H-1B Visas Update: హెచ్1బీ వీసాల ధర పెంపుపై అమెరికా కీలక ప్రకటన.. కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తింపు
H-1B Visa పై ట్రంప్ నిర్ణయంపై భారతీయుల్లో ఆందోళన. విదేశాంగ శాఖ స్పందించి, ప్రభావం పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బి వీసా రుసుము(H1B Visa Fees) ను లక్ష డాలర్లకు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 88 లక్షలు) పెంచారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఐటీ కంపెనీల్లో పనిచేసే భారతీయులలో గందరగోళం నెలకొంది. హెచ్1బీ వీసాల ఫీజు లక్ష డాలర్లకు సంబంధించి అమెరికా తీసుకువచ్చిన ట్రంప్ గోల్డ్ కార్డ్ లైవ్ అయింది. విక్రయాలు ప్రారంభించినట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికాలో హెచ్1బీ వీసా మీద ఉన్నవారికి ఊరట కలిగించే వార్త అందించారు.
అమెరికా అధికారి కొత్త సమాచారం
H-1B వీసా దరఖాస్తు రుసుము పెరగడంతో ఏర్పడిన గందరగోళం సమయంలో ఒక అమెరికా అధికారి భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అమెరికా అధికారి శనివారం మాట్లాడుతూ.. 'H-1B వీసా (H1B Visa)పై ఉంటున్న భారతీయులు ఆదివారం వరకు అమెరికాకు తిరిగి రావాల్సిన అవసరం లేదు. మళ్లీ రావడానికి లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదు' అని అన్నారు. ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధన కొత్త వీసా దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని అధికారి స్పష్టం చేశారు. ఇప్పటికే H1B వీసా కలిగిన లేదా తమ వీసాలను పునరుద్ధరించుకుంటున్న (H1B Visa Renewal) వారిపై ఈ కొత్త ఫీజు వర్తించదు.
ప్రజలలో భయాందోళన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా రుసుమును ఏడాదికి లక్ష డాలర్లుగా ప్రకటించిన తర్వాత అక్కడ ఉంటున్న భారతీయులతో పాటు, భారత్ లో ఉన్న వారి కుటుంబాలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీని ప్రభావం విమానాశ్రయాల్లో కూడా కనిపించింది, చాలా మంది ప్రయాణికులు భయంతో విమానం నుండి దిగిపోయారు. శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమానంలో భారతీయ ప్రయాణికులు ఎక్కారు. అప్పుడే H1B వీసా రుసుము పెరిగిందనే వార్త వచ్చింది. ఆ తర్వాత ప్రయాణికులు భయపడి విమానం నుండి దిగిపోయారు.
హెచ్1బీ వీసా ధర పెంపు.. ట్రంప్ గోల్డ్ కార్డ్ అమ్మకాలు ప్రారంభం
United States Secretary of Commerce Howard Lutnick tweets, "The Trump Gold Card is officially live.
— ANI (@ANI) September 20, 2025
For $1M, individuals can obtain the Trump Gold Card—creating jobs and building businesses here in America.
For $2M, corporations can purchase a Corporate Trump Gold Card for… pic.twitter.com/4NkIpTsEXu
ట్రంప్ నిర్ణయంపై భారత్ స్పందన
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రభావాన్ని అధ్యయనం చేస్తోందని తెలిపింది. ఇందులో భారత పరిశ్రమ కూడా ఉంది, ఇది ఇప్పటికే దీనిపై ప్రారంభ విశ్లేషణను సమర్పించింది. H-1B వీసాకు సంబంధించి అనేక అపోహలను తొలగించింది. భారతదేశం, అమెరికా రెండూ ఆవిష్కరణలు.. సృజనాత్మకతలో భాగస్వాములని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అందువల్ల 2 దేశాలు భవిష్యత్తులో కలిసి చర్చిస్తాయని భావిస్తున్నారు. నైపుణ్యం కలిగిన నిపుణుల రాకపోకలు సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధి, పోటీతత్వాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
నిపుణులు ఏమన్నారు?
కంపెనీలు అమెరికాకు చౌకైన కార్మికులను పంపడానికి H-1B వీసాలను ఉపయోగిస్తాయనే భావనను ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) మోహన్దాస్ పాయ్ తోసిపుచ్చారు. టాప్ 20 H-1B యజమానులు ఉద్యోగులకు చెల్లించే సగటు జీతం ఇప్పటికే 1 లక్ష అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ అని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలను 'అసంబద్ధమైన ప్రకటనలు' అని మోహన్దాస్ పాయ్ అభివర్ణించారు. నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. H-1B వీసా రుసుము పెరగడం అమెరికా ఆవిష్కరణల వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని అన్నారు. అయితే, దీనివల్ల తదుపరి తరానికి చెందిన ల్యాబొరేటరీలు, పేటెంట్లు, స్టార్టప్‌లు ఇప్పుడు భారతదేశం వైపు, ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల వైపు మళ్లుతాయని అన్నారు. ప్రపంచ ప్రతిభకు అమెరికా తలుపులు మూసివేయడం వల్ల భారతదేశంలోని సాంకేతిక నగరాలకు వేగం వస్తుంది, ఆవిష్కరణలకు కేంద్రంగా భారతదేశం మారవచ్చు.
భారతదేశంపై ప్రభావం ఎలా ఉంటుంది?
అమెరికా కంపెనీలు ఇప్పుడు భారత్ వంటి దేశాలకు ఎక్కువ పనిని అవుట్‌సోర్స్ చేస్తాయని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల బెంగళూరు, హైదరాబాద్, పూణే, గురుగ్రామ్ వంటి నగరాల్లో ఐటీ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్తగా అమెరికాకు వెళ్లాలనుకునే వేలాది మంది భారతీయులు డాలర్ డ్రీమ్స్ కెరీర్ నిర్మించుకోవాలనే కల నెరవేరకపోవచ్చు.






















