Balochistan History: బలోచిస్తాన్ చరిత్ర ఏంటి ? ప్రత్యేక దేశాన్ని బలోచిస్థాన్ ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు ?
కలత్ అంటే ఇప్పుడు బలోచిస్థాన్ ప్రాంతాన్నే నాడు కలత్ గా పిలిచేవారు. కలత్ ను మీర్ మెహ్రబ్ ఖాన్ అహ్మద్ జాయ్ 1817 నుండి 1839 వరకు పాలించారు. ఆ తర్వాత బ్రిటిషర్లు ఈ ప్రాంతంలో అడుగుపెట్టారు.

Balochistan Interesting Facts | పహల్గాం దాడి తర్వాత ఇండియా పాకిస్థాన్ పై విజయవంతంగా దాడులు ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాద కేంద్రాలను , ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇది జరిగిన తర్వాత పాక్ భారత్ పై డ్రోన్లు, యుద్ద విమానాలు, క్షిపణులతో దాడులకు పాల్పడేందుకు సిద్ధమయింది. అయితే మన ఆర్మీ ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేసి విజయం సాధించింది. ఈ తరుణంలో బలుచిస్తాన్ ఆర్మీ పాక్ పై దాడులకు పాల్పడింది. బలుచిస్థాన్ ప్రాంతం తమ ఆధీనంలోకి వచ్చిందని ప్రకటించుకుంది. అయితే అసలు బలుచిస్థాన్ చరిత్ర ఏంటి. ఏందుకు వారు ప్రత్యేక దేశం కోరుకుంటున్నారో తెలుసుకుందాం.
బలోచిస్థాన్ పేరుకు అర్థం ఏంటంటే...?
బలోచిస్థాన్ అనే పదం బలుచ్ , స్థాన్ అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. బలుచ్ అనేది ఆ ప్రాంతంలో నివసించే ప్రజల్ని సూచిస్తుంది. వీరు ఇండో - ఇరాన్ మూలాలు కలిగి ఉన్న గిరిజనులు. వీరు బలోచి భాషను మాట్లాడతారు. బలో అంటే బల్ అంటే బలోచ్ ప్రజలను ఓచ్ అంటే పాత ఇరానియన్ భాష ప్రకారం జాతి లేదా సమూహం అనే అర్థం వస్తుంది. ఇస్తాన్ అనేది పర్షియన్ పదం. అంటే ప్రత్యేక ప్రాంతం లేదా దేశం అనే అర్థం వస్తుంది. బలోచిస్తాన్ అంటే పాకిస్థాన్ లాగా బలూచ్ ప్రజలు నివసించే దేశం అనే అర్థం వస్తుంది.
బలోచిస్థాన్ చరిత్ర లోకి వెళ్తే...
బలోచిస్థాన్ చరిత్రలోకి వెళ్తే 1839లో బ్రిటిష్ సైన్యం కలత్ పై దాడి చేసింది. కలత్ అంటే ఇప్పుడు బలోచిస్థాన్ ప్రాంతాన్నే నాడు కలత్ గా పిలిచేవారు. కలత్ ను మీర్ మెహ్రబ్ ఖాన్ అహ్మద్ జాయ్ 1817 నుండి 1839 వరకు పాలించారు. బ్రిటీష్ వారు ఆప్ఘనిస్తాన్ పై దాడి చేసినప్పుడు కలత్ రాజు మీర్ మెహ్రబ్ ఖాన్ అందుకు ఆంగ్లేయులకు సహకరించలేదు. ఈ కారణంగా 1839 లో కలత్ పై బ్రిటీషర్లు దాడి చేసి మెహ్రబ్ ఖాన్ ను చంపివేశారు. స్థానిక గిరిజన సర్థార్ నాయకులతో ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయ పాలకులు తమ అదుపులో పెట్టుకున్నరు. ఇది బలోచ్ గిరిజన ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ఈ కారణంగా తరచూ ఆంగ్లేయులపై వీరు తిరుగుబాటు చేసే రు. 1920ల నాటికి బలోచ్ జాతీయవాదానికి అంకురార్బణ జరిగింది. ప్రజల్లో తీవ్ర స్వాంతంత్ర కాంక్ష పెరిగింది.
1929లో అంజుమన్ - ఎ- ఇత్తెహాద్ - ఎ- బలోచిస్తాన్ అనే సంస్థ పురుడు పోసుకుంది. ఈ సంస్థ బలోచ్ సంస్కృతిని కాపాడటం, కలోత్ రాజ్య స్వతంత్ర కోసం అంటే బలోచిస్థాన్ ఏర్పాటు డిమాండ్ లక్ష్యంగా పని చేయడం ప్రారంభించింది. వలస రాజ్యాలకు స్వాతంత్రం ఇచ్చే సమయానికి అంటే భారత దేశ విభజన సమయానికి కలత్ రాజ్యం మీర్ అహ్మద్ యార్ ఖాన్ నాయకత్వంలో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. సాక్షాత్తు పాకిస్థాన్ పితగా చెప్పుకునే మహమ్మద్ అలీ జిన్నా ఈ డిమాండ్ కు మద్ధతు ఇవ్వడం గమనార్హం. కలత్ స్వతంత్రతను ముస్లింలీగ్ గౌరవిస్తుందని 1947 ఆగష్టు 11వ తేదీన ఇరువురు నేతల మధ్య ఒప్పందం కుదిరింది. కాని పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కి 1948 మార్చి 27వ తేదీన తమ సైన్యంతో కలత్ ను బలవంతంగా ఆక్రమించుకుంది. విలీన ఒప్పందంపై సంతంకం చేయాలని కలత్ నేతలపై ఒత్తిడి ప్రారంభించింది. దీంతో కలత్ భారతదేశంలో కలిసేందుకు సిద్ధమవుతోందని అయితే బౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాదని భారత దేశ నాటి ప్రధాని నెహ్రూ తిరస్కరించారన్న వార్తలు వచ్చాయి.
మహమ్మద్ ఆలీ జిన్నా సూచన మేరకు 1948 లో సైనిక చర్య చేపట్టి బలవంతంగా మీర్ అహ్మద్ యార్ ఖాన్ ను కరాచి తీసుకెవెళ్లి పాకిస్తాన్ లో విలీనం అయినట్లు సంతంకం పెట్టించారు. దీన్ని బలోచ్ ప్రజలు , ప్రిన్స్ అబ్దుల్ కరీం తిరస్కరించి 1948లో గెరిల్లా దాడులకు దిగి తిరుగుబాటు చేశారు. అయితే పాక్ సైన్యం ఈ తిరుగుబాటును అణిచి వేసి కరీంను జైల్లో పెట్టింది.
అలుపెరుగకుండా పాక్ పై తిరుగుబాట్లు చేస్తోన్న బలోచిస్థాన్ వాదులు
పాక్ పై పైన చెప్పుకున్నట్లు తొలి తిరుగుబాటుకు 1948లో ప్రిన్స్ అబ్దుల్ కరీం నేతృత్వం వహించారు. ఆయన అరెస్టు తర్వాత 1958-59 కాలంలో నౌషేరా ఖాన్ నాయకత్వంలో మరో తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు కారణం బలోచిస్తాన్ లో పాక్ సైన్యం చేస్తోన్న ఆకృత్యాలు, ఆధిపత్య ధోరణికి, రాజకీయ నేతలపై ఉక్కుపాదం మోపడం వంటి చర్యలను వ్యతిరేకిస్తూ జరిగింది. ఆ తర్వాత 1963 నుండి 1969 వరకు బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. పాక్ జైళ్లలో ఉన్న బలోచిస్థాన్ ఖైదీల విడుదల, బలోచ్ లోని గ్యాస్ సహా ఇతర వనరుల విషయంలో సమాన వాటా ఇవ్వాలని , వన్ యూనిట్ విధానం రద్దును డిమాండ్ చేస్తూ అంటే బలోచిస్థాన్, సింధ్, ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వా, అప్పటి తూర్పు పాకిస్థాన్, పంజాబ్ రాష్ట్రాలను కలిపివేసి కేంద్రపాలన ఏర్పాటు చేయాలని 1955 నుండి 1970 వరకు పాక్ పాలకులు వన్ యూనిట్ విధానం కోసం ఆలోచన చేశారు. దీన్ని అన్ని రాష్ట్రాల వారు తమ సంస్కృతి, భాష, సంప్రదాయాలు కాలగర్భంలో కలిసిపోతాయని విభేదించారు.
చివరకు 1970లో ఇది రద్దు చేయడం జరిగింది. ఈ డిమాండ్లపై బీఎల్ఎఫ్ పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. దీనికి షేర్ మహమ్మద్ బిజ్రానీ మర్రీ నాయకత్వం వహించారు. ఇతను పరారీ అనే గెరిల్లా యుద్ద సంస్థను ఏర్పాటు చేసి పాక్ సైన్యంపై దాడులు చేశారు. చివరకు 1969 పాక్ సైన్యం- బీఎల్ఎఫ్ ల మధ్య కాల్పుల విరమణ జరిగింది. వన్ యూనిట్ విధానం రద్దు అయింది. ఈ గెరిల్లా వార్ లో పాల్గొన్న తిరుగుబాటు దారులకు పాక్ ప్రభుత్వం క్షమా బిక్ష ప్రకటించింది. ఆ తర్వాత 1973-77 కాలంలో తీవ్రమైన స్తాయిలో తిరుగుబాటు జరిగింది. దీనికి ఖైర్ బక్ష్ మారీ, అతాఉల్లా మెంగల్ వంటి స్థానిక గిరిజన సర్థార్ లు నాయకత్వం వహించారు. ఇందుకు ప్రధాన కారణం జుల్ఫికర్ ఆలీ భుట్టో ప్రభుత్వం బలోచిస్తాన్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఇరాక్ నుండి బలోచ్ వాదులకు ఆయుధాలు అందుతున్నాయని వారిపై సైనిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 80 వేల సైనికులు పాల్గొన్నారంటే బలోచ్ తిరుగుబాటు ఎంత పెద్ద స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడుల్లో బలోచ్ వాదులు ఏడు వేల నుండి పది వేల మంది మరణించినట్లు చెప్తారు. అదే రీతిలోపాక్ సైన్యంలోను మూడు నుండి ఐదు వేల మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జియా ఉల్ హక్ జుల్ఫికర్ ఆలీ భుట్టోను సైనిక చర్య ద్వారా దింపి అధికారంలోకి రావడంతో ఈ సమస్యను రాజకీయంగా పరిష్కరించడానికి సిద్ధపడటం, బలోచ్ నాయకులు ఆఫ్ఘాన్ లో శరణార్థులుగా వెళ్లడంతో ఈ తిరుగుబాటు ముగిసింది. ఇక ఆ తర్వాతి తిరుగుబాటు ప్రస్తుత పరిస్థితులకు దారి తీసిన తిరుగుబాటుగా చరిత్రకారులు చెబుతారు.
2006లో నవాబ్ అక్బర్ బుగ్టి హత్యతో బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పెద్ద ఎత్తున తిరుగుబాటు లేవదీసింది. బలోచిస్థాన్ లో జనరల్ ముషారఫ్ సైనిక స్థావరాలు పెంచడం, చైనా పాక్ ఆర్థిక కారిడార్ సీపెక్ ప్రాజెక్టును ప్రారంబించడం వంటి చర్యలు బలోచిస్థాన్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసాయి. తమ వనరులు కొల్లగొడుతున్నారని, తమకు సరైన వాటా రావడం లేదని, పంజాబీల ప్రాబల్యం పెరుగుతుందన్న కారణాలతో బలోచీవాదులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు సీపెక్ ప్రాజెక్టుల్లో బలోచిస్థానేతరులకు ఉపాధి కల్పించడం వంటివి చర్యలు ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే దీన్ని వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి , గవర్నర్ గా పని చేసిన నవాబ్ అక్బర్ బుగ్టి హత్య కావడం ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఇతను వనరుల్లో సమాన వాటాను డిమాండ్ చేశారు. అంతే కాకుండా గ్వాదర్ పోర్టు నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అతని హత్య బలోచిస్థాన్ ఉద్యమాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లింది.
బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటు ?
బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ 2000 దశకంలో ఏర్పాటు అయింది. ఇది సాయుధ గెరిల్లా యుద్ధ నైపుణ్యం కలిగిన సంస్థగా దీన్ని రూపొందించారు. 1973 -77 కాలంలో బలోచిస్థాన్ తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన ఖైబర్ బక్ష్ మర్రీ కుమారుడు మీర్ బలచ్ మర్రీ ఈ బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఓ రకంగా చెప్పాలంటే ఇతని తండ్రి ఖైబర్ బక్ష్ మర్రీ బలోచీల జాతీయవాద ఉద్యమానికి ఓ ముఖ్య ప్రేరణగా నిలిచారు. అతని కూమారుడి సారధ్యంలో ఈ బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్వయం పరిపాలన, ప్రత్యేక దేశం అనే డిమాండ్ తో పురుడు పోసుకుంది. ఈ సంస్థ ఆధునిక గెరిల్లా యుద్ధ తంత్రాలను పుణికిపుచ్చుకుంది. జనరల్ ముషారఫ్ సైనిక చర్యలు, బలోచ్ ప్రాంతంలో సైనిక స్థావరాలు ఏర్పాటు కావడం, బలోచ్ నేతలు, కార్యకర్తలు అదృశ్యం కావడం, హత్యలు కావించబడటం , పాక్ - చైనా ఆర్థిక కారిడార్ సీపెక్ లో భాగంగా గ్వాదర్ పోర్టు నిర్మాణం, గ్యాస్, గోల్డ్ వంటి సహజవనరులు తరలించడం, వీటిని ఖండిస్తున్న నవాబ్ అక్బర్ బుగ్టి హత్య తో బీఎల్ ఏ సంస్థ తన ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది.
పాక్ సైన్యం పైన, చైనా ప్రాజెక్టులపైన దాడులకు బీఎల్ ఏ దిగింది. ఇలా అంతర్జాతీయంగా బీఎల్ఎ బలోచిస్థాన్ దేశం ఏర్పాటు పై తన పోరాటం చేస్తూనే ఉంది. అవకాశం చిక్కినప్పుడల్లా పాక్ సైన్యం పైన, పాకిస్థాన్ లో బాంబులు పేల్చడం వంటి చర్యలతో తమ డిమాండ్ అంతర్జాతీయంగా చర్చ జరిగేలా పోరాటం చేస్తూనే ఉంది. ఈ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మీర్ బలచ్ మర్రీ 2007లో నాటో దాడుల్లో మరణించారు. ఆ తర్వాత ఈ సంస్థను బషీర్ జెబ్ నడిపిస్తున్నారు. ఇది బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కథాకమామీషు.






















