Hezbolla Vs Israel: 1982లో ఎక్కడైతే యుద్ధం ఆపిందో అక్కడి నుంచే మళ్లీ మొదలు పెట్టిన ఇజ్రాయెల్
Israel Strikes Lebanon: హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులతో దకిణ లెబనాన్ లో నెత్తురు పారుతోంది. 1980ల్లో పీఎల్‌ఓ ఏరివేతకు లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులే హౌజ్బొల్లా ఏర్పాటుకు కారణమైంది.
Israel invasion on Lebonan decades back cause the birth of Hezbolla: దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లాను ఏరిపారేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో సామాన్య లెబనాన్ పౌరులు కూడా సమిధలవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు రోజుల యుద్ధంలో 500 మంది వరకూ బలయ్యారు. లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం బెకా లోయలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తుండగా ఈ యుద్ధానికి బీజం 1980ల్లోనే పడింది. 1982లో ఎక్కడేతే యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఆపిందో అక్కడి నుంచే ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టింది.
యుద్ధం పాలస్తీనాది.. నాడు నేడు బలవుతోంది లెబనాన్ పౌరులు:
2006 తర్వాత ఆ స్థాయిలో ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. దక్షిణ లెబనాన్ సహా ఉత్తర ఇజ్రాయెల్‌లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు ఈడుస్తున్నారు. లెబనాన్ రాజధాని బీరూట్ సహా బెక్కా లోయ నుంచి దాదాపు లక్షా 10 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి పోతున్నారు. అటు ఉత్తర ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా రాకెట్ లాంచర్లతో దాడులు చేస్తోంది. వాటి నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి 60 వేల మందిని నెతన్యాహూ సర్కారు సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తోంది. ఇలా రెండు వైపుల సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ఈ యుద్ధానికి 1982లోనే బీజం పడింది.
బార్డర్ నుంచి ఇజ్రాయెల్లో ప్రవేశించి దాడులు
1970ల్లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO బలంగా ఉండేది. లెబనాన్ నుంచి వాళ్లు కార్యకలాపాలు నిర్వహించే వారు. లెబనాన్ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్లో ప్రవేశించి దాడులు జరుపుతూ ఉండేవారు. ఈ క్రమంలో 1978 మార్చిలో ఒక బస్సును హైజాక్ చేసి అమెరికా టూరిస్టు సహా 34 మంది బందీలను పీఎల్‌ఓ చంపేసింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించి పీఎల్‌ఓ సభ్యుల ఏరివేత మొదలు పెట్టింది. రెండు నెలల పాటు ఉగ్రవాద శిబిరాలపై ఇజ్రాయెల్ నిర్విరామంగా దాడులు చేపట్టింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి కలుగ చేసుకోవడంతో దాడులను ఆపింది. అయినప్పటికీ పీఎల్‌ఓ దాడులు మాత్రం కొనసాగుతూనే వచ్చాయి. 1981లో అమెరికా జోక్యంతో ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. అయితే దాన్ని తప్పిన పీఎల్ఓ దాదాపు 270 వరకూ ఉగ్రదాడులు నిర్వహించింది. దక్షిణ లెబనాన్, వెస్ట్‌బ్యాంక్, గాజాస్ట్రిప్ సరిహద్దుల్లో ఈ దాడులు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 29 మంది ఇజ్రాయేలీలు చనిపోగా మరో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో లెబనాన్‌లో దాదాపు 15 వేల నుంచి 18 వేల మంది వరకూ పీఎల్‌ఓ ఫైటర్లు ఉండేవారు. వాళ్ల దగ్గర అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉండేవి.
1982 నుంచి దాడులు ముమ్మరం
1982లో ఇజ్రాయెల్‌లోని బ్రిటన్ అంబాసిడర్‌ను చంపేందుకు పీఎల్‌ఓ విఫలయత్నం చేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయెల్ బెకాలోయ సహా బైరుట్‌పై దాడికి దిగింది. 1982లో ఆపరేషన్ పీస్ ఆఫ్ గలేలీ పేరిట ఈ దాడులు మొదలు పెట్టింది. లెబనాన్ నుంచి పీఎల్‌ఓ బహిష్కరణే లక్ష్యంగా నాడు యుద్ధం కొనసాగించింది. ఆ తర్వాత బైరూట్‌ను ఇజ్రాయెల్ చుట్టుముట్టడంతో లెబనాన్‌ను వీడేందుకు పీఎల్‌ఓ అంగీకరించింది. 1982 సెప్టెంబర్‌లో నాటి పీఎల్‌ఓ నాయకుడు యాసర్ అరాఫత్ ట్యునీషియాకు వెళ్లిపోగా మిగిలిన 14 వేల మంది పీఎల్‌ఓ ఫైటర్లు లెబనాన్ విడిచి వెళ్లారు. 1983లో లెబనాన్ అధ్యక్షుడు ఇజ్రాయెల్‌తో ఒక ఒడంబడికపై సంతకం కూడా చేశారు. ఐతే లెబనాన్ చర్యను తప్పుపట్టిన సిరియా దాన్ని తప్పేలా చేసింది. ఆ సమయంలో పీఎల్ఓ కారణంగా అరబ్ షేక్‌లు ఎంతో మంది దక్షిణ లెబనాన్‌లో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ యుద్ధం విషయంలో స్వదేశంలో కూడా వ్యతిరేకత ఎదుర్కొన్న నాటి ఇజ్రాయెల్ ప్రధాని మెనాషెమ్ బెంజిమన్ 1984లో తన పదవికి రాజీనామా చేశారు. ఈ మొత్తం వివాదంలో ఇజ్రాయెల్ వాళ్లు 12 వందల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 1984లో ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా లెబనాన్ విడిచి వెళ్లింది.
పీఎల్‌ఓ వీడిన అనంతరం పురుడు పోసుకున్న హెజ్బొల్లా
1982 సెప్టెంబర్‌లో పీఎల్‌ఓ లెబనాన్‌ను విడిచి వెళ్లిన తర్వాత హెజ్బొల్లా పురుడు పోసుకుంది. ఇరాన్‌కు చెందిన షియా నేతల సారథ్యంలో ఈ గ్రూప్ ఏర్పడింది. పూర్తి ఇస్లామిక్ భావజాలంతో పనిచేసే ఈ సంస్థ ఆక్రమిత ప్రాంతాలను విడిపించడమే లక్ష్యంగా అప్పటి నుంచి పని చేస్తోంది. ప్రస్తుతం ఉన్న హెజ్బొల్లా అధ్యక్షుడు నస్రుల్లా 1990 నుంచి ఈ సంస్థను నడిపిస్తున్నాడు. 1990 తర్వాత పలుయుద్ధాల్లో ఈ సంస్థ తన ఫైటర్లను పంపింది. 2006లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ సేనలు ఘోరంగా ఓడించాయి. మళ్లీ ఇప్పుడు ఈ ఉగ్రసంస్థే లక్ష్యంగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌పై భీకరదాడులు చేస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ సేనల దాడులను వ్యతిరేకిస్తూ ఉత్తర ఇజ్రాయెల్‌లో దాడులు జరిపిన హెజ్బొల్లా ఇప్పుడు లెబనాన్ ప్రజలను ఆ మంటల్లోకి మళ్లీ నెట్టింది.
Also Read: Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?