YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
Social media bullying case: సోషల్ మీడియా కేసులతో జగన్ మోహన్ రెడ్డికి కొత్త సమస్యలు వస్తున్నాయి. ఆయన అవినాష్ రెడ్డిని పార్టీకి దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
All roads lead to Avinash Reddy in social media bullying case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా కేసులు వైసీపీకి కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నాయి. అరెస్టు అవుతున్న వారంతా వైసీపీకి, వైసీపీ ముఖ్య నేతలకు ఆత్మీయులే. అలాగని వారిని గట్టిగా సమర్థించలేకపోతున్నారు. కొంత మంది అసలు తమ పార్టీ నేతలు అని చెప్పుకోవడానికి జంకే పరిస్థితి వస్తోంది. ఆస్తుల వివాదంలో ఇప్పటికే కుటుంబంలో అవినాష్ రెడ్డి వైపు బంధువులు తప్ప జగన్ కు అందరూ దూరమయ్యారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కేసుల వల్ల అవినాష్ రెడ్డినీ జగన్ దూరం పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది వైసీపీ అధినేతను కలవరపాటుకు గురి చేస్తోంది.
వైసీపీకి సమస్యగా మారిన వర్రా రవీంద్రారెడ్డి కేసులు
గత వారం పది రోజుల నుంచి సోషల్ మీడియాలో మహిళల్ని కించ పరిచిన వారిపై పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. అరెస్టులు చేస్తున్నారు. ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేస్తే ఆయన భార్యను పార్టీ ఆఫీసుకు పిలిపించుకున్న వైసీపీ అధినేత తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.అయితే ఇలాంటి సపోర్టు అయన పులివెందులకు చెందిన మరో కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి అనే కార్యకర్తకు కానీ ఆయన కుటుంబానికి కానీ ఇవ్వలేకపోతున్నారు. దీనికి కారణం ఆయన వర్రా అనే వ్యక్తి టీడీపీ నేతలు, వారి ఇంట్టో మహిళలపైనే పోస్టులు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి, చెల్లెళ్లు షర్మిల,సునీతలపైనా పెట్టారు. ఇవే అత్యంత వివాదాస్పదమయ్యాయి.
Also Read: సజ్జల భార్గవ్, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
అవినాష్ రెడ్డినే పెట్టించారని పోలీసుల ప్రకటన
వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేసిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన పోలీసులు ఆయన పెట్టిన పోస్టులకు కంటెంట్ మొత్తం అవినాష్ రెడ్డిదేనని.. తన పీఎ రాఘవరెడ్డి ద్వారా ఈ కంటెంట్ ప పంపించారని ప్రకటించారు. అంటే జగన్ తల్లితో పాటు చెల్లెళ్ల మీద అత్యంత దారుణమైన పోస్టులు పెట్టించింది అవినాష్ రెడ్డేనని చెప్పినట్లయింది. పోలీసులు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం వెదుకుతున్నారు. ఆయన దొరికితే కేసు అవినాష్ రెడ్డి దగ్గరకు చేరే అఅవకాశం ఉంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడలేకపోతున్నారు. వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ కాక ముందు ఆయనకు మద్దతుగా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అరెస్టు తర్వాత ఏమీ మాట్లాడటం లేదు. ఈ కేసులో సునీత కూడా త్వరలో పోలీసులకు ఫిర్యాదులు చేయబోతున్నారు. అంటే.. అవినాష్ రెడ్డి చుట్టూ మరింత పకడ్బందీగా వల వేశారని అనుకోవచ్చు.
Also Read: సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న
అవినాష్ రెడ్డిని దూరం పెట్టకపోతే తల్లి, చెల్లిని ఘోరంగా తిట్టించిన వ్యక్తిగా జగన్‌కు ఇమేజ్ !
సొంత తల్లి, చెల్లిపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిని కూడా జగన్ ప్రోత్సహించారని ఇప్పటికే అధికారపక్షం ఆరోపిస్తోంది. షర్మిల కూడా నేరుగా అదే చెప్పారు. వారందరికీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డేనన్నారు. ఇప్పుడు జగన్ రాజకీయాల కోసం తన తల్లి, చెల్లిపై అత్యంత దారుణమైనా పోస్టులు పెట్టించలేదని .. అలా పెట్టిన వారికి తన సపోర్టు లేదని నిరూపించుకోవాలి. అంటే అవినాష్ రెడ్డి అలా చేశాడని తనకు తెలియని చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలంటే ఉన్న పళంగా అవినాష్ రెడ్డిని దూరం పెట్టాల్సి ఉంటుంది. ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ పార్టీలో ప్రాధాన్యం ఇస్తే.. తల్లి, చెల్లిపై సోషల్ మీడియా పోస్టులకు జగన్ ప్రోత్సాహం ఉందని జగన్ అనుకుంటారు. అది ఆయన రాజకీయ జీవితానికి పెను సమస్యగా మారుతుంది.
ఇప్పుడు జగన్ చక్రవ్యూహంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే ఆస్తి వివాదంలో తల్లి, చెల్లి దూరమయ్యారు. ఇప్పుడు వారిపై తప్పుడు పోస్టింగ్‌ల వ్యవహారంలో అవినాష్ రెడ్డిని దూరం చేసుకుంటే ఒంటరి అవుతారు. ఒక వేల అవినాష్ రెడ్డికి మద్దతుగా ఉంటే టీడీపీ చేసే ప్రచారం ఆయన ఇమేజ్ ను మరింతగా దిగజారుస్తుంది.