Mandapeta MLA Vs MLC : మండపేటలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ, తారాస్థాయికి మాటల యుద్ధం!
Mandapeta MLA Vs MLC : అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ మధ్య ప్రెస్ మీట్ల వార్ జరుగుతోంది. ఒకరు సైంధవుడు అంటే మరొకరు శిరోముండనం చేయించాలని ఘాటుగా స్పందించారు.
Mandapeta MLA Vs MLC : తెలుగుదేశం కంచుకోట మండపేట నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయినా మండపేటలో మాత్రం తన ఉనికిని కాపాడుకోగలిగింది టీడీపీ. మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన స్థానాన్ని పదిలపరచుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందుకే టీడీపీకి మండపేట ప్రత్యేకం, తిరుగలేని స్థానం. దీంతో వైసీపీ కూడా దీటుగానే పావులు కదిపింది. ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న తోట త్రీమూర్తులకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడమే కాదు మండపేట నియోజకవర్గ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది అధిష్ఠానం. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రీమూర్తులు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. వీరిద్దరి మధ్యలో ఎమ్మెల్యే వేగుళ్ల సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకుడు, జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకుడు వేగుళ్ల పట్టాభిరామయ్యను కూడా రంగంలోకి దింపింది. టిడ్కో ఇళ్లపై పెరిగిన మాటల రచ్చ ఒకరినొకరు టార్గెట్ చేసుకుని విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో మండపేట కేంద్రంగా రాజకీయ మాటల యుద్ధం చినికి చినికి గాలివానలా మారి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కాలికి ఫ్రాక్ఛర్ అవ్వడంతో ఇంటివద్దనే ఉండి ప్రెస్‌మీట్ పెట్టి తోటపై విమర్శలు చేస్తున్నారు. తోట త్రిమూర్తులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. దీనికి కౌంటర్ గా మండపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట ప్రెస్‌మీట్ నిర్వహించి శిరోముండనం నీకు చేయించాలని అనడం వివాదానికి తెరలేపింది. ఇదిలా ఉంటే టిడ్కో గృహాల సమస్యపై బహిరంగ చర్చకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలతో ఇరు పార్టీల నాయకులను గృహ నిర్భంధం చేశారు.
అభివృద్ధిని సైంధవుడిలా అడ్డుకుంటున్నావు -ఎమ్మెల్యే వేగుళ్ల
మండపేట పట్టణంలో 6128 టిడ్కో గృహాల అభివృద్ధికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సైంధవుడిలా అడ్డుకుంటున్నారని ఎమ్మల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది క్రితం జరిగిన పురపాలక సంఘ ఎన్నికలకు టిడ్కో గృహాల లబ్ధిదారులను బెదిరించి ఓట్లు దండుకొని పురపాలక సంఘం ఎన్నికల్లో విజయం సాధించారన్నారు. వారికి నేటి వరకు పూర్తిస్థాయిలో కనీస వసతులు మౌలిక సదుపాయాలు కల్పించకుండా సైంధవుడిలా అభివృద్ధిని అడ్డుకుంటూ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఓట్లను తిరిగి పొందడానికి టిడ్కో గృహాలను నానుస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. తాను ఏడాదికాలంగా లబ్ధిదారులందరికీ టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి కేటాయించాలని పోరాటాలు చేస్తున్నానన్నారు. శాసనమండలి సభ్యుడు తోట త్రిమూర్తులు చేసిన సవాల్ కు తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. అయితే ఆదివారం జరిగిన పోలీసు బందోబస్తు, గృహ అరెస్టులు దగ్గరుండి అధికార పార్టీ చేయిస్తోందని ఆయన విమర్శించారు. ఛాలెంజ్ చేసింది మీరు తేదీ చెప్పింది మీరు అయితే మీరు వీటికి కట్టుబడి ఉండలేదన్నారు. ప్రచారం కోసమే మీరు ఛాలెంజ్ లు చేశారని పేదలకు లబ్ధి, మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఆలోచన మీకు లేదన్నారు. ఏప్రిల్ ఒకటిలోగా లబ్ధిదారులందరికీ వసతులు కల్పించని పక్షంలో తాను మండపేట పట్టణ ప్రజలతో సమావేశం జరిపి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించారు. తనపై ఎటువంటి నేరారోపణలు కానీ శిరోముండన కేసులు గాని లేవని ఆయన ఎద్దేవా చేశారు. చట్టాన్ని, పోలీసులను గౌరవించే తాను పోలీసులు విధించిన గృహనిర్బంధంలో ఉండిపోయానని ఆయన పేర్కొన్నారు.
శిరోముండనం చేయించాల్సి వస్తే ముందు నీకే -ఎమ్మెల్సీ తోట
తనకు సంబంధం లేని శిరోముండనం కేసు విషయం కోర్టు చూసుకుంటుందని, తాను ఏనాడు శిరోముండనం చర్యలకు పాల్పడలేదన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. శిరోముండనం చేయించాల్సి వస్తే ముందు నీకే మాత్రమే చేయిస్తానని ఎమ్మెల్సీ తోట ఎమ్మెల్యే వేగుళ్ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా ద్వారా ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలుసుకున్న తోట స్పందించారు. శిరోముండనం ఇంత వరకూ ఎవ్వరికీ చేయలేదని అలాంటి పరిస్థితి ఎదురైతే ఎమ్మెల్యే వేగుళ్లకే శిరోముండనం చేస్తానని ఘాటుగా వ్యాఖ్యానించారు. మండపేటలో ఏం జరుగుతుంది ఏంటనేది ప్రజలంతా నిశితంగా పరిశీలిస్తున్నారని అన్నారు. టిడ్కో సమస్యలపై బహిరంగ చర్చకు రమ్మని పిలిచింది వాస్తవమేనని అయితే అక్కడ ముందుగా చర్చించాల్సిన అంశాలు మీకు ముందే తెలియజేశానని వాటి కోసం మాట్లాడకుండా డొంక తిరుగుడు సమాధానం చెప్పడం ఏమీ బాగాలేదన్నారు. టిడ్కో ప్రాజెక్టు మొదలైంది టీడీపీ ప్రభుత్వంలోనన్న సంగతి మరిచిపోతే ఎలా అన్నారు. ఆ ప్రాజెక్టు పేరు చెప్పి కోట్లాది రూపాయలు దోచేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి 122 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల పట్టాల రూపంలో పేదలకు దానం చేసిన ఘనత బిక్కినకే దక్కుతుందని స్పష్టం చేశారు. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ స్థలాలు లాక్కుని పట్టాదారులను ఇబ్బంది పెట్టిన ఘనత మీదేనని ఆయన ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు.