Annamalai Exclusive: తెలంగాణలో బండి సంజయ్‌ని తమిళనాడులోఅన్నామలైని సొంతపార్టీ బీజేపీనే తొక్కేసిందా.?
దూకుడైన నాయకులను పార్టీ ఎదుగుదలకు వాడుకుని.. విస్తరణకు వచ్చే సరికే బీజేపీ వాళ్లని పక్కన పెడుతోందా..? తెలంగాణలో బండి సంజయ్, తమిళనాడులో అన్నామలైకి అలాంటి పరిస్థితే ఎదురైందా..? అన్నామలే ఏమంటున్నారు..?

Annamalai Interview: పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు.. దూకుడుగా మాట్లాడే నాయకులను.. పబ్లిక్‌లో గట్టి వాయిస్ వినిపించే వాళ్లని ప్రోత్సహించే బీజేపీ నాయకత్వం.. ఎన్నికల సమయానికి వారిని పక్కన పెడుతుందా అన్న వాదన ఉంది. దీనిైపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు , అన్నామలై స్పందించారు. ABP Desam తో ప్రత్యేకంగా మాట్లాడారు.
తెలంగాణ బీజేపీలో దూకుడుగా వ్యవహరించి.. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన గట్టిగా ఫైట్ చేసిన బండి సంజయ్ వంటి నాయకులను సరిగ్గా ఎన్నికలకు ముందు పక్కకి తప్పించారు. సరిగ్గా అలాగే అన్నామలైకి కూడా జరిగింది. బీజేపీకి ఏమాత్రం కూడా ప్రాతినిధ్యం లేని, అసలు ఆ పార్టీ ప్రభావమే లేని తమిళనాడులో అన్నామలై అక్కడ ఫేస్ ఆఫ్ ది బీజేపీగా నిలబడ్డారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండంతో పొత్తుల విషయంలో పట్టు విడుపులు లేని అన్నామలైని పక్కకు తప్పించారు. తెలంగాణలో బండి సంజయ్, తమిళనాడులో అన్నామలై.. బీజేపీ తమ పార్టీలో దూకుడైన నాయకులను కావాలనే తగ్గిస్తోందా.? అన్న అనుమానాలు తలెత్తాయి. దీనిపై ABP Desam నేరుగా అన్నామలైనే అడిగింది. ABP Network సదరన్ రైజింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న అన్నామలైని.. బండిసంజయ్‌ను, మిమ్నల్ని కావాలనే పక్కకు తప్పించారా.. అని అడిగితే.. “అలాం ఏం లేదు. బండి సంజయ్ ఓ గొప్ప నాయకుడు. నేను ఆయన చేసిన పాదయాత్రలో కూడా పాల్గొన్నా. బీజేపీ లో అలా ఉండదు. పార్టీలో ప్రతీ నాయకుడికి ఓ బాధ్యత ఉంటుంది. అలా బండి సంజయ్ కి ఓ బాధ్యత ఉంది. ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. అలానే నాకూ మరో బాధ్యతను అప్పగించారు. పార్టీలో ప్రతీ నాయకుడికి తన నాయకత్వ పటిమను ప్రదర్శించటానికి ఓ సమయం వస్తుంది. పార్టీ ప్రస్తుతం ఓ నిర్ణయం తీసుకుంది. మేం దాన్ని అనుసరిస్తున్నాం.” అన్నారు.
ఆర్యన్ ద్రవిడన్ అంటూ ఉదయనిధి పొలిటికల్ నాన్సెన్స్:
శతాబ్ద కాలంగా తమిళనాడులో ద్రవిడియన్ అల్గారిథమ్ ఉందని.. రాజకీయాల్లో దీనినే అనుసరిస్తున్నామని DMK నాయకుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. దీనిపై స్పందిస్తూ.. “ఈ ఆర్యన్ ద్రవిడియన్ సిద్ధాంతం గురించి అంబేడ్కర్ ను అడిగితే అది ఉండాల్సింది చెత్త కుండీలో అని చెప్పారు.. వీళ్లు చేసేది ఓ పొటిలికల్ నాన్సెన్స్. మేం ద్రవిడులు మిగిలిన వాళ్లు ద్రవిడులు కాదు అని వేరుగా చూస్తున్నారు అంటే..వాళ్లు ఎవ్వరినీ సమానంగా చూడట్లేదు అని అర్థం. కాంగ్రెస్ లాంటి ప్రభుత్వంలో జతకట్టి ఏడుసార్లు కేంద్రంలో ప్రభుత్వాల్లో భాగస్వామ్యం అయ్యారు. ఆర్యులు, ద్రవిడులు వేరు అన్నప్పుడు 2004-2014 మధ్య ఏడుసార్లు తమ మనుషులను కేంద్రమంత్రులను ఎందుకు చేసుకున్నారు.?" అని ప్రశ్నించారు. ఉదయనిధి మాట్లాడేవన్నీ వెనుకబాటు, భావోద్వేగ రాజకీయాలని విమర్శించారు. తమిళనాడు ప్రజలు వీళ్లకు 2026లో బుద్ధి చెబుతారని అక్కడి ప్రజలు అభివృద్ధి, స్థిరమైన ప్రభుత్వాలు, లా అండ్ ఆర్డర్ కోరుకుంటున్నారన్నారు
విజయ్‌తో కలిసి వెళతారా..?
DMK కి తామే ప్రత్యామ్నాయం అని TVK పార్టీ అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “ రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వానికి తామే ప్రత్యామ్నాయం అనే అని చెబుతాయి. ఎందుకంటే వాళ్లు ప్రభుత్వంలోకి రావాలని కోరుకుంటాయి కాబట్టి. విజయ్ టీవీకే పార్టీ ఓ దారిలో ప్రయాణిస్తూ వెళ్తోంది. ఎన్డీయే గా మేం వేరే దారిలో వెళ్తున్నాం. అలాగే డీఎంకే మరో దారిలో వెళ్తోంది. ఎన్నికలు వచ్చేంత వరకూ వేచి చూద్దాం.” అని వ్యాఖ్యానించారు. డీఎంకేకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యే విషయంపై తాను ఎలాటి వ్యాఖ్యలు చేయలేనని పార్టీ నిర్ణయాన్ని అనుసరిస్తానని చెప్పారు. అంతకు ముందు సదరన్ రైజింగ్ కార్యక్రమం సెషన్‌లో పాల్గొన్న ఆయన.. దూకుడైన స్వభావం వల్ల తాను చాలా కోల్పోయానని చెప్పారు.





















