Russia Ukraine War: చర్చలకు రష్యా ఓకే- సమావేశం కాదు ఇక సమరమే అంటోన్న ఉక్రెయిన్
ఉక్రెయిన్ అధికారులతో చర్చలకు రష్యా సిద్ధమైంది. ఇందుకోసం బెలారస్ నగరానికి రష్యా బృందం చేరుకుంది.
క్షిపణి దాడులు, తుపాకీ తూటాలు, బాంబుల మోతతో ఉక్రెయిన్‌ను రష్యా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినప్పటికీ తమ దేశం కోసం ఉక్రెయిన్ సైన్యం వెన్నుచూపకుండా పోరాడుతోంది. ఏకంగా అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ యుద్ధం రంగంలోకి దిగి తుపాకీ పట్టి గస్తీ కాస్తున్నారు. ఇది చూసిన ఉక్రెయిన్ వాసులు కూడా ఆయుధాలు పట్టి దేశం కోసం పోరాడుతున్నారు. మహిళలు కూడా రష్యాకు తలొగ్గేదే లేదని పోరాటానికి దిగుతున్నారు.
ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యురాలు కియారా రుదిక్ కూడా యుద్ధంలోకి దిగారు. చేతిలో ఏకే47తో ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
మాజీ అధ్యక్షుడు
ఆ దేశ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో కూడా రష్యా సేనలతో పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఏకే47తో గస్తీ కాస్తున్నారు. తమ ప్రాణాలు ఉన్నంతవరకు రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోలేదని ధీమా వ్యక్తం చేశారు.
పుతిన్ ఉక్రెయిన్‌పై మాత్రమే యుద్ధం ప్రకటించలేదని, ప్రపంచ దేశాలపై యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడేందుకు తమ పౌరలు అంతా సిద్ధంగా ఉన్నారని కానీ తమ వద్ద ఆయుధాలు లేవని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలు తమకు సాయం చేయాలని కోరారు.
చర్చలకు ఓకే
మరోవైపు అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై ఆర్థిక యుద్ధం చేస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధికారిక భవనం క్రెమ్లిన్ ప్రకటించింది. ఇందుకోసం రష్యా బృందం బెలారస్ గోమల్‌కు నగరానికి చేరుకుంది. ప్రస్తుత వివాదంపై ఇరు దేశాల అధికారులు చర్చించనున్నారు.
ఇప్పటికే ఉక్రెయిన్‌లో పలు నగరాల్లో రష్యా విధ్వంసం సృష్టించింది. ఉక్రెయిన్ సైనిక వాహనాలు, పలు యుద్ధ విమానాలను నామరూపాల్లేకుండా చేసినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది.