పాలస్తీనాకి స్వతంత్ర హోదా ఇచ్చేయడమే బెటర్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సలహా
Israel Hamas Attack: పాలస్తీనాకి స్వతంత్ర హోదా ఇవ్వడమే మంచిదని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సలహా ఇచ్చారు.
Israel Hamas Attack:
స్వతంత్ర హోదా ఇచ్చేయండి..
ఇజ్రాయేల్ పాలస్తీనా యుద్ధంపై (Israel Palestine War) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. హమాస్ అరాచకాలను అడ్డుకునేందుకు ఇజ్రాయేల్‌కి తనను తాను డిఫెండ్ చేసే హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు. అంతే కాదు. పాలస్తీనాను స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించి..ఈస్ట్ జెరూసలేంని రాజధానిగా ప్రకటించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని అభిప్రాయపడ్డారు. పాలస్తీనా- ఇజ్రాయేల్ వివాదంపై ఎన్ని చర్చలు జరిగినా ఇది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్..ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితి కూడా చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు.
"ఐక్యరాజ్య సమితి గతంలో సూచించినట్టుగా పాలస్తీనాకు స్వతంత్ర హోదా ఇవ్వాలి. ఈస్ట్ జెరూసలేంని రాజధానిగా ప్రకటించాలి. అప్పుడే పొరుగున ఉన్న ఇజ్రాయేల్‌తో శాంతియుత వాతావరణం ఉంటుంది. కానీ...ప్రస్తుతం అంతా అలజడే ఉంది. హమాస్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా ఇజ్రాయేల్‌పై దాడి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తనను తాను డిఫెండ్ చేసుకునే హక్కు ఇజ్రాయేల్‌కి తప్పకుండా ఉంటుంది. తమ దేశంలో శాంతి నెలకొల్పే బాధ్యత ఉంటుంది. శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించడం చాలా సవాలుతో కూడుకున్న పనే. అందుకే..పాలస్తీనాకి స్వతంత్ర హోదా ఇవ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నాను"
- పుతిన్, రష్యా అధ్యక్షుడు
గతంలోనూ కీలక వ్యాఖ్యలు..
గతంలోనూ ఈ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin Comments on Israel War) కీలక వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు మద్దతునిస్తూనే అమెరికాపై మండి పడ్డారు. మధ్యప్రాచ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అమెరికా వృథా ప్రయత్నాలు చేసిందని, ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని అసహనం వ్యక్తం చేశారు. పాలస్తీనా సమస్యలేంటో అమెరికా పట్టించుకోలేదని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇటు ఇజ్రాయేల్‌తో పాటు అటు పాలస్తీనాతో రష్యా సంప్రదింపులు జరుపుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోంది. యుద్ధం ముగిసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. అయితే..ఈ ప్రయత్నాలు ఎలా చేస్తోందన్నది మాత్రం క్లారిటీ లేదు. అక్కడి వివాదం మరి కొన్ని రోజులు కొనసాగితే..మిగతా ప్రాంతాలపైనా ఆ ప్రభావం గట్టిగానే ఉంటుందని హెచ్చరించింది రష్యా. ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదానీతో మాట్లాడారు పుతిన్. ఈ సమావేశంలోనే అమెరికా విధానాన్ని ఖండించారు. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా పాలసీ ఫెయిల్ అయిందనడానికి ఇంత కన్నా మంచి ఉదాహరణ ఇంకేదీ ఉండదని తేల్చి చెప్పారు. వీలైనంత త్వరగా అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. "స్వతంత్ర హోదా" కావాలన్న పాలస్తీనా ఆకాంక్షల్ని అమెరికా పట్టించుకోలేదని మండి పడ్డారు. ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య యుద్ధం విధ్వంసం సృష్టిస్తోంది. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. గాజా వద్ద పరిస్థితులు అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ ప్రాంతంపై మళ్లీ పట్టు సాధించామని ఇజ్రాయేల్ ప్రకటించింది.
Also Read: ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది - హమాస్‌కి నెతన్యాహు వార్నింగ్