Only Three: ప్రపంచంలో ఎక్కడికైనా పాస్‌పోర్టు వీసాల్లేకుండా వెళ్లేందుకు ముగ్గురికే అనుమతి - వాళ్లెవరో తెలుసా?
Travel Without a Passport: ఏ దేశానికి వెళ్లాలన్నా పాస్ పోర్టు , వీసా ఉండాలి. కానీ ముగ్గురికి మాత్రం ఇవేమీ అక్కర్లేదు. ఎక్కడికి కావాలంటే అక్కడికి సిటీ బస్సు ఎక్కినట్లుగా ఎక్కి వెళ్లిపోవచ్చు.

Travel Anywhere Without a Passport:ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి. కానీ, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్రపంచంలో కేవలం ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఎటువంటి పాస్‌పోర్ట్ లేకుండా ఏ దేశానికైనా ప్రయాణించే అరుదైన హక్కు ఉంది. ఆ ముగ్గురు ఎవరు? వారికి ఈ ప్రత్యేక అధికారం ఎలా లభించింది?
పాస్‌పోర్ట్ అవసరం లేని ఆ ముగ్గురు వ్యక్తుల్లు చాలా పవర్ ఫుల్ అని సులువుగానే అర్థమవుతుంది. అమెరికా అధ్యక్షుడికి కూడా ఈ అవకాశం లేదు. ముగ్గురిలో మొదటి వ్యక్తి బ్రిటన్ రాజు. ప్రస్తుతం కింగ్ చార్లెస్ III. ఈయన ఎక్కడికి వెళ్లినా పాస్ పోర్టు వీసాలు అక్కర్లేదు. కానీ రాజు వెడలె అన్న చందంగా ఆయనతో పాటు వెళ్లే అందరికీ చివరికి ఆయన భార్యతో సహా అందరికీ వీసా,పాస్ పోర్టులు ఉండాల్సిందే. ఇక రెండో వ్యక్తి జపాన్ చక్రవర్తి, మూడో మనిషి జపాన్ రాణి. ఈ ముగ్గురి వద్ద అధికారికంగా ఎటువంటి పాస్‌పోర్ట్ ఉండదు. సాధారణంగా పాస్‌పోర్ట్ అనేది ఒక దేశాధినేత తన పౌరుడికి ఇచ్చే రక్షణ పత్రం. కానీ, ఈ దేశాల నిబంధనల ప్రకారం ఆ దేశాధినేతల పేరిటే పాస్‌పోర్టులు జారీ అవుతాయి కాబట్టి, వారికే పాస్‌పోర్ట్ ఉండటం అనేది సాంకేతికంగా అవసరం లేదని భావిస్తారు.
బ్రిటన్ రాజు విషయానికి వస్తే, గతంలో రాణి ఎలిజబెత్ II, ఇప్పుడు కింగ్ చార్లెస్ III ఈ హోదాను అనుభవిస్తున్నారు. బ్రిటన్ పాస్‌పోర్ట్‌లపై బ్రిటన్ రాజు పేరిట ఈ పౌరుడిని అనుమతించవలసిందిగా కోరుతున్నాం అనే అర్థం వచ్చే వాక్యాలు ఉంటాయి. తన పేరిటే జారీ అయ్యే పత్రాన్ని రాజే ధరించడం సబబు కాదనేది అక్కడి సంప్రదాయం. రాజు విదేశాలకు వెళ్లేటప్పుడు ఆయన వెంట ఉండే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ద్వారా కేవలం ఒక అధికారిక పత్రాన్ని మాత్రమే చూపిస్తారు. అయితే, రాజ కుటుంబంలోని మిగిలిన వారందరికీ మాత్రం సాధారణ పౌరులలాగే పాస్‌పోర్టులు ఉంటాయి.
మరోవైపు, జపాన్ చక్రవర్తి , మహారాణికి కూడా ఇలాంటి ప్రత్యేక హోదానే ఉంది. జపాన్ విదేశాంగ శాఖ మే 1971లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, చక్రవర్తి, ఆయన భార్యకు పాస్‌పోర్ట్ అవసరం లేదని తేల్చి చెప్పారు. వారు ఏదైనా దేశానికి వెళ్లే ముందు ఆ దేశానికి ముందస్తుగా సమాచారం పంపిస్తారు. ఆయా దేశాలు వారికి అత్యున్నత దౌత్య ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలుకుతాయి. ఇలా ప్రపంచంలోని కోట్లాది మందిలో కేవలం ఈ ముగ్గురికి మాత్రమే సరిహద్దులు లేని ప్రయాణం చేసే వెసులుబాటు ఉంది.
కేవలం రాజ్యాంగబద్ధమైన దేశాధినేతలుగా ఉండటం వల్ల మాత్రమే కాకుండా, అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో వారి గౌరవార్థం ప్రపంచ దేశాలన్నీ ఈ మినహాయింపును అంగీకరిస్తాయి. ఒకవేళ వీరు కాకుండా మరే దేశాధినేత అయినా అధ్యక్షులు లేదా ప్రధానులు దేశాలకు వెళ్లాల్సి వస్తే, వారికి ప్రత్యేక డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి.





















