Deadly Virus Samples Missing: ఆస్ట్రేలియాలోని ప్రయోగశాల నుంచి ప్రాణాంతక వైరస్ నమూనాలు మిస్సింగ్.. క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం సంచలన ప్రకటన
Queensland News: ఆస్ట్రేలియాలో సంచలనం చోటుచేసుకుంది. ప్రాణాంతకమైన వైరస్ నమూనాలు కనిపించడం లేదు. ఈ విషయాన్ని క్వీన్స్‌లాండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈవ్యవహారం తీవ్రఆందోళన రేపుతోంది.
Deadly Virus Samples Missing: 2019-20 మధ్య ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా(Corona) వైరస్(Virus) గురించి అందరికీ తెలిసిందే. అన్ని దేశాలూ ఈ వైరస్ బాధితులుగానే నిలిచాయి. కొన్ని లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా(World wide) ఈ వైరస్‌బారిన పడి కన్నుమూశారు. అసలు ఈ వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే నిలిచింది. ఈ పరిణామం ఇలా ఉంటే.. తాజాగా ఆస్ట్రేలియా(Australia)లోని క్వీన్స్‌లాండ్(Queensland) రాష్ట్రంలో ఉన్న ఓ ల్యాబ్(Lab)లో వందలాది 'డెడ్లీ వైరస్'(Deadly virus) నమూనాలు అదృశ్యం అయ్యాయి. ఇది ఇప్పుడు మరో విపత్తుకు దారి తీసే అవకాశం ఉందా? అనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఒక ల్యాబ్ నుంచి ఈ వైరస్‌లు అదృశ్యం కావడం పైగా.. ఇంత పెద్ద మొత్తంలో కనిపించకుండా పోవడం అనేది ప్రపంచంలోనే తొలిసారని అని నిపుణులు చెబుతున్నారు. దీనికి బయోసెక్యూరిటీ(Bio security) ప్రోటోకాల్ ను ఉల్లంఘించడమే కారణమై ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. అదృశ్యమైన వాటిలో ప్రధానంగా హెండ్రా వైరస్, లైసావైరస్, హాంటావైరస్‌లతో సహా లైవ్ వైరస్‌లు 323 నమూనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఏం జరిగింది?
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ పబ్లిక్ హెల్త్ వైరాలజీ లాబొరేటరీ నుంచి 2023, ఆగస్టు(August-2023)లో హెండ్రా వైరస్, లైస్సావైరస్, హాంటావైరస్‌లతో సహా అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షియస్ వైరస్‌లైన 323 వైరస్ నమూనాలు కనిపించకుండా పోయాయి. వీటిలో కీలకమైన హెండ్రా వైరస్ అనేది జూనోటిక్ (జంతువు నుంచి మనిషికి) వైరస్, ఇది ఆస్ట్రేలియాలో మాత్రమే ఉందని గుర్తించారు.
హాంటావైరస్ అనేది తీవ్రమైన అనారోగ్యం సహా మరణానికి దారి తీసే వైరస్‌ల కుటుంబానికి చెందినదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(Centre for Disease control and prevention) నిపుణులు చెబుతున్నారు. ఇక, లైసావైరస్ అనేది రాబిస్‌కు కారణమయ్యే వైరస్‌ల సమూహం. క్వీన్స్‌లాండ్ పబ్లిక్ హెల్త్ వైరాలజీ లాబొరేటరీలో వాస్తవానికి దోమలు, టిక్-బర్న్ వ్యాధికారక రోగనిర్ధారణ సేవలు, నిఘా, పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతాయి. ఈ ల్యాబ్‌లోనే వందల కొద్దీ వైరస్‌లు అదృశ్యం కావడం సంచలనంగా మారింది.
ఈ వైరస్ నమూనాలను ఎవరైనా దొంగిలించారా? లేక ఉద్దేశ పూర్వకంగానే నాశనం చేశారా? అనేది విచారణలో తేలుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈవైరస్‌ల వ్యవహారం వెలుగు చూసిన తర్వాత.. "వీటితో ప్రమాదం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు" అని క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం(Government) ప్రకటించడం గమనార్హం. "బయోసెక్యూరిటీ ప్రోటోకాల్ ఉల్లంఘన ఎలా జరిగిందో తెలియదు. అయితే.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఎలా నిరోధించాలో దర్యాప్తు చేయాలి" అని మంత్రి తిమోతీ నికోల్స్(Thimoti Nicoles) వ్యాఖ్యానించారు.
క్వీన్స్‌లాండ్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జాన్ గెరార్డ్(John Gerarde) మాట్లాడుతూ.. కనిపించకుండా పోయిన వైరస్ నమూనాలతో ప్రజలకు ఇబ్బందులు ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవని పునరుద్ఘాటించారు. "వైరస్ నమూనాలు తక్కువ ఉష్ణోగ్రత ఫ్రీజర్ వెలుపల చాలా వేగంగా క్షీణించి, ప్రభావాన్ని కోల్పోతాయని `` అని పేర్కొన్నారు. క్వీన్స్‌లాండ్‌లో గత ఐదేళ్లుగా హెండ్రా, లైస్సావైరస్ కేసులు లేవని తెలిపారు. హాంటావైరస్ ఇన్‌ఫెక్షన్లు ఇప్పటి వరకు ధృవీకరించలేదని పేర్కొన్నారు.
విచారణకు ఆదేశం..
క్వీన్స్‌లాండ్ నుంచి వైరస్‌లు అదృశ్యమైన ఘటనపై ప్రభుత్వం "పార్ట్ 9 ఇన్వెస్టిగేషన్‌ను ప్రారంభించింది. ఇదిలావుంటే.. ఈ వైరస్‌లపై "కొన్ని హాంటావైరస్‌లు 15% వరకు మరణాల రేటును కలిగి ఉంటాయి. కోవిడ్-19(COVID-19) కంటే 100 రెట్లు ఎక్కువ ప్రాణాంతకం, అయితే మరికొన్ని తీవ్రత పరంగా కోవిడ్-19ను పోలి ఉంటాయి" అని ఒక నిపుణుడు చెప్పారు. మూడు వ్యాధికారక వైరస్‌ల నుంచి జంతువులు, పశువులకు కూడా అధిక ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.
నిపుణుల మాట ఇదీ..
లైసా వైరస్ కారణంగా రాబిస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. దీనికి సకాలంలో చికిత్స అందించకపోతే విశ్వవ్యాప్తంగా ప్రాణాంతకమని పేర్కొన్నారు. అయితే.. "ఈ వ్యాధికారక వైరస్‌లలో దేనినైనా వ్యక్తి నుంచి వ్యక్తికి ప్రసారం చేయగల పరిమిత సామర్థ్యం కారణంగా, వ్యాప్తి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది" అని స్కార్పినో అనే నిపుణుడు చెప్పారు., హెండ్రా వైరస్, హంటావైరస్, లైసావైరస్ కుటుంబానికి చెందిన వైరస్‌లు మానవులు, జంతువులపై ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు.
ఏడాది పట్టిందా?
ప్రాణాంతక వైరస్‌లు అదృశ్యమైన వ్యవహారాన్ని నిర్దారించేందుకు ఏడాదికిపైగా సమయం పట్టడంపై పలువురు నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనాఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నందుకు సంతోషించాలని పేర్కొన్నారు. అమెరికాలో కూడా ఇలాంటి హై-ప్రొఫైల్ బయోసెక్యూరిటీ లోపాలు ఉన్నాయని స్కార్పినో పేర్కొన్నారు.