Operation Sindoor: భారత్, పాక్ దాడులు ఆపేయాలి.. అవసరమైతే సాయం చేసేందుకు సిద్ధమేనన్న డొనాల్డ్ ట్రంప్
Donald Trump | భారత్- పాకిస్తాన్ వివాదాన్ని ఆపాలని.. అరసమైతే సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

Donald Trump on tensions between India and Pakistan | న్యూయార్క్/వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న దాడులను నిలిపివేయాలని తాను కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ విషయంలో ఏం చేయడానికైనా తాను సిద్ధమని, భారత్, పాక్ దేశాల కోసం తాను వీలైన సాయం చేయడానికి అక్కడ ఉంటానని ట్రంప్ బుధవారం నాడు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం అమెరికా అధ్యక్షుడు ఈ కామెంట్స్ చేశారు.
త్వరగా సమస్య పరిష్కరించుకోవాలి
"ఇది చాలా భయంకరమైన అంశం. భారత్ , పాకిస్తాన్ దేశాల గురించి మాకు బాగా తెలుసు. ఇరు దేశాల అధినేతలు ఈ సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవడం మంచిది. అదే జరగాలని నేను కోరుకుంటున్నాను. త్వరలోనే ఈ వివాదం సద్దుమణిగి.. నార్మల్ పరిస్థితులు చూస్తామని ఆకాంక్షిస్తున్నాను. దాయాది దేశాలు తీవ్రమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే నేను ఈ దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని ఆపాలని భావిస్తున్నాను. అందుకోసం ఏ సహాయం అవసరమైన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై మీడియా అడిగిన ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ ఆ విధంగా సమాధానం ఇచ్చారు.
చైనాకు అమెరికా రాయబారిగా డేవిడ్ పెర్డ్యూ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓవల్ ఆఫీసులో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత బలగాలు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలు, స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మొదట మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ పై మాట్లాడిన ట్రంప్ మరుసటి రోజు ఉదయం మరోసారి భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలతో కూడిన దేశాల మధ్య యుద్ధం సరికాదని.. దీని వల్ల ఇరుదేశాలకు భారీ నష్టం వాటిల్లుతుందన్నారు.
దశాబ్దాల నుంచి భారత్, పాక్ మధ్య వివాదం
భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడి అనంతరం కొన్ని గంటలకు ట్రంప్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ మధ్య చాలా ఏళ్ల నుంచి వివాదాలు ఉన్నాయి. ప్రజలు "ఏదో జరగబోతుందని" ముందే తెలుసుకున్నారు. "ఇది నిజంగా సిగ్గుచేటు, మనం ఓవల్ ఆఫీసు వద్దకు వస్తున్నప్పుడు సైనిక దాడి గురించి తెలిసింది. గతంలో ఏదో జరగబోతుందని ప్రజలు తెలుసుకున్నారని భావిస్తున్నాను. దశాబ్దాల నుంచి వారి మధ్య పోరు కొనసాగుతోంది. ఆ దేశాల మధ్య యుద్ద వాతావరణం తొలగిపోవాలని భావిస్తున్నాను. అందుకు అవసరమైన సాయం, మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు త్వరగా ముగిసిపోవాలని’ ట్రంప్ ఆకాంక్షించారు.
భారత బలగాలు మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత దాదాపు అరగంటపాటు ఆపరేషన్ సింధూర్ చేపట్టి పూర్తి చేసింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడిచేసి విధ్వంసం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు మరణించారు. అందుకు ప్రతీకారం తీర్చుకున్నామని.. మరెన్నో దాడులకు ఉగ్రదాడులకు కుట్ర జరుగుతున్నందునే మన సరిహద్దులు దాటి వెళ్లి కేవలం ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, కల్నర్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ బుధవారం మీడియాకు ఆపరేషన్ సిందూర్ వివరాలు వివరించారు.






















