Russia Ukraine War: ఉక్రెయిన్‌కు సాయం చేస్తాం- రష్యాకు ఓటమి తప్పదు: అమెరికా
Russia Ukraine War: యుద్ధ సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌లో అమెరికా కీలక మంత్రులు పర్యటించారు. ఉక్రెయిన్‌కు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వ్యాఖ్యానించారు.
రహస్య పర్యటన
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, పోలాండ్, బాల్టిక్ దేశాల అధినేతలు ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించారు. తాజాగా అమెరికా కీలక మంత్రులు కూడా యుద్ధ భూమి ఉక్రెయిన్‌లో పర్యటించి తమ సంఘీభావం తెలిపారు. అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆదివారం పర్యటించారు.
యుద్ధం మొదలైన రెండు నెలల్లో ఉక్రెయిన్ వచ్చిన అమెరికా ఉన్నత స్థాయి నాయకులు వీరే. రహస్యంగా సాగిన పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మూడు, నాలుగు గంటలు వీళ్లు సమావేశమయ్యారు.
రష్యా దాడులు
ఉక్రెయిన్‌లోని మేరియుపొల్ నగరంలోని ఓ ఉక్కు కర్మాగారంపై రష్యా సైన్యం ఆదివారం గగనతల దాడులకు దిగింది. ఆ ప్రాంగణంలో ఉక్రెయిన్ సైనికులతో పాటు పలువురు ప్రజలు తలదాచుకోవడం వల్ల కొన్ని వారాలుగా దానిపై పట్టు సాధించడానికి రష్యా ప్రయత్నిస్తుంది. ఆ కర్మాగారాన్ని చేజిక్కించుకుంటే ఇక ఆ నగరమంతా తమకు దక్కినట్లేనని రష్యా భావిస్తోంది.
కీవ్‌లో ఒకపక్క అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశం జరగనుండగా మరోపక్క ఈ కర్మాగారంపై దాడులు జరిగాయి.