PM Modi For Meloni: భారత ప్రధానికి అరుదైన గౌరవం, మెలోని ఆత్మకథకు మోదీ ముందుబాట- #Melodi అంటే ఇదే!
Giorgia Meloni Mann Ki Baat | ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వ్యక్తిగత జీవితాన్ని, రాజకీయ ప్రయాణాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది స్ఫూర్తిదాయకం, చారిత్రాత్మకం అని అన్నారు.

PM Modi writes preface to Giorgia Melonis book | న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని (Giorgia Meloni) రాసిన 'ఐ యామ్ జార్జియా - మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్' అనే పుస్తకానికి సంబంధించి భారతీయ ఎడిషన్ ముందుమాటను ప్రధాని మోదీ రాశారు. జార్జియా మెలోనిని దేశభక్తురాలు, తనకు అద్భుతమైన సమకాలీన నాయకురాలు అని ముందుమాటలో నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని త్వరలో రూపా పబ్లికేషన్స్ భారతదేశంలో విడుదల చేయనుందని సమాచారం.
మెలోని జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని జ్ఞాపకాలను పొందుపరుస్తూ రాసిన 'ఐ యామ్ జార్జియా - మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్' పుస్తకాన్ని ఆమె మన్ కీ బాత్ అని భారత ప్రధాని మోదీ అభివర్ణించారు, భారత పాఠకులకు ఆమె జీవిత కథను పరిచయం చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. నాయకురాలిగా మెలోని ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం, చారిత్రాత్మకం అని మోదీ ప్రశంసించారు. ఇది భారతదేశంలో "ఒక అసాధారణ రాజకీయ నాయకురాలి ఉత్తేజకరమైన కథ"గా ఉంటుందని భారత ప్రధాని అన్నారు.

ప్రపంచ నాయకులతో సంవత్సరాలపాటు అనుభవాలను గుర్తుచేసుకుంటూ, సాంస్కృతిక గౌరవం, ప్రపంచంతో సమానమైన సంబంధంపై ఇటలీ ప్రధాని మెలోని చేసిన కృషి భారతీయ విలువలతో ప్రతిధ్వనిస్తుందని మోదీ రాసుకొచ్చారు. ఈ జ్ఞాపకం జార్జియా మెలోని రాజకీయ జీవితాన్ని ఆమె టీనేజ్ దశ నుంచి ఇటలీ మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎదిగిన తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె భాగస్వామి ఆండ్రియా, వారి కుమార్తె గినివ్రా, తల్లిగా మారడం, విశ్వాసం, గుర్తింపుపై ఆమె ఆలోచనలను పుస్తకం వివరిస్తుంది.
ముందు మాట రాయాలని మోదీని కోరిన మెలోని
జార్జియా మెలోని పోరాటాలు, ఆకాంక్షలపై స్పష్టమైన అంతర్దృష్టితో ఇటలీ, యూరప్ కోసం తన జీవితాన్ని కేటాయించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరో దేశ ప్రధాని రాసిన ఆటోబయోగ్రఫీకి ముందు మాట రాసే అవకాశం నరేంద్ర మోదీకి రావడం అరుదైన గౌరవమని చెప్పవచ్చు. సహజంగా ఇలాంటి విషయాల్లో దేశానికి చెందిన గొప్ప మేధావులు, రచయితల సాయం కోరతారు. కానీ మోదీతో తనకున్న సాన్నిహిత్యం, స్నేహం కారణంగా భారత్‌లో విడుదల కానున్న తన పుస్తకానికి ముందు మాట రాయాలని కోరారు. మోదీ తన ఆటో బయోగ్రఫీకి ముందు మాట రాయడం తనకు దక్కిన గౌరవమని జార్జియా మెలోని పేర్కొన్నారు.

జార్జియా మెలోని రాసిన ఈ స్వీయ చరిత్ర మొదటి వెర్షన్ 2021లోనే పబ్లిష్ అయింది. అప్పుడు ఆమె ఇటలీలో విపక్షనేతగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ఆ పుస్తకానికి ముందుమాట రాశారని తెలిసిందే. 2025 జూన్ నెలలో అమెరికాలో మెలోని ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని విడుదల చేశారు. తాజాగా భారత్‌లో తన పుస్తకాన్ని ఇటలీ ప్రధాని మెలోని విడుదల చేయనున్నారు.
#Melodi మళ్లీ ట్రెండింగ్
పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రధాని మోదీ, జార్జియా మెలోని కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. యూఏఈ లోని దుబాయ్ వేదికగా జరిగిన కాప్ 28 సదస్సులో మోదీ, మెలోని తీసుకున్న సెల్ఫీని #Melodi అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయగా ట్రెండ్ అయింది. మెలోని లోని మెలో, మోదీలోని డీ అనే అక్షరాలతో మెలోడీ క్రియేట్ చేశారన్నమాట. జీ7 సదస్సు సమయంలోనూ మెలోని, మోదీ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి.






















