Southkorea Plane Crash: నీ కలలకు తోడుగా మీ నాన్న - కానీ, ఆ బాలుడి ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్లైట్ జర్నీ ఇదే, ఇంతకంటే విషాదం ఉంటుందా?
Viral News: ఘోర విమాన ప్రమాదం.. మృతుల్లో అత్యంత పిన్న వయస్కుడు. మూడేళ్ల ఆ బాలుడి ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్లైట్ జర్నీ ఇదే కావడం అత్యంత విషాదం. పసి మనసు సంతోషం వెనుక కన్నీటి కథ ఇదే..
3 Years Old Boy Died In South Korea Plane Crash: ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తోన్న వయసు. తొలిసారి విమానం ఎక్కుతున్నానన్న ఆనందం. అందులోనూ విండో సీట్. ఇంకేముంది.. నింగిలో మేఘాలను, అంతటి పై నుంచి కింది నగరాన్ని ఒకేసారి చూస్తానన్న ఉత్సాహం. ఆ బుడతడి అల్లరి మామూలు కాదు. విమానం ఎక్కినప్పటి నుంచి సరికొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా ఆ బాలుడి కళ్లల్లో ఓ తెలియని కళ. అవన్నీ నిమిషాల్లోనే ఆవిరయ్యాయి. ఎంతో గారాబంగా పెంచుకుంటున్న తమ కుమారుడిని తొలిసారి విమానం ఎక్కిస్తున్నామని ఉప్పొంగిన ఆ దంపతుల ఆశలు అంతలోనే అడియాశలయ్యాయి. విండో సీట్‌లో కూర్చుంటూ తమ బిడ్డ చేసిన అల్లరిని ఆ దంపతులు ఫోటోలు తీసి మురిసిపోయారు. ఆ దృశ్యాలను వారు కనులారా ఆస్వాదించనే లేేదు. ఆ బాలుడికి ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లేన్ జర్నీ ఇదే అవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. దక్షిణ కొరియా విమాన ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోని నెట్టింది.
View this post on Instagram
తొలిసారి విమాన ప్రయాణం
దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తన జీవితంలో తొలిసారి విమాన ప్రయాణం చేసిన మూడేళ్ల బాలుడు సైతం ఈ ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. థాయ్‌లాండ్‌కు చెందిన కాంగ్ కో (43) అతని భార్య జిన్ లీ సియోన్ (37) వారి మూడేళ్ల కుమారుడితో కలిసి హాలిడే ఎంజాయ్ చేసేందుకు విదేశీ పర్యటనకు బయల్దేరారు. విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం తమ చిన్నారి పాస్‌పోర్ట్‌పై తొలిసారి ముద్ర పడబోతోందని.. తనతో కలిసి మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నామని కాంగ్ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన కుమారుడు ఫ్లైట్ ఎక్కగానే తొలి 'ఫ్లైట్ జర్నీ' జ్ఞాపకాలను అతనికి అందించాలని బాలుడు విండో నుంచి బయటకు చూస్తోన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు మినహా అందులోని వారంతా ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన అత్యంత పిన్న వయస్కుడు ఆ బాలుడే కావడంతో అతని ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఘోర విమాన ప్రమాదం
కాగా, దక్షిణ కొరియాలో ఇటీవలే ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. జెజు ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737-800 జెట్ విమానం.. థాయ్‌లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో సియోల్‌కు 290 కిలోమీటర్ల దూరంలోని ముయాన్‌కు బయలుదేరింది. విమానం ల్యాండ్ అవుతుండగా ముందుభాగంలోని ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదు. దీంతో ప్లేన్ రన్ వేపై జారుతూ.. నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణగోడ వైపు దూసుకెళ్లి ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టి పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తప్ప అందరూ ప్రాణాలు కోల్పోయారు.