Sri Lanka Economic Crisis: శ్రీలంకలో నిరసనకారులపై కాల్పులు- ఒకరు మృతి, 10 మందికి గాయాలు
శ్రీలంకలో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు.
శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఆగ్రహ జ్వాలలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నవారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక శ్రీలంక పౌరుడు మరణించాడు. నిరసనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడడంతోనే కాల్పులు జరపాల్సివచ్చిందని పోలీసులు తెలిపారు.
నిరసన
శ్రీలంక రాజధాని కొలంబోకు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంబుక్కనలో ఆందోళనకారులు మంగళవారం ఉదయం రోడ్లను బ్లాక్ చేశారు. తీవ్రమైన ఆయిల్ కొరత, అధిక ధరలను నిరసిస్తూ ఈ ఆందోళనలు చేశారు. వేలాది వాహనదారులు తీవ్ర ఆగ్రహంతో రోడ్లపై టైర్లను తగలబెట్టారు. రాజధాని కొలంబోకు వెళ్లే రోడ్లను స్థంభింపజేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు.
కరోనా దెబ్బకు
శ్రీలంకకు ప్రధానంగా పర్యాటకం, ఎగుమతుల ద్వారానే ఆదాయం వస్తుంది.కోవిడ్ కారణంగా పర్యాటక రంగం పూర్తిగా కుదేలైపోయింది. 2019లో పర్యాటకం ద్వారా శ్రీలంక 4 బిలియన్ల డాలర్ల ఆదాయం ఆర్జించింది. ఇప్పుడు అందులో పది శాతం కూడా రావడం లేదు. ఇలా వచ్చే ఆదాయం మొత్తం విదేశీ మారకద్రవ్యమే.
దిగుమతుల మీదే
శ్రీలంక అత్యధికగా దిగుమతుల మీదే ఆధారపడుతుంది. తక్కువ ఆదాయం, అధిక దిగుమతి బిల్లుల కారణంగా పర్యాటక ఆధారిత శ్రీలంక విదేశీ మారకద్రవ్యం భారీ పతనాన్ని ఎదుర్కొంటోంది. దిగుమతుల కోసం చెల్లించడానికి దేశానికి ఈ సంవత్సరం 22 బిలియన్ డాలర్లు అవసరం. అయితే దాని ఆదాయం మాత్రం 12 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 10 బిలియన్ డాలర్ల లోటులో శ్రీలంక కోట్టుమిట్టాడుతోంది.
పెరుగుతున్న ధరలపై ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు శ్రీలంక ప్రభుత్వం ఇటీవలే వన్ బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పెంచింది. పేదలకు కొంత ఆర్థిక చేయూత అందించడంతో పాటు కొన్ని ఆహార వస్తువులు, ఔషధాల ధరలపై పన్నులు తొలగించింది. కానీ వాటిని డబ్బులు ముద్రించి పంపిణీ చేసింది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. లంక రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే రూ. 275కు పడిపోయింది. దీంతో లంకేయులు తీవ్ర ఇబ‍్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి నెలకొంది. పాలపొడి నుంచి లీటర్ పెట్రోల్ వరకు పెరిగిన రేట్లు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్ పెట్రోల్ ధర 283 రూపాయలకు చేరుకోగా, డీజిల్ ధర రూ. 220కి చేరుకుంది.
Also Read: Russia Ukraine War: పుతిన్‌కు మరో షాక్- జపాన్, స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం
Also Read: Anonymous Hackers: శ్రీలంకపై ఆ హ్యాకర్ల పంజా- ఏం చేసుకుంటారో చేసుకోమని ట్విట్టర్‌కు సవాల్