Amit Shah: తెలంగాణపై బీజేపీ ఫోకస్, మరోసారి రాష్ట్రానికి అమిత్ షా
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణాలో పర్యటించనున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలు కార్యచరణ రూపొందిస్తున్నారు.
Amit Shah: మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ స్థానాలు దక్కించుకుని తొలిసారి అధికారం దక్కించుకోవాలని యత్నిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడి మార్పు చేపట్టింది. ఆ తరువాత రాజకీయ సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఇటీవల రైతు గోస - బీజేపీ భరోసా పేరుతో బహిరంగ సభకు నిర్వహించింది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై బీఆర్‌ఎస్‌పై ఘాటు విమర్శలు చేశారు.
తాజాగా మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణాలో పర్యటించనున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలు కార్యచరణ రూపొందిస్తున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. గతేడాది నుంచి సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం అధికారికంగా నిర్వహించారు.
అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ఈసారి వరంగల్‌లో తెలంగాణ విమోచన దినం నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర భద్రత దళాలతో వరంగల్‌లో కవాతు నిర్వహణకు ప్లాన్ రూపొందిస్తున్నారు. ఈ కవాతులో అమిత్ షా గౌర వందనం స్వీకరించనున్నారు. వరుసగా అమిత్ షా తెలంగాణ పర్యటనలు చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
ఖమ్మం సభలో కేసీఆర్‌పై అమిత్ షా విమర్శనాస్త్రాలు
ఖమ్మంలో ఆగస్టు 27న జరిగిన రైతు గోస- బీజేపీ భరోసా సభలో అమిత్ షా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ రజాకార్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. కేసీఆర్ 9 ఏళ్లుగా రజాకర్లతో కలిసి పాలన కొనసాగిస్తున్నారని, ఆయనను సాగనంపాలంటే ప్రజలు బీజేపీకి మద్దతివ్వాలన్నారు. ఒవైసీ మద్దతు కోసం రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలగా, కమలం వికసిస్తుందని చెప్పారు. త్వరలో బీజేపీ ముఖ్యమంత్రి భద్రాద్రిలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూల్ ఇళ్లులు కట్టించలేదని, రైతులకు రుణాలు మాఫీ చేయలేదని, అన్ని వర్గాలను 9 ఏళ్లుగా మోసం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ రైతుల కోసం బడ్జెట్ లో కేవలం 20 వేల కోట్లు పెడితే.. ప్రధాని మోదీ రైతుల కోసం లక్ష కోట్ల బడ్జెట్ తెచ్చారన్నారు. ధాన్యం సేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 475 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే.. మోదీ ప్రభుత్వం 900 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించిందన్నారు. బియ్యం మీద కనీస మద్దతు ధర 67శాతం పెంచింది బీజేపీ ప్రభుత్వం. 11 కోట్ల మంది రైతులకు, 2.60 లక్షల కోట్ల కిసాన్ సమృద్ధి నిధిని అందిస్తోందని, 10వేల FPOలను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
Also Read: త్వరలో బీజేపీ సీఎం భద్రాచలంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు: ఖమ్మం సభలో అమిత్ షా