Russia-Ukraine war: పాపం పసివాళ్లు, వీపు వెనుక వివరాలు- ఉక్రెయిన్‌లో కన్నీటి కథలు
రష్యా సైనికుల దాడుల నుంచి తమ పిల్లలను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ తల్లులు తమ పిల్లల వీపుపై అడ్రస్‌లు రాస్తున్నారు.
ఉక్రెయిన్‌లో ప్రజల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. ఓవైపు రష్యా బలగాల దాడులతో ఉక్రెయిన్ నగరాలు ఉలిక్కిపడుతుంటే మరోవైపు తమవారిని కోల్పోయి ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఇటీవల బుచా నగరాన్ని రష్యా సైన్యం శవాల దిబ్బగా మార్చేసింది. దీంతో ఉక్రెయిన్ కుటుంబాల్లో భయాలు మొదలయ్యాయి. తమ ప్రాణాలు పోయినా పిల్లలు క్షేమంగా ఉండాలని అక్కడి తల్లులు ఆలోచిస్తున్నారు.
ఏం చేశారు?
Ukrainian mothers are writing their family contacts on the bodies of their children in case they get killed and the child survives. And Europe is still discussing gas. pic.twitter.com/sK26wnBOWj
— Anastasiia Lapatina (@lapatina_) April 4, 2022
ఉక్రెయిన్‌లో ఓ తల్లి ఇలానే తన కూతురు శరీరంపై కుటుంబ వివరాలను రాసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు తమకు ఏమైనా అయితే తమ పాపను మంచిగా చూసుకోవాలనే ఆశతో ఇదంతా చేస్తున్నట్లు వివరించింది.
రష్యన్ దళాల చేతిలో హతమైతే తమ పిల్లలు బతికి క్షేమంగా ఉండాలని వారి శరీరాలపై ఫోన్ నెంబర్లతో సహా కుటుంబ వివరాలను ఇలా రాస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
బుచాలో
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 30 కిమీ దూరంలో ఉన్న బుచా నగరంపై ఇటీవల రష్యా విరుచుకుపడింది. ఆ నగరంలో 410 మంది పౌరుల మృత దేహాలు కనిపించాయి. ఒకేచోట దాదాపు 300 మంది సాధారణ పౌరుల మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. వీటిల్లో ఓ పసిబిడ్డ మృతదేహం కూడా ఉంది. ఇది ఉద్దేశపూర్వక మారణకాండ అని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా పేర్కొన్నారు. వీధుల్లో దొరికిన చాలా మృతదేహాలను చూస్తే ప్రజల్ని నేలపై పడుకోబెట్టి, చేతుల్ని వెనక్కి కట్టి తలవెనక భాగాన కాల్చినట్లు తెలుస్తోందని మేయర్ అనతోలి ఫెడొరక్ చెప్పారు.
మృతుల్లో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలిపారు. సురక్షిత ప్రాంతానికి తరలిపోయే ప్రయత్నంలో ఉన్నవారినీ రష్యా సైనికులు పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా నుంచి మార్చి 31న ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకొన్నాయి. ధ్వంసమైన రష్యా యుద్ధ ట్యాంకులతో అక్కడి వీధులు బీభత్సంగా కనిపిస్తున్నాయి.