(Source: ECI/ABP News/ABP Majha)
Netanyahu Comments: 'మనల్ని ఎవరూ ఆపలేరు' - సైనికులతో నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు
Netanyahu Meets Troops: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం గాజాకు వచ్చారు. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులతో మాట్లాడారు.
Israel PM Netanyahu Meets Troops in Gaza: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) ఆదివారం గాజాలో (Gaza) అడుగుపెట్టారు. ఆయన వెంట సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో పాల్గొంటున్న సైనికులతో సమావేశమయ్యారు. కమాండర్లు, సైనికులు ఆయనకు పరిస్థితి వివరించారు. లక్ష్యం నెరవేరేవరకూ తమ పోరాటం సాగుతుందని తెలిపారు. తమ సైనికుల్లో స్థైర్యం నింపేందుకు ఇక్కడకు వచ్చినట్లు ఆయన చెప్పారు.
ఆయన ఏమన్నారంటే.?
'మన వీరోచిత సైనికుల వల్లే మనం గాజాలో ఉన్నాం. మన పౌరులను విడిపించుకునేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటాం. మనకు 3 లక్ష్యాలున్నాయి. హమాస్ ను అంతమొందించడం, మన బందీలందరినీ విడిపించుకోవడం, భవిష్యత్తులో గాజా ఎప్పటికీ మనకు ప్రమాదకరంగా మారకుండా చూసుకోవడం. ప్రస్తుతం మన ముందున్న లక్ష్యం విజయం సాధించేవరకూ పోరాడడమే. మనల్ని ఎవరూ ఆపలేరు. మనకూ బలం, బలగం ఉంది. యుద్ధంలో కచ్చితంగా లక్ష్యాలన్నీ సాధించగలం.' అని నెతన్యాహు వ్యాఖ్యానించారు.
34 మంది బందీల విడుదల
మరోవైపు, ఇజ్రాయెల్ - హమాస్ మధ్య బందీల విడుదల శని, ఆదివారాల్లోనూ కొనసాగింది. 26 మంది ఇజ్రాయెలీలతోపాటు 8 మంది విదేశీయులను హమాస్ విడుదల చేసింది. ప్రతిగా దాదాపు 75 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. శనివారం రాత్రి విడుదలైన దాదాపు 36 మంది పాలస్తీనా ఖైదీలు ఆదివారం తెల్లవారుజామున వెస్ట్‌బ్యాంకుకు వచ్చారు. ఇటు రెండో విడతలో హమాస్ వదిలిపెట్టిన నలుగురు థాయ్ జాతీయులతో పాటు బందీలు ఇజ్రాయెల్, ఈజిప్టులకు చేరుకున్నారు. మాస్కులతో వచ్చిన మిలిటెంట్లు వారిని రెడ్‌క్రాస్ వాహనంలో ఎక్కించారు. రెండో విడత విడుదలైన బందీల్లో ఏడుగురు పిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నారు. మూడో విడతలో భాగంగా ఆదివారం 14 మంది ఇజ్రాయెలీలతో పాటు ముగ్గురు విదేశీయులను హమాస్ విడిచిపెట్టింది. వీరిలోనూ కొంత మంది ఈజిప్టునకు వెళ్లిపోయారు. మిగిలిన వారిని ఇజ్రాయెల్‌కు రెడ్‌క్రాస్ అప్పగించింది. ప్రతిగా 39 మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడుదల చేస్తోంది. సోమవారం నాలుగో విడత బందీలను హమాస్, ఇజ్రాయెల్ విడుదల చేయనున్నాయి. ఆదివారం నాటికి మొత్తం 58 మందిని హమాస్, 114 మందిని ఇజ్రాయెల్ విడిచిపెట్టినట్లయింది.
కొనసాగుతోన్న ఘర్షణలు
ఓ వైపు కాల్పుల విరమణ కొనసాగుతుండగానే మరోవైపు వెస్ట్ బ్యాంకులో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దళాలు శనివారం ఉదయం నుంచి 24 గంటల్లో 8 మంది పాలస్తీనీయులను కాల్చి చంపాయి. జెనిన్ లో ఐదుగురు, మిగతా ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడిలో ఉత్తర గాజా హమాస్ సీనియర్ కమాండర్ అహ్మద్ అల్ ఘాండర్ హతమయ్యాడు. దీనిపై హమాస్ ఆదివారం అధికారిక ప్రకటన చేసింది.
నౌకపై దాడి
యెమెన్‌కు సమీపంలోని ఎడెన్ తీరంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ ట్యాంకర్ నౌకపై ఆదివారం కొందరు దుండగులు దాడి చేసి, స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరు స్వాధీనం చేసుకున్నదీ తెలియరాలేదు. జోడియాక్ మారిటైం సంస్థకు చెందిన సెంట్రల్ పార్క్ అనే ట్యాంకరు నౌకను గుర్తు తెలియని వ్యక్తులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రైవేటు నిఘా సంస్థ అంబ్రే వెల్లడించింది. ఈ నౌక సిబ్బందిలో తుర్కియే, రష్యా, వియత్నాం, బల్గేరియా, భారత్, జార్జియా, ఫిలిప్పీన్స్ దేశాల వారు ఉన్నట్లు పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణ నేపథ్యంలో ఇటీవల హౌతీ రెబల్స్ పలు నౌకలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
Also Read: Viral News: అమ్మకానికి వచ్చిన అందమైన దీవి, మీ సొంతం చేసుకోవాలంటే ఎంత ఖర్చు చేయాలో తెలుసా?