Telegram CEO Arrest: టెలిగ్రాం ఫౌండర్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్టు, అనేక నేరారోపణలు!
Telegram News: ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రాం సంస్థ సీఈవో పావెల్ దురోన్ అరెస్ట్‌పై టెలిగ్రామ్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. పోలీసులు సైతం స్పందించకపోవడం గమనార్హం.
Telegram CEO Pavel Arrested ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ టెలిగ్రాం ఫౌండర్ సీఈవో పావెల్ దురోవ్‌ను పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న బోర్గెట్ విమానాశ్రయంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ జెట్‌లో అజర్ బైజాన్ నుంచి బోర్గెట్ చేరుకున్న దురోవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు మాస్కో టైమ్స్ పేర్కొంది. ఆయనపై సైబర్ నేరాలు, మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర నేరాలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి.
స్పందించని టెలిగ్రాం
దురోవ్ అరెస్ట్‌పై టెలిగ్రామ్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. పోలీసులు సైతం స్పందించకపోవడం గమనార్హం. తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటి నుంచి దురోవ్ ప్రాన్స్ , యూరప్ లలో పర్యటించలేదు. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో ఉంటున్నారు. టెలిగ్రాం యాప్ కు సంబంధించిన వినియోగదారుల సమాచారాన్ని రష్యా ప్రభుత్వానికి ఇవ్వడానికి దురోవ్ నిరాకరించారు. దీంతో ఆ ప్రభుత్వంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్‌ను అడ్డుకునేందుకు రష్యా ప్రయత్నం చేసింది. దీంతో దురోవ్ 2014లో రష్యాను విడిచిపెట్టారు. 2021 లో ఫ్రాన్స్ పౌరసత్వం తీసుకుని ఫ్రెంచ్ పౌరుడిగా మారిపోయారు.
టెలిగ్రాం వేదికగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమాచారం, సంభాషణలు
టెలిగ్రామ్ యాఫ్ ను ప్రపంచ వ్యాప్తంగా 900 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు. YouTube, Facebook, WhatsApp, TikTok, Instagramల మాదిరిగానే Telegram ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాకపోతే టెలిగ్రామ్‌లో అశ్లీలత ఎక్కువగా ఉంటోందని, నేరగాళ్లకు
అడ్డాగా మారిందని ఆరోపణలున్నాయి. టెలిగ్రామ్‌లో మోడరేటర్లు లేకపోవడంతో నేర కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంపైనే ఫ్రెంచ్ పోలీసులు దృష్టి కేంద్రీకరించి దర్యాప్తు చేస్తున్నారు. 2022లో ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి కూడా ఈ రెండు దేశాల రాజకీయాలకు సంబంధించి టెలిగ్రాం వేదికగా ఉత్తరప్రత్యుత్తరాలు జరిగినట్టు పోలీసులకు అనుమానాలున్నాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ సైతం అతని అధికారులతో టెలిగ్రాం అత్యంత ముఖ్యమైన కమ్యూనికేషన్ యాప్‌గా చెబుతుంటారు. క్రెమ్లిన్, రష్యా ప్రభుత్వం కూడా యుద్ధానికి సంబంధించిన వార్తలను పంచుకోవడానికి టెలిగ్రాం యాప్‌ను ఎక్కువగా వినియోగించినట్టు వార్తలొచ్చాయి. యుద్ధ సమాచారం మొత్తం టెలిగ్రాం యాప్‌లో చేరవేయబడిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.