Pakistan Petrol Price: ఏకంగా రూ.30 పెరిగిన పెట్రోల్ ధర - అక్కడ డబుల్ సెంచరీ దాటిన పెట్రోల్, డీజిల్ రేట్లు
Petrol price increased again by Rs 30: ఇటీవల రూ.30 మేర పెట్రోల్ ధర పెరగగా.. తాజాగా మరోసారి రూ.30 మేర భారీగా ధర పెరిగింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
APakistan Petrol Price: శ్రీలంక తరువాత పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల పాకిస్తాన్‌లో రూ.30 మేర పెట్రోల్ ధర పెరగగా.. తాజాగా మరోసారి రూ.30 మేర భారీగా ధర పెరిగింది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పెంచిన ధరతో ప్రస్తుతం పాక్‌లో లీటర్ పెట్రోల్ ధరతో పాటు డీజిల్ ధర డబుల్ సెంచరీ కొట్టింది. గురువారం అర్ధరాత్రి 12 నుంచి పాక్‌లో పెట్రోల్ లీటర్ రూ.209.86 కాగా, డీజిల్ ధర రూ.204.15 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ ముస్లింగ్ లీగ్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ ప్రకటన చేశారు. విద్యుత్ ఛార్జీలు సైతం పెంచుతామని తెలిపారు.
అంచనాలకు మించిన ద్రవ్యోల్బణం
ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 13.37% గా నమోదైంది. మే నాటికి ఇది 13.8%కి పెరిగింది. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సరుకుల ధరలపెరిగిపోయాయి. ఫలితంగా ఆహార పదార్థాలు ప్రియంగా మారాయి. కరెన్సీ విలువ రోజురోజుకీ పడిపోతోంది. ఈ పరిస్థితులు చక్కదిద్దేందుకు పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంకు రంగంలో దిగింది. వడ్డీ రేట్లను 675 బేస్ పాయింట్లు పెంచింది. ఆహార పదార్థాల ధరలు 17.3% మేర పెరిగాయంటే అక్కడ సరుకుల ధరల ఏ విధంగా మండిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
Imported govt has increased petroleum prices by 40% or Rs 60 per litre.This will increase burden on the public by Rs 900 bn & price hike in basic necessities. Plus, the Rs 8 increase in electricity price will put entire country into shock.Expect inflation by 30% highest in 75 yrs
— Imran Khan (@ImranKhanPTI) June 2, 2022
ఇమ్రాన్ ఖాన్ రియాక్షన్ ఇదీ..
దేశానికి దిగుమతి చేసుకున్న పెట్రోలియం ధరలను లీటరుపై 40 శాతం లేదా రూ. 60 పెంచిందని తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రజలపై రూ. 900 బిలియన్ల భారం పెరుగుతుందన్నారు. వీటికి అదనంగా, విద్యుత్ ధర రూ. 8 పెంపు మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. 75 ఏళ్లలో గరిష్టంగా ద్రవ్యోల్బణం 30 శాతానికి చేరిందని అంచనా వేసినట్లు ట్వీట్ చేశారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
నేషనల్ ఎలక్ట్రిక్ పవర్ రెగ్యులేటరీ అథారిటీ విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు రూ.7.91 భారీగా పెంచేందుకు ఆమోదించింది. అనంతరం కేంద్ర మంత్రి ఇంధన ధరల పెంపు నిర్ణయం ప్రకటించారు. కొన్ని గంటల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని సైతం వెల్లడించారు. తాజా పెంపుతో, ఒక యూనిట్ ధర రూ.16.91 నుండి రూ.24.82కి పెరిగింది. పాక్ ప్రభుత్వం నుంచి తుది నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త టారిఫ్‌లు వర్తిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: LPG Cylinder Subsidy : సామాన్యులకు కేంద్రం భారీ షాక్, ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ తొలగింపు