(Source: ECI/ABP News/ABP Majha)
ABP Centenary Celebration: ప్రజలే మాకు ముఖ్యం, సామాన్యులకు సేవ చేయటమే మా అజెండా: ఏబీపీ చీఫ్ ఎడిటర్
ఆనంద్ బజార్ పత్రిక గ్రూప్ (ABP Group) వందో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఏబీపీ గ్రూప్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ కోల్‌కతాలోని విశ్వబంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో ఈ శతవార్షికోత్సవాలను ప్రారంభించారు
పాలకుల కన్నా తమకు ప్రజలే ముఖ్యమని, సామాన్యులకు సేవ చేయటమే తమ ప్రధాన అజెండా అని ఏబీపీ గ్రూప్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ వెల్లడించారు. మానవత్వమే మతమని ఉపదేశించిన రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తి మంత్రాన్నే, ఏబీపీ గ్రూప్ తన ఫిలాసఫీగా మార్చుకుందని స్పష్టం చేశారు. ఏబీపీ గ్రూప్ వందో సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా... కోల్‌కతాలోని విశ్వబంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో శతవార్షికోత్సవాన్ని అతిదేబ్ సర్కార్ ప్రారంభించారు. ఈ ప్రస్థానంలో ఎదురైన సవాళ్లను, సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
బెంగాల్‌లో పుట్టి దేశమంతా విస్తరించి..
"వందేళ్ల క్రితం..అంటే 1922లో భారత్..బ్రిటీషర్ల పాలనలో నలుగుతోంది. ఆంగ్లేయుల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న కాలమది. అప్పుడే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటీషర్లు ఈ ఉద్యమం ఉద్ధృతం కాకముందే అణిచివేశారు. గాంధీని అరెస్ట్ చేశారు. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచే ఓ పత్రిక పుట్టుకొచ్చింది. మహాత్మా గాంధీ ఆశయాలు, ఆకాంక్షలకు మద్దతు పలుకుతూ ఎర్ర ఇంకుతో బెంగాలీలో మొట్టమొదటి "సాయంకాల పత్రికను" ప్రచురించింది. ఈ ఎరుపు రంగుని ఆంగ్లేయులు "హెచ్చరిక"గా భావించారు. ఆ పత్రిక పేరే "ఆనంద్ బజార్ పత్రిక". ఆంగ్లేయులకు వ్యతిరేకంగా, స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ప్రజల పక్షాన నిలబడి ఆదరణ సంపాదించుకుంది ఏబీపీ. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఆనంద్ బజార్ పత్రికకు పాతికేళ్లు నిండాయి. "ఏబీపీ ఉన్నది ప్రభుత్వాల కోసమో, నాయకుల కోసమో కాదు. ప్రజల కోసం. ప్రజాసేవ కోసం" అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఏబీపీ ఇప్పుడు వందో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంది" అని అతిదేబ్ సర్కార్ వివరించారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలే మంత్రంగా..
"1933 నాటికి భారత్‌లో స్వాతంత్ర ఉద్యమ కాంక్ష బలపడింది. అప్పటికే ప్రజా పక్షాన నిలబడి ఆనంద్ బజార్ పత్రిక గురించి ప్రముఖులందరికీ తెలిసింది. అప్పుడే రవీంద్ర నాథ్ ఠాగూర్ ఏబీపీకి ఇలా హితోపదేశం చేశారు. "మీరు రాసేది ఏదైనా దేశం కోసమే కావచ్చు. కానీ దేశాన్ని మించింది ఒకటి ఉంది. అదే "నిజం". మీ దేశాన్ని ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలని అనుకుంటే, మానవత్వాన్ని, ప్రజలవైపు నిలబడటాన్ని మాత్రం మర్చిపోవద్దు" అని సూచించారు. అప్పటి నుంచి ఈ మాటల్నే మార్గదర్శిగా మార్చుకుంది ఏబీపీ" అని ఏబీపీ గ్రూప్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ వెల్లడించారు.
ప్రతి సందర్భంలోనూ ప్రజలవైపే..
"1972 నాటికే దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికగా ఎదిగింది ఏబీపీ. పత్రికా స్వేచ్ఛపై దాడి జరుగుతున్న ఆ రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. "అధికారంలో ఉన్న వాళ్లకు కొమ్ము కాయటం వల్ల కాదు, ప్రజా పక్షాన నిలబడటం వల్లే ఈ ఘనత సాధించాం" అని 50 ఏళ్ల వేడుకల్లో తేల్చి చెప్పారు అప్పటి చీఫ్ ఎడిటర్ అశోక్ కుమార్. 75వ వార్షికోత్సవాల నాటికి, 1998లో టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది ABP.అప్పటి నుంచి ఇప్పటి వరకూ పలు భాషల్లో, పలు రాష్ట్రాల్లో ఆనంద్ బజార్ పత్రిక గ్రూప్ (ABP Group) విస్తృతమైంది. నెలనెలా టీవీ, డిజిటల్, ప్రింట్, రేడియో మాధ్యమాల ద్వారా సుమారు 30కోట్ల మందికి చేరువవుతోంది. ఇది అంత సులువుగా ఏమీ సాధ్యం కాలేదు. ఈ ప్రయాణంలో కొన్నిగండాలనూ దాటుకుని వచ్చింది ఏబీపీ. 1999లో కోల్‌కతా లోని ఏబీపీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అయినా మరుసటి రోజు అందరు ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చారు. ఎప్పటి లాగే పత్రికను ప్రింట్ చేసి మార్కెట్‌లోకి పంపారు. ఏబీపీ నిబద్ధతను ప్రజలకు చాటి చెప్పిన ఘటనలు ఇలాంటివెన్నో జరిగాయి" అని తెలిపారు.
విలువలు పాటిస్తూనే సమాచారం అందిస్తాం..
"అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు పడిపోయింది. అన్ని వస్తు, సేవల ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ అగ్రస్థానంలో నిలబడాలని లక్ష్యం నిర్దేశించుకోవటం గొప్ప విషయమే. కానీ అంతర్గత సమస్యలు ఈ లక్ష్యం చేరుకోకుండా అడ్డుకుంటున్నాయి. ఆర్థిక సంస్కరణలను మనం పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీర్ఘ కాలిక వృద్ధిని దష్టిలో పెట్టుకుని సంస్కరణలు ఉండాలి. కొవిడ్ వల్ల చాలా మంది జీవితాలు తలకిందులై పోయాయి. నిరుద్యోగమూ పెరుగుతోంది. ఈ సమస్యలకు తోడు సమాజంలో అంతర్గత కలహాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా కొందరు రాజకీయ నాయకులు ప్రజల మధ్య విభేదాలకు కారణమవుతున్నారు. మతం పేరిట ప్రజలు వీధుల్లో ఘర్షణ పడుతున్నారు. పొలిటికల్ పోలరైజేషన్ వల్ల పార్టీలు బలపడుతున్నాయి గానీ, దేశం బలపడటం లేదు. ఇండిపెండెంట్ జర్నలిజంలో విలువలు పాటిస్తూనే సమాచారం అందిస్తాం. ఏబీపీ ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది కానీ అధికారానికి, పాలకులకు కాదని" ఏబీపీ గ్రూప్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ స్పష్టం చేశారు.