Kenya Blast: కెన్యా రాజధానిలో భారీ పేలుడు - ఇద్దరు మృతి, 271 మందికి గాయాలు
Kenya: కెన్యా రాజధాని నైరోబీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. 271 మందికి గాయాలైనట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.
Gas Blast in Nairobi: కెన్యా (Kenya) రాజధాని నైరోబీలో (Nairobi) గురువారం రాత్రి భారీపేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. దాదాపు 271 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఓ పారిశ్రామిక కేంద్ర వద్ద జరిగిన గ్యాస్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు కెన్యా రెడ్ క్రాస్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. నైరోబీలోని ఎంబాకసి ప్రాంతం సమీపంలో గుర్తు తెలియని నెంబర్ ప్లేట్ ఉన్న గ్యాస్ లారీ వచ్చి ఆగింది. అది ఒక్కసారిగా పేలడంతో ఆ ప్రాంతమంతా మంటలు అంటుకుని సమీప ప్రదేశాలకు వ్యాపించాయి. అక్కడే ఉన్న వాహనాలు, వ్యాపార సముదాయాలు, ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ క్రమంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ అధిక సంఖ్యలో ప్రజలు అక్కడి భవనాల్లో చిక్కుకుపోయారని ప్రభుత్వ ప్రతినిధి ఇస్సాక్ మైగువా తెలిపారు. స్థానికులను ఆ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు.
అదే కారణమా.?
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ గ్యాస్ సిలిండర్లను రీఫిల్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రత ధాటికి 'కంటైనర్స్ కంపెనీ లిమిటెడ్' భవనం తీవ్రంగా దెబ్బతింది. అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దేశంలో రెడ్ క్రాస్ సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: Satya Nadella: టేలర్ స్విఫ్ట్ డీప్ ఫేక్ ఫొటోలపై స్పందించిన సత్య నాదెళ్ల - అవి భయపెట్టేలా ఉన్నాయంటూ!