అవకాశం ఉందంటున్నారు. బీజేపీతోనే ఉండటం మంచిదని పవన్ ను ఇవాళ కాకపోతే రేపైనా తెపలుస్తుందని బీజేపీ వర్గాలు గట్టి ఆశాభావంతో ఉన్నాయి.
పంజాబ్‌లో జరిగిందే ఏపీలో జరుగుతుంది.. పవన్ కు ఇదే అసలైన చాన్స్ !
తెలుగుదేశం పార్టీ పాలనను తిరస్కరించి ప్రత్యామ్నాయంగా జగన్‌కు ప్రజలు పట్టం కట్టారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయనపై వ్యతిరేకత ఉన్నందున.. టీడీపీకి ప్రజలు పట్టం కడతారాని ఎందుకు అనుకుంటామని ఏపీ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పంజాబ్‌లో ఏం జరిగిందో ఓ సారి గుర్తు చేసుకోమని పవన్‌కు సూచిస్తున్నారు. పంజాబ్‌లో సుదీర్ఘంగా బీజేపీ, అకాలీ కూటమి, కాంగ్రెస్ పార్టీల మధ్య అధికారం మారుతూ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు పూర్తి స్థాయిలో ఆ రెండు పార్టీల్ని తిరస్కరించారు. కొత్త ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన ఆమ్ ఆద్మీని గెలిపించారు. ఏపీలోనూ అదే పరిస్థితులు ఉన్నాయని.. ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే జగన్ లేకపోతే చంద్రబాబునే ఎన్నుకోవాలని అనుకోవడం లేదని.. ఈ సారి ఖచ్చితంగా ప్రత్యామ్నయంకు చాన్సిస్తారని.. పవన్ కల్యాణ్ ఈ అవకాశాన్ని అంది పుచ్చుకోవాలంటే... తెలుగుదేశం పార్టీతో వెళ్లకూడదని అంటున్నారు. అలా వెళ్తే తనకు తాను రాజకీయంగా నష్టం చేసుకున్నట్లు అవుతుందని పవన్‌కు సూచిస్తున్నారు.
ప్రత్యామ్నాయ వర్గానికి సీఎం పదవి పవన్‌తోనే సాధ్యం !
ప్రస్తుతం ఏపీలో పదవి రెండు సామాజిక వర్గాల మధ్యే దోబూచులాడుతోంది. అయితే వీరు.. లేకపోతే వారు అన్నట్లుగా ఉంది. కానీ ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయ వర్గానికి పదవి దక్కాలని ఆ వర్గం కోరుకుంటోంది. ఇప్పుడు పవన్ ఈ అశలను నేరవేర్చే దారిలో ఉన్నారని.. ఇప్పుడు తప్పటడుగులు వేస్తే.. మొత్తం వర్గం ఆశల్ని అడియాసలు చేసినట్లు అవుతుందని అంటున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ సీపీ చేస్తున్న విమర్శలు .. ప్రజల్లోకి వెళ్తే పవన్ కు ఎక్కువ నష్టం జరుగుతుందని ఏపీ బీజేపీ నేతలంటున్నారు.
మొత్తంగా పవన్ కల్యాణ్ టీడీపీతో వెళ్తారా లేదా అన్నదానిపై ఏపీ బీజేపీ నేతలు పెద్దగా టెన్షన్ పడటం లేదు. జనసేన తమను విడిచి పెడితే.. భారీగా నష్టపోయేది పవనేనని అంటున్నారు. ఈ విషయంపై పవన్ కు రాజకీయంగా అవగాహన వస్తుందని... పొత్తులపై తుది నిర్ణయం తీసుకునేముందు అన్నీ ఆలోచిస్తారని.. బీజేపీతోనే కలిసి నడుస్తారని వారు నమ్మకంగా ఉన్నారు.