Joe Biden: నేడు ఇజ్రాయెల్‌కు బైడెన్, గాజాకు సాయంపై చర్చ
Joe Biden: యుద్ధం కారణంగా గాజా, ఇజ్రాయెల్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.
Joe Biden: యుద్ధం కారణంగా గాజా, ఇజ్రాయెల్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు బైడెన్ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. అలాగే గాజాకు సాయం చేసే విషయంలో ఓ ప్రణాళికను రూపొందించడానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు.
ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నట్లు అధ్యక్షుడ బైడెన్ సైతం ఎక్స్ వేదికగా వెల్లడించారు. హమాస్ ఉగ్రవాదుల ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తామని చెప్పారు. మానవతా సాయం అందించే విషయమై అధికారులతో చర్చిస్తానని తెలిపారు. పాలస్తీనియన్ల స్వయం నిర్ణయాధికారం కోసం హమాస్ నిలబడదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పర్యటన అనంతరం జోర్డాన్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దు అయ్యింది.
గాజాపై బాంబుల వర్షం
గాజా నగరం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న ముప్పేట దాడిలో గాజా స్ట్రిప్ వణికిపోతోంది. మంగళవారం సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు. పలువురు గాయపడ్డారు. పాలస్తీనా అథారిటీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ మారణ హోమాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి అత్యంత రక్తపాత సంఘటనగా పాలస్తీనా పేర్కొంది. ఈ దారుణ ఘటనపై పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. దాడికి ముందు ఆ ఆస్పత్రిలో మూడువేల మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. దాడిలోొ గాయపడిన వారిని ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు.
రఫాలో 27 మంది, ఖాన్ యూనిస్‌లో 30 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ మాజీ మంత్రి బసీమ్ నయీం చెప్పారు. ఈ దాడికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అత్యంత అమానవీయంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని విమర్శించారు. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనను వార్ క్రైమ్‌గా అభివర్ణించారు. ఈ దాడిలో 500 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్ 11 రోజుల బాంబు దాడిలో 3,000 మంది మరణించారని గాజాలోని ఆరోగ్య అధికారులు చెప్పారు.
దక్షిణ గాజాలో మంగళవారం ఇజ్రాయెల్ భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. దక్షిణ గాజాలోని రఫా, ఖాన్ యూనిస్ నగరాల్లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఆసుపత్రిపై జరిపిన దాడిలో ఆస్పత్రి పరిసరాలన్నీ భయానకంగా మారిపోయాయి. ఆస్పత్రిలోని హాళ్లు దగ్ధమయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.