BJP And NTR : అమిత్ షా - ఎన్టీఆర్ విందు భేటీ వెనుక అంతుబట్టని రాజకీయం ! అసలు లెక్కలు చాలా ఉన్నాయా ?
అమిత్ షా , జూనియర్ ఎన్టీఆర్‌ల భేటీపై తెలుగు రాష్ట్రాల రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అభినందన భేటీ మాత్రమే అని ఎవరూ అనుకోవడం లేదు.. అంతకు మించిన రాజకీయం ఉందనుకుంటున్నారు.
BJP And NTR : అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీలో ఏమేం చర్చించారు ? ఇప్పుడిదే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. రామ్‌చరణ్ లేదా మరో సినిమా స్టార్‌ను అమిత షా పిలిచి ఉంటే ఇంత చర్చనీయాంశమయ్యే చాన్స్ లేదు. కానీ ఆయన పిలిచింది జూనియర్ ఎన్టీఆర్‌ను. ఆయన వెనుక బోలెడంత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆయన ఖచ్చితంగా ఇన్‌ఫ్లూయన్సర్ అని ఎక్కువ మంది నమ్ముతారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్ షా ఆహ్వానించడంపై ఎక్కడా.. ఎప్పుడూ లేనంత చర్చ జరుగుతోంది.
"కొమురం భీం"ను అభినందించడానికి మాత్రం కాదు !
బీజేపీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం అమిత్ షా ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమా చూశారు. అందులో కొమురం భీం పాత్రను ఆయన అమితంగా ఇష్టపడ్డారు. అందుకే హైదరాబాద్ వస్తున్న సందర్భంగా తనతో భోజనానికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు. అయితే నిజంగా కొమురం భీం పాత్ర ఆకట్టుకుని ఉంటే అమిత్ షా.. ముందుగా సినిమా యూనిట్‌ను అభినందించారు. ఆ పాత్ర సృష్టించిన రాజమౌళిని మర్చిపోకూడదు. కానీ ఇక్కడ ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌ను మాత్రమే ఆహ్వానించారు. అందుకే ఖచ్చితంగా అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ వెనుక ఏదో ఉందని నమ్ముతున్నారు. కేవలం ప్రశంసల కోసమేనని అనుకోవడం లేదు.
20 నిమిషాల పాటు వన్ టు వన్ చర్చలు !
ఎన్టీఆర్, అమిత్ షాల డిన్నర్ భేటీ దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు సాగింది. ఇందులో ఇరవై ఐదు నిమిషాల పాటు అందరూ కలిసి డిన్నర్ చేశారు. ఈ డిన్నర్ భేటీలో కిషన్ రెడ్డి ఇతర ప్రముఖులు ఉన్నారు. కానీ తర్వాత అమిత్ షా.. ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా ఇరవై నిమిషాలు మాట్లాడారు. ఏం మాట్లాడారన్నది వారు చెబితే తప్ప బయటకు తెలియదు. ఇందులో రాజకీయాలు ఉన్నాయని ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే ఎన్టీఆర్‌కు రాజకీయ నేపధ్యం ఉంది. అంతకు మించి ఛరిష్మా ఉంది. ఆర్ఆర్ఆర్‌లో తెలంగాణ పోరాట యోధుడు కొమురంభీం పాత్ర పోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. కానీ అసలు అమిత్ షా ..బీజేపీ లక్ష్యం ఏమిటో మాత్రం స్పష్టత లేదు.
రాజకీయంగా చర్చనీయాంశం చేయడమే వ్యూహమా ?
ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అసలు లక్ష్యం మాత్రం ఇలా గుసగుసలు వచ్చేలా చేయడమేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఈ విషయంలో ప్రస్తుతం ఎక్కువగా అడ్వాంటేజ్ బీజేపీకే వస్తోంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ బీజేపీకి చెందిన మనిషి కాదు. మ౧దటి నుంచి టీడీపీ. కట్టే కాలే వరకూ టీడీపీ అని చెబుతున్నారు. అయితే ఆయన ఇటీవలి కాలంలో రాజకీయాల్లో లేరు. కనీస మాత్రంగా కూడా రాజకీయాలపై స్పందించడం లేదు. తన పూర్తి ఫోకస్ సినిమాల మీద పెట్టాలని ఆయన డిసైడ్ చేసుకోవడమే దీనికి కారణం. రాజకీయంగా ఊహాగానాలు వవచ్చే చిన్నపనిని కూడా ఆయన చేయడం లేదు. కానీ ఇప్పుడు స్వయంగా అమిత్ షాతో విందు భేటీకి ఆహ్వానం వచ్చినందున తిరస్కరించే పరిస్థితి లేదు.
ఎన్టీఆర్‌తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించుకుంటుందన్న కొడాలి నాని!
మరో వైపు ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అని ఆయనతో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించుకుంటుందని... ఒకప్పుడు ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న కొడాలి నాని ప్రకటించారు. కొడాలి నాని టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరిన తర్వాత ఇద్దరి మధ్య పెద్దగా సంబంధాలు లేవని కొడాలి నానినే ఇటీవల చెప్పారు. అయితే.. ఈ అంశంపై కొడాలి నాని దూకుడుగా స్పందించారు. ఆయన బీజేపీలో చేరుతారని.. దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారన్నట్లుగా ప్రకటించారు. ఉపయోగం లేకుండా ఒక్క నిమిషం కూడా అమిత్ షా మాట్లాడరని కొడాలి నాని చెబుతున్నారు.
బీజేపీ టార్గెట్ చేసింది ఏపీ రాజకీయాలా ? తెలంగాణ రాజకీయాలా ?
అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ తర్వాత ఎక్కువ మంతి తెలంగాణ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నాలుగా విశ్లేషిస్తున్నారు. అయితే అమిత్ షా .. ఎన్టీఆర్‌ను ఉత్తినే సినిమా చూసి .. భోజనానికి ఆహ్వానించారని ఎవరూ అనుకోవడం లేదు. ఖచ్చితంగా రాజకీయం ఉంది. అదేమిటన్నది.. వారికే తెలుసు. కారణం ఏదైనా.. భేటీ వల్ల ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌పై రకరకాల చర్చలకు కారణం అవుతోంది.
ఎన్టీఆర్ స్పందించే చాన్స్ లేనట్లే !
అయితే ఈ అంశంపై ఎన్టీఆర్ స్పందనేమిటన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఎలా స్పందించినా దానికి పెడర్థాలు వస్తాయి. ఊహాగానాలు పెరిగిపోతాయి. అందుకే ఎన్టీఆర్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండదని చెబుతున్నారు.