నెల్లూరు పౌరసరఫరాల సంస్థలో వెయ్యి కోట్ల అవినీతిజరిగిందని సోమిరెడ్డి ఆరోపణలు
Somireddy Chandra Mohan Reddy: నెల్లూరు పౌరసరఫరాల సంస్థలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
Somireddy Chandra Mohan Reddy: నెల్లూరు పౌరసరఫరాల సంస్థలో సంస్థలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. ఒకవైపు రైతులకు ధాన్యం డబ్బులు.. చెల్లించకపోగా మరోవైపు మిల్లర్ల నుంచి తీసుకున్న బియ్యాన్ని మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న పెద్దలు ఎవరనేది తేల్చాలని కోరారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని సోమిరెడ్డి వివరించారు. జిల్లాలోని ఉలవపాడు మండలానికి చెందిన రైతులు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ఎదుట బైఠాయించి.. ధాన్యం బకాయిలు చెల్లించాలని కోరడాన్ని బట్టి రైతుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చని వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం తర్వాత చెల్లిస్తామన్న డబ్బులు ఇంతవరకు రాకపోవడం ఏంటన్నారు.
"సివిల్ సప్లైలో మొత్తం 30 కోట్ల కుంభకోణం అని చెప్పారు. అదిప్పుడు 900 నుంచి 1000 కోట్ల మధ్యకు చేరిందని చెబుతున్నారు. మూడేళ్లలో గవర్నమెంట్ మిల్లర్ కు రైస్ సప్లై చేస్తే..అవి గోడౌన్స్ లో పెట్టాలి. కానీ గో డౌన్స్ లో బియ్యం లేవు. దాదాపు 900 నుంచి వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం లేవు. ఏ గోడౌన్ లో పెట్టారో తెలీదు. ఎక్కుడున్నాయో తెలీదు. అధికారులకు ఇన్ని వందల కోట్లు దోచేసే గట్స్ ఉన్నాయా.. ఆ పెద్ద మనుషులు ఎవరు. ఎమ్మెల్యేలా, మంత్రులా లేక ఎవరు. ముఖ్యమంత్రీ మీరు సీబీఐ ఎంక్వైరీ చేయించకపోతే అస్సలే బాగోదు." - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మరోవైపు జ్యోతుల నెహ్రూ ఫైర్...
ఏపీలో 20 శాతం ఓట్లు ఉన్న కాపుల్ని రాజకీయాల్లో పావులుగా వాడుకునేందుకే వైసీపీ నేతలు వారిని రెచ్చగొడుతున్నారని టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అధికార పక్ష నేతలు కాపుల్ని రెచ్చగొట్టడం సరికాదన్నారు. రాజకీయాల కోసం వాళ్లకు ఏదో మేలు చేస్తున్నట్లుగా సమావేశాలు పెట్టి మరీ ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆరోపించారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే.. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని నెహ్రూ మండిపడ్డారు.
"కాపు ప్రజాప్రతినిధులంతా కలిసి సమావేశాలు పెడ్తే.. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తారు, వారి డిమాండ్లన్నింటినీ ఆశపడ్డాను, అనుకున్నాను. కానీ దురదృష్టం.. అత్యధిక శాతం ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం అయినటువంటి కాపు సామాజిక వర్గాన్ని విచ్ఛిన్నం చేయడానికి, న్యూనతా పరచడానికి ఉపయోగపడ్డట్లు భావించాల్సి వస్తోంది. నేను ఒకే మాట అడుగుతున్నాను.. నిన్న మాట్లాడిన మంత్రులు, ప్రజాప్రతినిధులందరినీ.. చంద్రబాబు నిజంగానే కాపు సామాజిక వర్గానికి శత్రువు అయితే కమిషన్ వేయడం, ఎఫ్ అనే ఒక స్పెషల్ కాటగిరీ పెట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈబీసీ, 10 శాతం ఈబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిందో, ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ వినియోగించుకొని 5 శాతం ప్రత్యేకంగా కాపులకే విషయం మీకు గుర్తు రావట్లేదా. అది కాపులకు మంచి జరిగేటటువంటి కార్యక్రమం కాదా. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐదు శాతం రిజర్వేషన్లు కూడా నిర్మొహమాటంగా తీసేసి వాళ్ల నోట్లో మట్టికొట్టే పరిస్థితి." - జ్యోతుల నెహ్రూ