Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?
Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు పూర్తయిన వేళ పుతిన్ సాధించిందేంటి? ఇంకా యుద్ధం ఎన్నాళ్లు జరగొచ్చు?
Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై మంగళవారానికి సరిగ్గా 3 నెలలు పూర్తయ్యాయి. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ చేపడుతున్నట్లు ఫిబ్రవరి 24 ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఎవరైనా మధ్యలో తల దూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ 90 రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దళాలు వైమానిక దాడులు చేశాయి, ఎన్నో నగరాలను హస్తగతం చేసుకున్నాయి. ఇది పైకి కనిపించేది. అయితే యూరోప్ దశాబ్దాలుగా చూడని హింసాత్మక ఘటనలను ఈ మూడు నెలల్లో చూసింది. రష్యా మొదలుపెట్టిన ఈ దాడి వల్ల మాస్కోకు, పశ్చిమ దేశాలకు మధ్య ఇక పూడ్చలేని దూరం ఏర్పడింది. ఈ ఒక్క యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, ఆకలి చావులు మొదలయ్యాయి.
రష్యా మొదలుపెట్టిన ఈ దాడి ఇప్పట్లో పూర్తి కాదని ఐరోపా నిఘా విభాగాలు ముందే అంచనా వేశాయి. అయితే ఇది ప్రపంచాన్నే వణికిస్తుందని మాత్రం అనుకోలేదు. ఉక్రెయిన్‌ను నామ రూపాల్లేకుండా చేయడానికి రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఐరోపా దేశాలకు యుద్ధం మొదలైన తర్వాతే అర్థమైంది.
ఏకాకిగా
ఈ సైనిక చర్య కారణంగా రష్యా.. అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిగా మారింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఆర్థికంగా బాగా దెబ్బ తింది. ఉక్రెయిన్‌ను వీలైనంత త్వరగా చేజిక్కించుకోవాలని యత్నించిన పుతిన్ సేనలకు ఉక్రెయిన్ చుక్కలు చూపించింది. పాశ్చాత్య దేశాల దన్నుతో ఉక్రెయిన్ ఇప్పటికీ దీటుగా పోరాడుతోంది. దీంతో పుతిన్ ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
ఉక్రెయిన్ దీటుగా
రాజధాని కీవ్‌ను ఆక్రమించాలన్న వ్యూహం విఫలమవడంతో పుతిన్ రూటు మార్చారు. కనీసం తూర్పు ఉక్రెయిన్‌లో తమ అధీనంలో ఉన్న డోన్బాస్ ప్రాంతాన్నయినా పూర్తిగా చేజిక్కించుని గౌరవంగా వెనుదిరిగాలని చూస్తున్నారు. అయినా ఉక్రెయిన్ గెరిల్లా యుద్ధ తంత్రానికి రష్యా సైన్యం దీటుగా బదులివ్వలేకపోతోంది.
యుద్ధం పట్ల రష్యన్లలోనూ వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. మెక్‌డొనాల్డ్స్ వంటి రెస్టారెంట్లు మొదలుకుని పెద్ద పెద్ద కంపెనీల వరకు అన్నీ రష్యాను ఒక్కొక్కటిగా విడిచివెళ్తున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలు రష్యాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టాయని పుతిన్ కూడా అంగీకరించారు.
200 శవాలు
ఉక్రెయిన్ సేనలతో అత్యంత శక్తిమంతమైన పోరాటం చేసి రష్యా బలగాలు మేరియుపొల్‌ను ఆక్రమించుకున్నాయి. అయితే అక్కడి ఓ అపార్ట్‌మెంట్ శిథిలాల్లో కుళ్లి దుర్వాసన వస్తున్న స్థితిలో ఉన్న 200కు పైగా శవాలు తాజాగా బయటపడ్డాయి. నగరంలో నెలకొన్న అత్యంత అపరిశుభ్ర వాతావరణం పలు వ్యాధులకు దారి తీయవచ్చని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఉక్రెయిన్ నెగ్గాలి
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ నెగ్గి తీరాలని ఈయూ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్ అన్నారు. అందుకు ఐరోపా అన్నివిధాలా సాయం చేస్తుందన్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు పంపనున్నట్టు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2వేలకు పైగా కేసులు- 17 మంది మృతి
Also Read: Bharat Bandh : సీపీఎస్ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్