Pakistan Blast: పాక్ లో ఆత్మాహుతి దాడి- ప్రముఖ నేత సహా 40 మంది దుర్మరణం, విచారణకు ఆదేశించిన ప్రధాని
Pakistan Blast Several Dead: పాకిస్తాన్ లోని బజౌర్ లో ఆదివారం నాడు భారీ పేలుడుతో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 20 మంది మృతిచెందగా, మరో 50 మంది గాయపడ్డారని సమాచారం.
Pakistan Blast Several Dead: నిత్యం ఏదో చోట పేలుడు, దాడులతో వార్తల్లో నిలిచే పాకిస్తాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. పాకిస్తాన్ లోని బజౌర్ లో ఆదివారం నాడు భారీ పేలుడుతో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆత్మాహుతి దాడి ఘటనలో కనీసం 40 మంది మృతిచెందగా, మరో 200 మంది గాయపడ్డారని సమాచారం. బజౌర్‌లోని ఖార్‌లో ఆదివారం నిర్వహించిన కార్మికుల సదస్సులో మొదట పేలుడు సంభవించినట్లు పాకిస్తాన్ జియో న్యూస్ రిపోర్ట్ చేసింది. కానీ ఇది ఆత్మాహుతి దాడిగా కొద్దిసేపటి తరువాత పాక్ అధికారులు ప్రకటించారు.
బజౌర్‌లో ఆదివారం కార్మికుల సదస్సు జరుగుతుండగా ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. రాజకీయ సంస్థ జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUI-F) నేత సహా కనీసం 40 మందికి పైగా ఈ ప్రమాదంలో దుర్మరణం చెందగా, దాదాపు యాభై మంది గాయపడ్డారని జిల్లా అధికారి తెలిపినట్లు పాకిస్తాన్ జియో న్యూస్ పేర్కొంది. తహసీల్ ఖర్ కు చెందిన రాజకీయ నాయకుడు అమీర్ జియావుల్లా జాన్ ఈ ఆత్మాహుతి దాడి ఘటనలో చనిపోయినట్లు నిర్ధారణ అయింది. పేలుడులో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిమర్‌గరా, పెషావర్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో జియో న్యూస్ జర్నలిస్ట్ సైతం గాయపడ్డారని, భద్రతా విభాగం పనేర్కొంది. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది, పోలీసులు సదస్సు జరిగిన ప్రాంతానికి బయలుదేరి పరిశీలించారు. మీటింగ్ హాల్ లో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించడంతో ఘోర విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
#UPDATE | Death toll increases to 20 whereas more than 50 have been reported as injured, reports Pakistan's Geo English
— ANI (@ANI) July 30, 2023
స్పందించిన పాక్ ప్రధాని..
ఆత్మాహుతి దాడి ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. సభలో బాంబు దాడి జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీనిపై విచారణ జరిపి నిందితులను సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారని పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం (పీఎంఓ) తెలిపింది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో పేలుడు సంభవించిందని JUI-F ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రతినిధి అబ్దుల్ జలీల్ ఖాన్ పాక్ వెల్లడించారు. బాధితులకు రక్తం అవసరం కనుక రక్తదానం చేయాలని పార్టీ కార్యకర్తలను ఆ సంస్థ చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ కోరారు.