National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం, ఈడీ 752 కోట్ల ఆస్తుల జప్తు - తిప్పికొట్టిన కాంగ్రెస్
Prevention of Money Laundering Act, 2002 కింద దర్యాప్తు చేసిన ఈ కేసులో రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలిక అటాచ్‌మెంట్‌కు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఈడీ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు రూ.752 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులు కాంగ్రెస్‌కు చెందిన ఏజేఎస్, యంగ్ ఇండియన్‌లకు చెందినవి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ హౌస్, లక్నోలోని నెహ్రూ భవన్, ముంబయిలోని నేషనల్ హెరాల్డ్ హౌస్ ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తునకు సంబంధించి యంగ్ ఇండియన్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సంబంధించిన కంపెనీకి చెందిన రూ.90 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (Prevention of Money Laundering Act, 2002) కింద దర్యాప్తు చేసిన ఈ కేసులో రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలిక అటాచ్‌మెంట్‌కు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఈడీ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ఈ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ఈడీ కొద్ది నెలల క్రితం విచారణ చేసిన సంగతి తెలిసిందే. వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది.
ఈడీ చర్యపై కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎదురు కానున్న ఓటమి నుంచి దృష్టి మరల్చేందుకు ఈడీ ఏజేఎల్ ఆస్తులను అటాచ్‌మెంట్ చేసిందన్న వార్తలు బీజేపీలో నైరాశ్యాన్ని తెలియజేస్తోందని అన్నారు. రాజకీయ ప్రతీకారం కోసం కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ఎప్పుడూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మనీలాండరింగ్ లేదా నగదు మార్పిడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ చెబుతోంది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వార్తాపత్రికలు నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడంలో మోసం, కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన ఆరోపణలపై ఈ కేసు ఉంది.