3 Years of YS Jagan's Rule : ప్రజల ఖాతాల్లో నగదు - ప్రజల వద్దకు పాలన ! మూడేళ్ల జగన్ పాలనలో మెరుపులు ఇవే
ప్రజల ఖాతాల్లో నగదు బదిలీ చేయడం.. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లడం మూడేళ్లలో జగన్ సాధించిన విజయాలుగా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
3 Years of YS Jagan's Rule : ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు. ప్రతి ప్రభుత్వానికి మొదటి మూడేళ్లు గోల్డెన్ పిరియడ్. అధికారం చేతికందినప్పటి నుండి మొదటి మూడేళ్లు ఎలాంటి టెన్షన్స్ లేకుండా చేయాలనుకున్నది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎలాగూ ఎలక్షన్ టెన్షన్ ప్రారంభమయింది. అందుకే మొదటి మూడేళ్లు ప్రభుత్వం ఎంత గొప్పగా చేశాయి.. ఏం చేశాయన్న అంమశాలను అందరూ చూస్తారు. ఈ క్రమంలో మూడేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం.. మూడేళ్లలో ఏం సాధించింది..? ఏం చేయగలిగింది ? రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలిగింది అన్నది ఓ సారి విశ్లేషించి చూద్దాం !
ప్రజల ఖాతాల్లోకి రూ. లక్షా 40 వేల కోట్ల జమ !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాల కింద ప్రజలకు నగదు బదిలీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టో కూడా అదే రీతిలో ఉంది. వివిద పథకాల ద్వారా సగటున ఒక్కో కుటుంబానికి రూ. మూడు నుంచి ఐదు లక్షలు ఏడాదికి ప్రయోజనం చేకూరుస్తామని చెప్పింది. ప్రకారం 32 పథకాలను అమలు చేస్తున్నారు. నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా ఏకంగా మూడేళ్లలో రూ.1.40 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లుగా ప్రభుత్నం ప్రకటించింది. అంటే రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారనుకుంటే ఒక్కొక్కరికి రూ. ఇరవై ఎనిమిది వేలు ప్రభుత్వం ఇచ్చినట్లయింది. ఏడాదికి ఒక్కొక్కిరికి రూ. ఏడు వేలు సగటున అందాయని అనుకోవచ్చు. ఒక్కో కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే్.. ఏటా ఆ కుటుంబం రూ. 28 వేల నగదు ప్రభుత్వం ద్వారా అందిందని ప్రభుత్వం చెబుతోంది. కరోనా సమయంలో ప్రజలు పనులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వం చేసిన సాయం వారిని ఆర్థికంగా నిలబెట్టిందని ప్రభుత్వం ప్రకటించింది.
30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంలో ఇళ్ల స్థలాల పంపిణీని ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో సెంటు , గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర తో దాదాపుగా 30.76లక్షల ఇళ్లస్ధలాల పట్టాల పంపిణీ చేసింది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మా ణం ప్రారంభమైనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆస్తి ఇచ్చినట్లేనని ప్రభుత్వం చెబుతోంది. దీని కోసం 71,811 ఎకరాల భూమిని వివిధ రూపాలుగా సేకరించారు. తాము ఇళ్లు కాదని.. ఊళ్లు కడుతున్నామని సీఎం జగన్ చెబుతూ ఉంటారు. మొత్తంగా 17,005 కాలనీలు వస్తున్నా యని.. రాష్ట్రంలో దాదాపు 13 వేల పంచాయతీలు ఉంటే..కొత్తగా 17 వేల కాలనీలు ఏర్పాటవుతున్నా యన్నారు. కొన్ని చోట్లఆ కాలనీలు చూస్తే.. మున్సి పాల్టీలు, నగర పంచాయతీలు,మేజర్ గ్రామ పంచాయితీ సైజులో కనిపిస్తున్నా యి. అందుకేఇవాళ ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామని సీఎ ంజగన్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.
వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు
ప్రభుత్వ సేవలు మరింత సులభమైన పద్దతిలో ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థను అక్టోబర్ 2, 2019న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేరువైంది. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలను తీసుకెళ్తున్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు 500 సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. గ్రామ సచివాలయాల్లో 14 మంది శాశ్వత ఉద్యోగులను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అందుబాటులో ఉన్నారు. ప్రతి సచివాలయంలో మహిళల రక్షణకు సీఎం వైయస్ జగన్ ముందే ఆలోచన చేశారు. పూర్వం మండల వ్యవస్థ, తాలుకా వ్యవస్థల్లో జరిగిన పరిస్థితులను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఏదైనా ఇబ్బంది వస్తే సచివాలయంలో 72 గంటల్లో సమస్యలకు పరిష్కారం చూపాలని దిశానిర్దేసం చేశారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలు అద్భుతంగా ప్రజలకు సేవ చేశాయని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా దావోస్‌లో కూడా ప్రకటించారు.
నాడు-నేడుతో మారిన స్కూళ్ల రూపురేఖలు !
సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత స్కూళ్ల రూపురేఖలు మార్చాలని నిర్ణయించారు. నాడు–నేడు కింద రూ.16,450.69 కోట్లతో 61,661 స్కూళ్ల రూపు రేఖల మార్పునకు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో 15,713 స్కూళ్లను రూ.3,697.86 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు సమకూర్చారు. మిగతా వాటిలో రెండో దశ కింద పనులు చేపట్టారు. పాఠశాలలను విద్యార్థులకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా, ఉన్నత ప్రమాణాలతో కూడిన జ్ఞానాన్ని అందించే పవిత్ర దేవాలయాలుగా ప్రభుత్వం భావిస్తోంది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా పాఠశాలల్లో చదువులకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమంలో అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. రన్నింగ్ వాటర్ కలిగిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, మేజర్.. మైనర్ రిపేర్లు, పెయింటింగ్.. ఫినిషింగ్, స్కూలు విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల ఏర్పాటు, విద్యార్థులు, టీచర్లతో సహా పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు.. తదితర వసతులను కల్పిస్తోంది.
కొత్త జిల్లాల ఏర్పాటు !
జగన్ పాలనలో జిల్లాలు పెరిగాయి. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా.. 13 జిల్లాలను 26గా మార్పు చేశారు. ఏపీలో 26 జిల్లాలు, 7౩ రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. ‘కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం.. వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని.. రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు జరిగిందని ప్రభుత్వం ప్రకటిచింది. ఇప్పుడు కొత్త జిల్లాల వారీగానే పాలన సాగుతోంది.