Music Generated By Spider Web: సరదాగా సాలీడుతో కబుర్లు..!
మనుషులు సాలీడుతో సరదాగా సంభాషణలు చేయవచ్చని అమెరికాలో మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలా మాట్లాడతాం అనుకుంటున్నారా?
"స్పైడర్" ఈ పేరు వినగానే ఇదొక కీటకం అని ఎంతమందికి గుర్తొస్తుందో.. లేదో.. తెలియదు గానీ.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అద్భుతమైన విన్యాశాలు చేసే స్పైడర్ మ్యాన్ మాత్రం గుర్తుకు వచ్చేస్తాడు. మరి మనం అంతలా కనెక్ట్ అయ్యాం స్పైడర్ మ్యాన్‌కి.
మనలో చాలా మంది స్పైడర్ మ్యాన్ అయిపోవాలని లేదా అతడిలా ఆపదలో ఉన్నవారిని రక్షించాలని, అతడితో మాట్లాడాలని ప్రయత్నించే ఉంటారు. కానీ కుదరదు ఎందుకంటే అదొక ఊహా చిత్రం కాబట్టి. స్పైడర్ మ్యాన్ తో కాదులే కానీ.. త్వరలోనే స్పైడర్లతో అంటే అదేనండి మన సాలె పురుగులతో మాట్లాడవచ్చు. అదేంటి సాలీడుతో మాటలా.. అదేలా సాధ్యం అని అనుకుంటున్నారా? అసలు మొత్తం కథంటో తెలియాలంటే ఇది చదివాల్సిందే..
అమెరికాలో మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల సాలె పురుగులపై పరిశోధన చేశారు. దీనిలో భాగంగా ఓ ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకున్నారు. మనుషులు సాలీడుతో సరదాగా సంభాషణలు చేయవచ్చని వారు గుర్తించారు.
సాలీడులు ఉండటానికి గూడులాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటాయని మనకు తెలుసు. అయితే ఈ గూళ్లు.. అవి ఉండటానికే మాత్రమే కాదని, ఇతర సంభాషణలకు ఉపయోగపడతాయని వారు కనుగొన్నారు. సాలీడు గూళ్ల నుంచి వచ్చే శబ్ధాలను వారు రికార్డ్ చేయగా.. అది ఒక లయబద్ధమైన సంగీతం మాదిరిగా చెవులకు వినసొంపుగా ఉన్నాయని చెబుతున్నారు.
సాలీడు గూళ్లు చేసే ఈ సంగీతం ద్వారానే మనం వాటితో సంభాషించవచ్చని భావిస్తున్నారు. ఇదొక్క సంభాషణల వరకే పరిమితం కాదని, ఈ అంశాన్ని త్రీడీ ప్రింటర్స్, వైవిధ్యమైన జాతుల మధ్య కమ్యూనికేషన్‌కు ఉపయోగించవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
"సాలీడులు వేలాడే దారాల మాదిరి గూళ్లను చేసుకుని నివసిస్తాయి. అవి స్పష్టంగా చూడలేవు. దీంతో ఈ ప్రపంచాన్ని చూడటానికి అవి గూళ్ల ద్వారా వేర్వేరు రకాల కంపనాలను చేస్తాయి. మనం ఇప్పటివరకు వింటున్న సంగీతం కంటే చాలా భిన్నంగా ఈ సాలె పురుగుల గూళ్ల నుంచి శబ్ధాలు ఉంటున్నాయి. ఇప్పటివరకు అలాంటి సంగీతాన్ని విని ఉండకపోవచ్చు" అని పరిశోధనలో ముఖ్యులైన బ్యూలర్ వివరించారు.
పరిశోధన చేశారిలా...
సాలీడు గూళ్లను లేజర్ సాయంతో స్కాన్ చేసి 2డీ నిర్మాణాన్ని రాబట్టారు. అనంతరం అల్గారిథమ్ సాయంతో త్రీ డీ రూపంలోకి మార్పు చేశారు. భిన్నమైన శబ్ధాలను వాటి గూళ్ల పోగులపైకి పంపించి.. ఆ శబ్ధాలకు త్రీడీ మోడల్‌ను జతచేసి రికార్డు చేశారు. తర్వాత వీణ లాంటి పరికరాన్ని తయారుచేశారు. అంతేకాదు దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చారు. కొన్ని చోట్ల గూళ్లను ఎలా నిర్మిస్తున్నాయో తెలిపేలా శబ్ధాలు వచ్చాయని బ్యూలర్ తెలిపారు.
దీన్ని బట్టి అవి గూళ్లను ఎలా నిర్మిస్తాయో ఆడియో రూపంలో తెలుసుకోవచ్చని బ్యూలర్ చెప్పారు. దీని సాయంతో భవిష్యత్ నిర్మాణాలుగా భావిస్తున్న త్రీడీ ప్రింటింగ్ మరింత మెరుగవుతుందని అన్నారు. అలాగే వర్చువల్ రియాలిటీని ఉపయోగించి సాలీడు గూళ్లలోకి వెళ్తూ.. గూళ్లను ఎలా నిర్మిస్తున్నాయి.. ఒక్కో సందర్భంలో ఎలాంటి శబ్ధాలు వస్తున్నాయి.. అనే అంశాన్ని పలువురు ఔత్సాహికులు అనుభూతి చెందారని వివరించారు. ప్రస్తుతం సింథటిక్ సిగ్నల్స్ ను ఉపయోగించి సాలె పురుగులతో వాటి భాషలో మాట్లాడేందుకు వారు ప్రయత్నిస్తున్నామని బ్యూలర్ తెలిపారు.