New Year Wishes: సీఎంలు జగన్, రేవంత్ తో పాటు ప్రముఖుల న్యూ ఇయర్ విషెస్ ఇలా
Revanth Reddy New Year Wishes: ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
AP CM Jagan New Year Wishes: హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy New Year wishes) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మీ సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించి, పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం అన్నారు. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు.
వైఎస్ జగన్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు..
ఏపీ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు (YS Jagan New Year Wishes) తెలిపారు. 2024లో ప్రతి ఇంటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చే ఏడాది దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ విషెస్
తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నిండాలని ఆకాంక్షించారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నూతన సంవత్సరం 2024 లోకి (సోమవారం) అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది.. కొత్త ఆశలు, కొత్త కోరికలు, కొత్త లక్ష్యాలు, కొత్త ఆశయాలు, కొత్త నిర్ణయాలు, కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం మీతో కలకాలం ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని, తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ భట్టి విక్రమార్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు న్యూ ఇయర్ విషెస్..
‘తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో కొత్త విశ్వాసంతో... అవినీతికి, అశాంతికి, అక్రమాలకు చోటులేని ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేసేందుకు సంకల్పిద్దాం. మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకుందాం. ప్రతి తెలుగువాడిని నిపుణతగల విశ్వమానవుడిగా తీర్చిదిద్దే బృహత్కార్యానికి... పేదరికానికి, అసమానతలకు తావులేని నవశకానికి నాంది పలుకుదాం. కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ...’ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు: తెలంగాణ డీజీపీ రవిగుప్త
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డీజీపీ రవిగుప్త నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల శాంతి, భద్రత, సంక్షేమం కోసం నిబద్ధతతో కృషి చేయడమే తమ ప్రధాన కర్తవ్యమని, నూతన సంవత్సరంలోనూ ఈ నిబద్ధత మరింత పెంచి, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుందని రవిగుప్త తెలిపారు. ప్రతి ఒక్కరి హక్కులను, ఆసక్తులను కాపాడటమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
నూతన సంవత్సరంలో జీరో డ్రగ్ పాలసీ, ట్రాఫిక్ నిబంధనలు, నేరాల నిరోధం, మహిళా భద్రత, సైబర్ నేరాల నిర్మూలన వంటి విషయాల్లో ప్రత్యేక దృష్టి పెడతామని డీజీపీ తెలిపారు. ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే రాష్ట్రాన్ని మరింత సురక్షితంగా, శాంతియుతంగా తీర్చిదిద్దగలమని, అందులో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు హుందాగా పాల్గొని, సంతోషంగా గడపాలని, రోడ్డు భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవిగుప్త కోరారు. 2024 సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఆనందాలు, విజయాలు, ఆరోగ్యం మరియు శ్రేయస్సును తీసుకురావాలని అభిలాషించారు.