UBER LOTTERY : లక్కీ మామ్..! ఫుడ్ డెలివరీకి వెళ్తే రెండు కోట్ల జాక్ పాట్..!
ఐదుగురు పిల్లల్ని పోషించడానికి ఉబెర్ ఈట్స్ డెలివరీ ఎజెంట్‌గా ఉద్యోగం. వెదుక్కుంటూ వచ్చిన అదృష్టంతో రెండున్నర లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం.
ఆమె ఐదుగురు పిల్లల తల్లి. అందర్నీ పోషించడానికి ఉబెల్ ఈట్స్‌లో డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తోంది. డ్యూటీ ఎక్కిన ఆమె... తన నెక్ట్స్ డెలివరీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తూ ఉంది. టైం పాస్ కోసం.. తన దగ్గర ఉన్న స్క్రాచ్ కార్డును .. గోకింది. అంతే.. ఆమెకు షాక్ కొట్టింది. ఆ షాక్ మామూలుది కాదు. మైండ్ బ్లాంక్ అయ్యేంత షాక్. మొదట కెవ్వుమని కేకేసింది. తర్వాత చుట్టూ చూసింది. స్క్రాచ్ కార్డును కాసేపు పక్కన పెట్టింది. మళ్లీ తీసుకుని చూసింది. తననుతాను గిల్లిచూసుకుంది. అంతా నిజమేనని నిర్ధారించుకుంది. అప్పుడు ఒక్క సారిగా ఊపిరి పీల్చుకుని.. గాల్లో పిడిగుద్దులు గుద్దింది.
ఆమె సంతోషానికి కారణం ఆ స్క్రాచ్ కార్డులో జాక్ పాట్ తగలడమే. అమెరికాలోని ది మేరీ ల్యాండ్ రాష్ట్రంలో స్క్రాచ్ కార్డు తరహా లాటరీ టిక్కెట్లు నిర్వహిస్తూ ఉంటారు. ఈ స్క్రాచ్ కార్డులను కొని.. అదృష్టాన్ని పరీక్షించుకునే పనిని ఉబెర్ ఈట్స్ డెలివరీ ఎజెంట్ కూడా చేస్తూంటారు. అదొక అలవాటుగా మారింది. అయితే ఎప్పుడూ భారీ మొత్తంలో అదృష్టం తలుపు తట్టలేదు. వస్తుందని కూడా ఆమె అనుకోలేదు. కానీ ఈ సారి మాత్రం ఆమెకు జాక్ పాట్ తగిలిగింది. ఏకంగా రెండున్నర లక్షల అమెరికన్ డాలర్లు ఆమెకు లాటరీ టిక్కెట్ స్క్రాచ్ చేయగానే వచ్చి పడ్డాయి. ఉబెర్ ఈట్స్ డెలివరీ ఏజెంట్‌గా రోజంతా కష్టపడి ఐదుగురు పిల్లల్ని పోషిస్తున్న ఆమెకు రెండున్నర లక్షల అమెరికన్ డాలర్లు ఒక్కసారిగా వచ్చి పడితే ఎంత సంతోషమేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఐదుగురు పిల్లల తల్లి... కుటుంబం గడపడం కోసం ఉబెర్ ఈట్స్ డెలివరీ ఎజెంట్‌గా చేస్తున్న మహిళకు జాక్ పాట్ తగిలిందని తెలియగానే మీడియా కూడా ఎగ్జైట్ అయింది. ఆమెకు "గ్రేట్‌ఫుల్ మామ్" అని పేరు పెట్టేసింది. అయితే ఆమె పేరు ఎక్కడా లీక్ చేయలేదు. కానీ ఆమె స్పందనను మాత్రం అమెరికన్ మీడియా ఘనంగా ఇచ్చింది. దీనికి కారణం .. ఆమెకు దక్కిన లాటరీ ఐదుగురు పిల్లలకు ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. గ్రేట్‌ఫుల్ మామ్‌కు దక్కినలాటరీ మొత్తం ఇండియన్ రూపాయల్లో... ఆ మొత్తం దాదాపుగా రెండు కోట్లు అనుకోవచ్చు. ముందుగా చెల్లించాల్సిన కొన్ని బిల్లులు ఉన్నాయని.. వాటిని క్లియర్ చేసి.. తన ఇంటికి కొంత మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా కడతానని... ప్రణాళికలను కూడా ప్రకటించేశారు. ఇప్పుడు ఉబెర్ ఈట్స్ డెలివరీ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఆమెకు లేకుండా పోయింది.