Telangana Year Ender 2025: తెలంగాణ రాజకీయాల్లో ఈ ఏడాది రేవంత్ రెడ్డిదే - 2025 కీలక పరిణామాలు ఇవే
Telangana politics 2025: ఈ ఏడాది తెలంగాణ రాజకీయాల్లో జూబ్లిహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు సహా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ వివరాలను ఓ సారి అవలోకనం చేసుకుందాం.

Telangana politics Year Ender 2025: 2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాలకు మైలురాయిగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ పోటీలు ప్రధానాంశాలుగా నిలిచాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో 'తెలంగాణ రైజింగ్' విజన్‌తో గ్లోబల్ సమ్మిట్ నిరవహించారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో ఆధిక్యం చూపించారు.
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లిహిల్స్ ఉపఎన్నిక అత్యంత ఉత్కంఠ రేపింది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యమయింది. ఈ కారణంగా ఆరు నెలల పాటు రాజకీయంగా ఉత్కంఠ రేపింది. చివరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పాతిక వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నిక బూస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల ఫలితం మరింత బలాన్నిచ్చిందని అనుకోవచ్చు.
స్థానిక సంస్థల సమరం
వాయిదా పడుతూ వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఈ ఏడాది అతిపెద్ద ఘట్టం. పల్లెల్లో పట్టు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరిగిన త్రిముఖ పోరు ఈ ఏడాది ప్రధాన హైలైట్. ప్రభుత్వ పనితీరుకు ఇది రెఫరెండంగా మారగా, గ్రామీణ స్థాయిలో తన పట్టు నిలుపుకోవడానికి బీఆర్ఎస్, విస్తరించడానికి బీజేపీ, పట్టు సాధించడానికి కాంగ్రెస్ చేసిన పోరాటం రాజకీయ వేడిని పెంచింది. ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. రేవంత్ రెడ్డి తన నాయకత్వ విజయాల్లో మరొకటి చేరినట్లయింది.
ఎమ్మెల్యేల అనర్హత - స్పీకర్ నిర్ణయంపై కోర్టు ఆదేశాలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం పడింది. ఈ అంశంపై సుప్రంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఇది పార్టీల మధ్య ఫిరాయింపుల సంస్కృతిపై చర్చకు దారితీయడమే కాకుండా, ఫిరాయించిన నేతల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి అయింది. కోర్టు స్పందనను బట్టి స్పీకర్ నిర్ణయం ప్రకటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది కీలకం.
కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదిక
రాజకీయ ప్రకంపనలు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను ఈ ఏడాది సమర్పించింది. బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేయడం, దర్యాప్తు సంస్థల ఎంట్రీతో మాజీ ప్రభుత్వ పెద్దల చుట్టూ ఉచ్చు బిగియడం ఈ ఏడాది ప్రధాన హైలైట్. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీబీఐకి సిఫారసు చేసింది. సీబీఐ ఇంకా రంగంలోకి అడుగు పెట్టలేదు.
కుల గణన నివేదిక వెల్లడి - రిజర్వేషన్ల రగడ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. దీని ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచే ప్రక్రియ మొదలైంది. ఇది సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పులకు పునాది వేసింది. కానీ న్యాయపరమైన చిక్కుల వల్ల రిజర్వేషన్ల ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇది రాజకీయంగా ప్రకంపనలకు కారణం అవుతోంది. వచ్చే ఏడాది కూడా ఇవి కీలకంగా మారనున్నాయి.
రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ
పాలనలో వేగం పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది క్యాబినెట్ విస్తరణ చేపట్టారు. సామాజిక వర్గాలు, ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూ కొత్త మంత్రులను తీసుకోవడం, ఆశావహుల్లో వ్యక్తమైన అసంతృప్తిని చల్లార్చడం ప్రభుత్వానికి ఒక పరీక్షగా మారింది. రెండు సార్లు మంత్రివర్గాన్ని విస్తరించి కొత్తగా నలుగురికి పదవులు ఇచ్చారు. వారంతా బీసీ,ఎస్సీ, మైనార్టీ వర్గానికి చెందినవారే.
రైతు భరోసా & రుణమాఫీ పూర్తి స్థాయి అమలు
గతంలో మిగిలిపోయిన రైతులకు రుణమాఫీ పూర్తి చేయడం , రైతు భరోసా కింద ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయాన్ని పక్కాగా అమల్లోకి తేవడం ద్వారా ప్రభుత్వం రైతుల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేసింది. అయితే విపక్షాలు మాత్రం క్షేత్రస్థాయి లోపాలపై నిరసనలు కొనసాగించాయి.
గ్రూప్-1 నియామకాలు & ఉపాధ్యాయ కొలువులు
నిరుద్యోగుల సుదీర్ఘ పోరాటం ఫలించి, గ్రూప్-1 అధికారుల నియామక పత్రాల అందజేత మరియు మెగా డీఎస్సీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు రావడం ఈ ఏడాది సానుకూల పరిణామం. యువత ఓట్లను ఆకట్టుకోవడంలో ప్రభుత్వం ఒక మెట్టు ఎక్కినట్లయింది.
మొత్తం మీద 2025 తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. పాలక పక్షం తన హామీల అమలులో నిలదొక్కుకోగా, ప్రతిపక్షాలు ఉనికి చాటుకోవడానికి తీవ్రంగా శ్రమించిన ఏడాది ఇది.





















