US Cyber Attack: అమెరికాలోని ఆస్పత్రులపై సైబర్ అటాక్, సేవలకు తీవ్ర అంతరాయం
US Cyber Attack: అమెరికాలోని పలు ఆస్పత్రులపై సైబర్ అటాక్ జరిగింది. పలు రకాల సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
US Cyber Attack: అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఉన్న ఆస్పత్రులపై, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై సైబర్ అటాక్ జరిగింది. దీంతో ఆరోగ్య సంరక్షణ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎలక్టివ్ సర్జరీలు, ఔట్ పేషెంట్ అపాయింట్‌మెంట్‌లు, బ్లడ్ డ్రైవ్ లు సహా ఇతర సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అనేక ప్రాథమిక సంరక్షణ సేవలు ఆగిపోయాయి. సైబర్ నేరగాళ్లు చేసిన ఈ దాడి వల్ల అనేక రాష్ట్రాల్లోని ఆస్పత్రుల కంప్యూటర్ సిస్టమ్ లకు అంతరాయం కలిగింది. కొన్ని అత్యవసర గదులను మూసివేయాల్సి వచ్చింది. అంబులెన్స్ లను మళ్లించాల్సి వచ్చింది. ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై జరిగిన ఆ దాడి తీవ్రత నేపథ్యంలో.. భద్రతా నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల దాడి నుంచి ఆయా ఆస్పత్రుల కంప్యూటర్ నెట్‌వర్క్ లను సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాలిఫోర్నియాలో ఉన్న ప్రాస్పెక్ట్ మెడికల్ హోల్డింగ్స్ లో మొదట ఈ సైబర్ దాడిని గుర్తించారు. గురువారం రోజు ఈ ఘటన వెలుగు చూసింది. అనంతరం టెక్సాస్, కనెక్టికట్, రోడ్ ఐలాండ్, పెన్సిల్వేనియాలోని పలు ఆస్పత్రులు, క్లినిక్ లు కూడా సైబర్ దాడికి గురయ్యాయి. సైబర్ అటాక్ ను గుర్తించగానే.. కంప్యూటర్ నెట్ వర్క్ సిస్టమ్ లను రక్షించుకోవడానికి ఆఫ్‌లైన్ చేశామని, థర్ట్ పార్టీ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ల సహాయంతో దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రాస్పెక్ట్ మెడికల్ హోల్డింగ్స్ సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీలైనంత త్వరగా ఈ దాడి నుంచి బయట పడటానికి శాయశక్తులా కృషి చేస్తున్నామంది. ప్రస్తుతం రోగులకు అత్యవసర సేవలు నిర్విరామంగా అందిస్తున్నామని, ఇతర సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పింది.
కనెక్టికట్ లోని మాంచెస్టర్ మెమోరియల్, రాక్ విల్లే జనరల్ ఆస్పత్రిలోని అత్యవసర విభాగాలు గురువారం రోజు చాలా వరకు మూసివేశారు. రోగులను సమీపంలోని ఇతర వైద్య కేంద్రాలకు తరలించారు. నేషనల్ ప్రాస్పెక్ట్ టీం ఈ సైబర్ దాడి నుంచి బయటపడేందుకు శ్రమిస్తోందని కనెక్టికట్ హెల్త్ నెట్‌వర్క్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జిలియన్ మెన్జెల్ తెలిపారు. ఎలక్టివ్ సర్జరీలు, ఔట్ పేషెంట్ అపాయింట్‌మెంట్‌లు, బ్లడ్ డ్రైవ్‌లు సహా ఇతర ఆరోగ్య సేవలను నిలిపివేశారు. అత్యవసర విభాగాలు గురువారం ఆలస్యంగా తెరచుకున్నాయి. అలాగే అనేక ప్రాథమిక సంరక్షణ సేవలు శుక్రవారం కూడా మూసివేసే ఉన్నాయని ఈస్టర్న్ కనెక్టికట్ హెల్త్ నెట్ వర్క్ తెలిపింది.
పెన్సిల్వేనియా అప్‌ల్యాండ్‌లోని క్రోజర్-చెస్టర్ మెడికల్ సెంటర్, రిడ్లీ పార్క్‌లోని టేలర్ ఆస్పత్రి, డ్రెక్సల్ హిల్‌లోని డెలావేర్ కౌంటీ మెమోరియల్ ఆస్పత్రి, స్ప్రింగ్‌ఫీల్డ్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్ ఆస్పత్రులు సైబర్ దాడికి గురయ్యాయి. కాలిఫోర్నియా లాస్‌ఏంజిల్స్ సహా ఆరెంజ్ కౌంటీలలో ప్రాస్పెక్ట్ కంపెనీకి 7 ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో రెండు బిహేవియరల్ హెల్త్ ఫెసిలిటీస్ సహా లాస్ ఏంజిల్స్ లో 130 పడకల అక్యూట్ కేర్ ఆస్పత్రులు ఉన్నాయి.
Also Read: Apple India Revenue: భారత్‌లో జూన్ త్రైమాసికంలో ఆపిల్ అమ్మకాల రికార్డు, రెండంకెల వృద్ధి నమోదు
గతంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌పై సైబర్ దాడి
గతేడాది నవంబరులో దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ పై సైబర్ అటాక్ జరిగింది. ఎయిమ్స్ డేటాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.200 కోట్ల క్రిప్టోకరెన్సీ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం 5 సర్వర్లను హ్యాక్ చేయగా అందులో నిక్షిప్తమైన ఉన్న 4 కోట్ల మంది రోగుల సమాచారాన్ని తస్కరించారు. డిసెంబర్ లో తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్ సర్వర్లపై దాడి చేసిన సైబర్ నేరగాళ్లు.. దాదాపు లక్షన్నర మంది రోగుల డేటాను ఆన్ లైన్‌లో విక్రయించారు.