Gaza News: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధానికి నాలుగు రోజుల బ్రేక్, 50 మంది బందీల విడుదలకు డీల్
Israel Gaza Attack: నాలుగు రోజుల పాటు యుద్ధానికి విరామం ఇచ్చేలా ఇజ్రాయేల్, హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది.
Israel Gaza War:
యుద్ధానికి విరామం..
Gaza News: యుద్ధానికి నాలుగు రోజుల పాటు బ్రేక్ తీసుకునేందుకు ఇజ్రాయేల్, హమాస్ (Israel-Hamas War) అంగీకరించాయి. దాదాపు నెల రోజులకుపైగా ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో రెండు వర్గాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాయి. అంతే కాదు. హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్న 50 మంది పౌరులను విడుదల చేసేందుకూ ఒప్పందం కుదిరింది. సుదీర్ఘ చర్చల తరవాత ఇజ్రాయేల్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. "కాస్త కఠినమైన నిర్ణయమే అయినా తప్పడం లేదు" అని వెల్లడించింది. మిలిటరీ ఆపరేషన్స్‌కి (Israel Military) నాలుగు రోజుల పాటు బ్రేక్ (Israel-Hamas War Truce) పడనుంది. ఈ క్రమంలోనే హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన మహిళలు, చిన్నారులను విడుదల చేయనున్నారు. అంతే కాదు. రెండు వర్గాల మధ్య మరో డీల్ కూడా కుదిరింది. ప్రతి 10 మంది బందీలను విడుదల చేస్తే...అప్పటికి యుద్ధాన్ని ఆపేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ డీల్‌పై హమాస్ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఒప్పందంతో రెండు వైపులా ప్రజలకు యుద్ధ వాతావరణం నుంచి కాస్త ఊరట లభించనుంది. ఈ విరామంలో భాగంగా కాల్పుల విరమణతో పాటు గగనతలం నుంచి దాడులకూ బ్రేక్ పడనుంది. ఈ ఒప్పందం కుదర్చడంలో ఖతార్ కీలక పాత్ర పోషించింది.
యుద్ధం కొనసాగుతుంది: నెతన్యాహు
నాలుగు రోజుల్లో రోజుకి 12-13 మంది బందీలను (Israel Hostages Release) విడుదల చేయనుంది హమాస్. The Jerusalem Post వెల్లడించిన వివరాల ప్రకారం...నవంబర్ 23 న తొలి విడతలో 13 మంది బందీలను విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించింది. చాలా రోజులుగా జైళ్లలో ఉన్న పాలస్తీనా మహిళలు, చిన్నారులు ఇన్నాళ్లకు ఇంటికి చేరుకోనున్నారు. ఇదే సమయంలో ఇజ్రాయేల్ మరో కీలక నిర్ణయమూ తీసుకుంది. గాజాకి (Gaza Attack) మానవతా సాయం చేసేందుకు ఇన్నాళ్లు పలు ఆంక్షలు విధించిన ఆ దేశం...ఇప్పుడు వాటిని సడలించింది. గాజాకి భారీ ఎత్తున చమురు సాయం అందించేందుకు ముందుకొచ్చిన దేశాలకు లైన్ క్లియర్ చేసింది. వీటితో పాటు మరి కొన్ని సరుకులూ అందించేందుకు అంగీకరించింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు ఈ ఒప్పందం కుదిరింది. హమాస్ ఉగ్రవాదులు ఆ బందీలను నేరుగా ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)కి అందించనున్నారు. ఇజ్రాయేల్ మిలిటరీ వెంటనే ఆ బందీలకు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించనుంది. అక్కడి నుంచి వాళ్లను ఐసోలేటెడ్ మెడికల్ సెంటర్స్‌కి తరలిస్తారు. అక్కడి నుంచి వాళ్ల కుటుంబాలకు అప్పగిస్తారు. అయితే...ఈ డీల్ కుదిరే ముందు నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. హమాస్‌పై యుద్ధం కచ్చితంగా కొనసాగుతుందని, హమాస్‌ని అంతం చేసేంత వరకూ యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే...బందీల భద్రతను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇజ్రాయేల్ ఈ డీల్ కుదుర్చుకున్నట్టు కనిపిస్తోంది. బందీలందరినీ విడిపించుకున్న తరవాత యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు.