LPG Cylinder Subsidy : సామాన్యులకు కేంద్రం భారీ షాక్, ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ తొలగింపు
LPG Cylinder Subsidy : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గృహ వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీని తొలగించింది. ఇకపై ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించింది.
LPG Cylinder Subsidy : ఇప్పటికే కొండెక్కిన గ్యాస్ సిలిండర్ ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కేంద్రం సామాన్యులకు మరో షాక్ ఇచ్చింది. ఎల్పీజీ సిలిండర్‌పై గృహ వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీని తొలగించింది. ఈ సబ్సిడీని కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. సామాన్యులు ఇకపై మార్కెట్ ధరకే సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ గురువారం మీడియాకు తెలిపారు. కొవిడ్ ప్రారంభం నుంచి ఎల్పీజీ వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు మాత్రమే ఇకపై కేంద్రం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.
ఉజ్వల పథకం లబ్దిదారులకు మాత్రమే సబ్సిడీ
దేశ రాజధాని దిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1003గా ఉంది. పీఎమ్ ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ కేంద్రం అందిస్తుంది. అయితే ఆ సబ్సిడీని కేంద్రం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం కింద ఏడాదిలో 12 సిలిండర్లకు రూ.200 చొప్పున సబ్సిడీ ఇస్తుంది. అయితే ఇకపై గృహ వినియోగదారులు మార్కెట్ ధర ఎంత ఉంటే అంతకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 9 కోట్ల మంది ఉజ్వల పథకం కింద వినియోగదారులు ఉన్నారు. మిగిలిన 21 కోట్ల మందికి ఇకపై సబ్సిడీ రాదు. 2010లో పెట్రోల్‌పై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. 2014 నవంబర్‌లో డీజిల్‌పై ఉన్న సబ్సిడీని కూడా తొలగించింది. అంతకు ముందు కిరోసిన్‌పై ఉన్న సబ్సిడీని నిలిపివేసింది. గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని తాజాగా కేంద్రం నిలిపివేసింది. ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం గ్యాస్ సబ్సిడీ తొలగించి భారం మోపింది.
గ్యాస్ సిలిండర్ ధరలు
కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 135 మేర తగ్గిస్తూ, ఆయిల్ కంపెనీలు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన ధరలు నిన్నటి నుంచి అమలులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,220.50 అయింది. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.2219కి దిగిరాగా, కోల్‌కతాలో రూ.2322, ముంబైలో రూ.2,171.50, చెన్నైలో రూ.2373కి లభ్యం కానుందని ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో రూ.102.50 పెరగగా, తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర దిగిరావడం ఊరటనిచ్చింది.