(Source: ECI/ABP News/ABP Majha)
Munugode Bypolls : మునుగోడు లోకల్ లీడర్స్‌కు బంపర్ ఆఫర్లు - వలసల కోసం రాజకీయ పార్టీల వ్యూహాలు !
మునుగోడులో ఇతర పార్టీల నేతల్ని చేర్చుకునేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. లోకల్ లీడర్స్‌కు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు.
Munugode Bypolls : మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ కారణంగా ద్వితీయ శ్రేణి నేతలకు పెద్ద ఎత్తున ఆఫర్లు ఇస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా తమ కోసం ఇతర పార్టీల అగ్రనేతలు కూడా ఫోన్లు చేస్తూండటంతో ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తమకు ఇస్తున్న ఆఫర్లకు టెంప్ట్ అవుతున్నారు. దీంతో ఆయారాం..గయారాంల హవా పెరిగిపోతోంది. నేతలు అటూ ఇటూ మారిపోతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీలు ఖుషీ అవుతూంటే... కాంగ్రెస్ మాత్రం టెన్షన్ పడుతోంది.
మునుగోడు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలకు ఆఫర్లు !
మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికలు అన్ని పార్టీల ద్వితీయ శ్రేణి నేతలకు పండగ తెచ్చి పెట్టాయి. ఆ నియోజకవర్గంలోని గ్రామాల్లో కాస్త పట్టు ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే.. వారి కోసం టీఆర్ఎస్, బీజేపీ ,కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. అత్యధిక శాతం స్థానిక సంస్థలు టీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఆ లీడర్లందరికీ ఇప్పుడు మంచి డిమాండ్ వచ్చింది. ఒక పార్టీలో నేతలకు.. మరో పార్టీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల నేతలు ఇతర పార్టీల ద్వితీయ శ్రేణి నేతల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ఆఫర్లకు చాలా మంది నేతలు టెంప్ట్ అవుతున్నారు. పార్టీలు మారిపోతున్నారు .
టీఆర్ఎస్, బీజేపీ దూకుడు - కాంగ్రెస్ డీలా !
ఇటీవలి కాలలో ద్వితీయ శ్రేణి ప్రజాప్రతినిధులు వరుసగా టీఆర్ఎస్‌లో చేరిపోతూ వస్తున్నారు. అనూహ్యంగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలో కూడా కొంత మంది చేరిపోతున్నారు. చౌటుప్పల్ ఎంపీపీ కూడా బీజేపీలో చేరారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరుతున్న రాజగోపాల్ రెడ్డి తన వెంట కాంగ్రెస్ క్యాడర్‌ను తీసుకెళ్లాల్సి ఉంది. కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలందర్నీ తన వైపు తిప్పుకోవడం రాజగోపాల్ రెడ్డికి కీలకం. అయితే చాలా మంది నేతలు ఆయనతో నడవడానికి సిద్దంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ నుంచి వస్తున్న ఆఫర్లతో మాకేంటి అనే పరిస్థితిలో పడిపోయారు. దీంతో రాజగోపాల్ రెడ్డి కూడా వారిని తనతో పాటు పార్టీ మారేలా చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ !
ఓ వైపు బీజేపీ.. మరో వైపు టీఆర్ఎస్ ఇలా ఆఫర్లు ఇస్తూండటంతో మునుగోడులో ఇతర పార్టీల నేతలకు అనుకోని అదృష్టం వచ్చి పడింది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు పార్టీ మారుతూండటంతో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. తాను కూడా .. ఇరవయ్యో తారీఖు నుంచి మునుగోడులోనే ఉంటానని .. అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని.. కేడర్‌కు రేవంత్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. క్యాడర్ ను ఎంత వరకూ నిలుపుకుంటే అంత నమ్మకం.. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు నీరుగారిపోయినట్లు అవుతుంది. ఇతర పార్టీలు ద్వితీయ శ్రేణి నేతల్ని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ కాపాడుకునేందుకు శ్రమిస్తోంది.