(Source: Poll of Polls)
Malawi Vice Presiden: విషాదం, విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం
Malawi Vice President: ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా విమానం అదృశ్యం విషాదంగా ముగిసింది. పర్వత ప్రాంతాల్లో విమానం కూలిపోయిందని ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా తెలిపారు.
Malawi Vice President Plane Crash: ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు(Malawi Vice President) సౌలస్ షిలిమా (Saulos Chilima) విమానం అదృశ్యం విషాదంగా ముగిసింది. పర్వత ప్రాంతాల్లో సౌలస్ షిలిమా ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిందని ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా (Lazarus Chakwera) తెలిపారు. ఈ దుర్ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆయన వెల్లడించారు. పర్వత ప్రాంతాల్లో విమానం శకలాలను గుర్తించామని, అందులో ఎవరూ ప్రాణాలతో లేరని చక్వేరా తెలిపారు. ఇది అత్యంత హృదయవిదాకరమైన సంఘటన అని, ఈ విషయం తెలియజేయడానికి విచారం వ్యక్తం చేస్తున్నానని చక్వేరా తెలిపారు. సౌలస్ షిలిమా పాటు ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడకపోవడంతో మలావీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
45 నిమిషాల్లో కనిపించకుండా పోయిన విమానం
మలావీ మాజీ అటార్నీ జనరల్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షిలిమా సహా మరో తొమ్మిది మంది కూడిన సైనిక విమానం జూన్ 10న రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరింది. సుమారు 45 నిమిషాల తరువాత ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తర నగరమైన జుజులో విమానం ల్యాండ్ కావడంలో విఫలమైంది. దీంతో రాజధాని లిలాంగ్వేకి తిరిగి వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. అంతలోనే రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి. ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, విమానయాన అధికారులు దానితో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
పలు దేశాల సాయం
గల్లంతైన విమానం కోసం మలావీ సైన్యం ప్రతికూల వాతావరణంలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో కలిసి అణువణువు గాలించారు. పొరుగు దేశాల హెలికాప్టర్లు, డ్రోన్లను తీసుకొచ్చి సౌలస్ షిలిమా విమానం కోసం వెతికించారు. అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సైతం సాయం అందించింది. అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ సైతం సహాయం అందించాయి. ఈ క్రమంలోనే పర్వత ప్రాంతంలో కూలిపోయిన విమాన శకలాలను గుర్తించినట్లు మలావీ ప్రభుత్వం తెలిపింది.
BIG BREAKING:
— Mr. Shaz (@Wh_So_Serious) June 11, 2024
Malawi mourns as the wreckage of a plane carrying Vice-President Saulos Chilima and nine others has been discovered with no survivors, confirms President Lazarus Chakwera.
The aircraft vanished from radar on Monday morning.#Malawi #SaulosChilima #PlaneCrash pic.twitter.com/lDwJ7PORMa
గత నెలలో ఇరాన్ అధ్యక్షుడు
గత మే నెలలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. రైసీ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ మే 19న తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో అదృశ్యమైంది. ప్రతికూల వాతావరణం, పొగమంచు, దట్టమైన అడవుల కారణంగా ఘటనా స్థలాన్ని ఇరాన్ గుర్తించలేకపోయింది. దీంతో ఇరాన్ మిత్ర దేశమైన తుర్కియే సాయం కోరింది. తక్షణమే స్పందించిన తుర్కియే డ్రోన్‌ను రంగంలోకి దించి గంటల్లోనే కుప్పకూలిన హెలికాప్టర్ నుంచి వెలువడుతున్న మంటల ఉష్ణం ఆధారంగా ఆచూకీని కనుగొంది. దాని నుంచి సమాచారం అందుకొన్న తక్షణమే ఇరాన్ దళాలు ఆ ప్రాంతానికి చేరుకొని అధ్యక్షుడు రైసీ మరణించినట్లు గుర్తించాయి. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లాహియన్(60), తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్సు గవర్నర్ మలేక్ రహ్‌మతీ, మరో ఐదుగురు అధికారులు మృతి చెందారు.