Wrestlers Protest: పతకాలు గంగలో కలపాలనుకోవడం వాళ్ల ఇష్టం, ఆరోపణలు నిజమైతే అరెస్ట్ అవుతాను - బ్రిజ్ భూషణ్
Wrestlers Protest: రెజ్లర్లు తమ పతకాలను గంగలో కలపాలని నిర్ణయం తీసుకోవడంపై బ్రిజ్ భూషణ్ స్పందించారు.
Wrestlers Protest:
హరిద్వార్‌లో ఉద్రిక్తత..
దాదాపు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపడుతున్న రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో కలిపేందుకు వెళ్లడం సంచలనమైంది. అక్కడ రైతు సంఘం నేత టికాయత్ వారిని నిలువరించారు. ఈ ఘటనతో హరిద్వార్‌లో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపైనే కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు రెజ్లర్లు. తమ బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే..ఈ ఘటనపై WHI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ స్పందించారు. ఇప్పటికే తనపై కేసులు నమోదయ్యాయని, పోలీసులు విచారణ కూడా చేపడుతున్నారని స్పష్టం చేశారు. వాళ్ల ఆరోపణల్లో నిజం ఉంటే పోలీసులు కచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారని తేల్చి చెప్పారు.
"రెజ్లర్లు తమ పతకాలను గంగలో కలపాలని నిర్ణయం తీసుకుంటే దానికి నేనేం చేయను. అది వాళ్ల అభిప్రాయం. పోనీ అక్కడి వరకూ వెళ్లిన వాళ్లు గంగలో కలిపారా...? లేదు. నరేష్ టికాయత్‌కు ఇచ్చారు. ఈ విషయంలో వాళ్ల స్టాండ్ ఏంటో స్పష్టంగానే అర్థమవుతోంది. నేను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అది జరిగే పని కాదు. నేను రాజీనామా చేయను. నా పదవీ కాలం ముగిసింది. త్వరలోనే మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. నేను అరెస్ట్ అవుతానా లేదా అన్నది చెప్పలేను. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అంతా ఢిల్లీ పోలీసుల చేతుల్లోనే ఉంది. ఆరోపణలు నిజం అని తేలితే కచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఈ విషయంలో నాకెలాంటి సందేహాలు, సమస్యలు లేవు"
- బ్రిజ్ భూషణ్ సింగ్, WFI చీఫ్
అయితే...ఈ ఘటన తరవాత రెజ్లర్లో మరోసారి కేంద్రానికి 5 రోజుల అల్టిమేటం ఇచ్చారు. 5 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. WGI చీఫ్ పదవి నుంచి బ్రిజ్ భూషణ్‌ని తొలగించాలని తేల్చి చెబుతున్నారు. ట్విటర్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
"మే 28వ తేదీన ఢిల్లీలో ఏం జరిగిందో దేశ ప్రజలంతా చూశారు. పోలీసులు మమ్మల్ని ఎలా హ్యాండిల్ చేశారో గమనించారు. ప్రశాంతంగా నిరసనలు చేపడుతున్న మమ్మల్ని అరెస్ట్ చేశారు. మాపైన కేసులు కూడా పెట్టారు. లైంగిక ఆరోపణలు చేయడం తప్ప ఇంకేమైనా నేరాలకు పాల్పడ్డామా..? అలాంటి బాధితులకు జరిగే న్యాయం ఇదేనా? పోలీసులంతా మమ్మల్ని నేరస్థుల్లా చూస్తున్నారు. పోస్కో యాక్ట్ తొలగించాలని బ్రిజ్ భూషణ్ బహిరంగంగా చెబుతుండటం షాకింగ్‌గా ఉంది. మమ్మల్ని ఇంత దారుణంగా చూస్తున్నప్పుడు మేం దేశం కోసం పతకాలు తీసుకొచ్చి మాత్రం ఏం లాభం"
- రెజ్లర్లు
— Vinesh Phogat (@Phogat_Vinesh) May 30, 2023
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు తమ పతకాలను గంగానదిలో పారవేయడానికి వెళ్లగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రైతు ఉద్యమ నేత నరేష్ టికాయత్ రెజ్లర్ల అంశంపై జోక్యం చేసుకున్నారు. హరిద్వార్ కు వెళ్లి గంగా నదిలో తమ పతకాలను పారవేస్తున్న రెజ్లర్లను నరేష్ టికాయత్ నిలువరించారు. వారి సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషిద్దామని, ప్రస్తుతానికి పతకాలను గంగా నదిలో పారవేయవద్దని కోరారు. గంగలో పారవేసేందుకు రెజ్లర్ల చేతిలో ఉన్న పతకాల మూటను రైతు ఉద్యమ నేత టికాయత్ తీసుకున్నారు. ఐదు రోజుల గడువు ఇవ్వాలని, రెజ్లర్ల సమస్యకు పరిష్కారం వెతుకుదామన్నారు. ఓవైపు కన్నీటి పర్యంతమవుతూనే మరోవైపు ఆయనపై గౌరవంతో నరేష్ టికాయత్ మాటకు కట్టుబడి హరిద్వార్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు రెజ్లర్లు.
Also Read: Rahul Gandhi in US: ఆ దేవుడు దిగొస్తే ఆయనకు కూడా మోదీ ఉపదేశాలు ఇవ్వగలరు - రాహుల్ గాంధీ సెటైర్లు