Srilanka Crisis: గౌరవప్రదంగా పదవి నుంచి తప్పుకోండి, శ్రీలంక అధ్యక్షుడికి మాజీ క్రికెటర్ స్వీట్ వార్నింగ్
శ్రీలంక అధ్యక్ష పదవి నుంచి గొటబయ రాజపక్స తప్పుకోవాలని మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య హెచ్చరించారు. ఎప్పటికైనా ప్రజలే విజయం సాధిస్తారని ఆయన స్పష్టం చేశారు.
అధ్యక్షుడిగా కొనసాగే అర్హతే లేదు..
గొటబాయ రాజపక్సకు శ్రీలంక అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదంటూ అక్కడి ప్రజలు చాన్నాళ్లుగా నిరసనలు చేపడుతున్నారు. వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు రోడ్లకే పరిమితమైన ఆందోళనలు, ఇప్పుడు రాజపక్స ఇంటిపైనే దాడి చేసే స్థాయికి తీవ్రమయ్యాయి. బారికేడ్లను పగలగొట్టి మరీ రాజపక్స ఇంట్లోకి వెళ్లారు నిరసనకారులు. శ్రీలంక క్రికెట్ మాజీ కెప్టన్ సనత్ జయసూర్య కూడా ఈ నిరసనలో పాలు పంచుకున్నారు. "పరిపాలనలో పూర్తిగా విఫలమైన నేత మాకు అవసరం లేదు" అంటూ ఆందోళనకారులతో పాటునినదించారు. గతంలో ఎప్పుడూ దేశం ఇలా ఏకతాటిపైకి రావటం చూడలేదని వెల్లడించారు. శ్రీలంక ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. శ్రీలంక ప్రజలు త్వరలోనే విజయం సాధిస్తారన్న ఆయన, ఎలాంటి అశాంతి సృష్టించకుండా నిరసనలు కొనసాగించాలని సూచించారు. ఇదే విషయాన్ని ట్విటర్‌లోనూ వెల్లడించారు. నిరసనలో పాల్గొన్న ఫోటోలు ట్వీట్‌లో జత చేశారు.
Ialways stand with the People of Sri Lanka. And will celebrate victory soon. This should be continue without any violation. #Gohomegota#අරගලයටජය pic.twitter.com/q7AtqLObyn
— Sanath Jayasuriya (@Sanath07) July 9, 2022
The siege is over. Your bastion has fallen. Aragalaya and peoples power has won. Please have the dignity to resign now ! #GoHomeGota
— Sanath Jayasuriya (@Sanath07) July 9, 2022
నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసులు
"మీ కంచుకోట కూలిపోయింది. ప్రజలే గెలిచారు. ఇప్పటికైనా గౌరవప్రదంగా పదవి నుంచి తప్పుకోండి" అని మరో ట్వీట్ కూడా చేశారు. జయ సూర్యతో పాటు మరికొందరు శ్రీలంక క్రికెటర్లు ప్రజలకు మద్దతుగా నిలిచారు. వికెట్ కీపర్ కుమార సంగక్కర, మహెలా జయవర్దనే రాజపక్సకు వ్యతిరేకంగా నిరసనలకు సపోర్ట్ చేస్తున్నారు. "మునుపెన్నడూ ప్రజలు ఇలా ఏకం అవటం చూడలేదు. ఎలాంటి అల్లర్లు జరగక ముందే ప్రశాంత వాతావరణంలో రాజీనామా చేయండి" అని జయసూర్య ట్వీట్ చేశారు. రాజపక్స రాజీనామా చేయాలన్న డిమాండ్ మార్చ్ నుంచే వినిపిస్తోంది. అయితే రాజపక్స మాత్రం తన నివాసంలో దాక్కున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా, ఆందోళనలు ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గటం లేదు.
Also Read: ABP Centenary Celebration: ప్రజలే మాకు ముఖ్యం, సామాన్యులకు సేవ చేయటమే మా అజెండా: ఏబీపీ చీఫ్ ఎడిటర్