France Protest: నాలుగు రోజులుగా అట్టుడుకుతున్న ఫ్రాన్స్- పట్టపగలే దోపిడీలు, ఘర్షణలు
France Protest: నాలుగు రోజులుగా ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. పోలీసులు, యువత మధ్య ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. దోపిడీలు పెరిగిపోయాయి.
France Protest: ఫ్రాన్స్ వ్యాప్తంగా హింస చెలరేగుతోంది. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించినా ఆందోళనకారులను అదుపు చేయడం సాధ్యపడట్లేదు. పట్టపగలే దోపిడీ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అల్లర్లు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలు, దోపిడీలతో ఫ్రాన్స్ రణరంగంగా మారింది. ప్యారిస్ సహా చాలా ప్రాంతాల్లో ఆందోళనకారులు దుకాణాలను లూటీ చేస్తున్నారు. శుక్రవారం స్ట్రాస్ బర్గ్‌లోని యాపిల్ స్టోర్ లోపలకు నిరసనకారులు చొరబడి.. అక్కడి సామగ్రిని దోచుకెళ్లారు. పోలీసులు బాష్పవాయువులతో వారిని చెదరగొట్టారు. మర్సీలీలోని ఓ ఆయుధాల దుకాణాన్ని ఆందోళనకారులు లూటీ చేసి తుపాకులను ఎత్తుకెళ్లారు.
కుర్రాడి హత్యపై నిరసన జ్వాలలు
మంగళవారం ట్రాఫిక్ తనిఖీల సమయంలో 17 ఏళ్ల అల్జీరియన్-మొరాకో సంతతికి చెందిన నహేల్ అనే కుర్రాడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఛాతీపై బుల్లెట్ తగలగా అతడు తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నిరసనలు చెలరేగాయి. అవి కాస్త తీవ్ర ఆగ్రహజ్వాలలకు దారితీశాయి. పశ్చిమ పారిస్ శివారు ప్రాంతమైన నాంటెర్రేలో నహేల్ స్మారక మార్చ్ నిర్వహించగా.. అది కాస్త హింసకు దారి తీసింది. ఈ ర్యాలీలో పాల్గొన్న వారు నాంటెర్రేలోని పలు కార్లకు నిప్పు పెట్టారు. అలా మొదలైన హింసాకాండ, ఘర్షణలు దేశం మొత్తం పాకాయి. పోలీసుల తీరును నిరసిస్తూ వేలాది మంది యువకులు రోడ్లెక్కారు. తనిఖీల పేరుతో యువకులను కాల్చి చంపడాన్ని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగినట్లు నిరసనకారులు చెబుతున్నారు. ఆందోళనకారులు అనేక నగరాల్లో పోలీసులతో ఘర్షణకు దిగారు. భవనాలకు, వాహనాలకు, చెత్త డబ్బాలకు, పాఠశాలలు, దుకాణాలు, బ్యాంకులకు నిప్పు పెట్టారు. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే అధికగా ఉండటం కలవరపాటుకు గురి చేస్తోంది.
Also Read: Aspartame: WHO చెప్పిన అస్పర్టమే అంటే ఏంటి? దీంతో క్యాన్సర్ వస్తుందా? ఈ ఉత్పత్తుల్లోనే ఎక్కువ!
'సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలి'
దేశంలో చెలరేగిన హింసతో.. బ్రస్సెల్స్ లో జరుగుతున్న ఈయూ శిఖరాగ్ర సమావేశం నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మేక్రాన్ హుటాహుటినా పారిస్ కు చేరుకున్నారు. ఈ అల్లర్లను అణచిడానికి సోషల్ మీడియాపై ఆంక్షలను ప్రతిపాదించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. హింసాకాండకు ఆజ్యం పోయడంలో స్నాప్ చాట్, టిక్ టాక్ వంటి సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన ఆరోపించారు. సమస్యాత్మక కంటెంట్ ను తొలగించడానికి నిబంధనలు రూపొందిస్తామని మేక్రాన్ తెలిపారు. అల్లర్లలో పాల్గొంటున్న వారిలో ఎక్కువగా యువకులే ఉంటున్నారని వెల్లడించారు. ఫ్రాన్స్ లో శాంతి పునరుద్ధరణకు చేపట్టాల్సిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని, ఎమెర్జన్సీ పైనా చర్చిస్తున్నామని ఫ్రెంచ్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ చెప్పారు. ఆందోళనకారులను అణచివేసేందుకు 40 వేల మందికి పైగా పోలీసులను ప్రభుత్వం మోహరించినట్లు తెలిపారు.
క్షమాపణ కోరిన పోలీసు అధికారి
మంగళవారం ప్యారిస్ శివార్లలోని నాంటెర్రేలో నహేల్ (17) ను కాల్చి చంపిన పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఆ అధికారిపై హత్యాభియోగాలు నమోదు చేశారు. పోలీసు అధికారి మృతుడి కుటుంబానికి క్షమాపణలు చెప్పారని అతడి తరఫు న్యాయవాది తెలిపారు. ఈ ఘటన పొరపాటుగా జరిగిందని, తాను కాళ్లకు గురిపెట్టినా అనుకోకుండా ఛాతీకి బుల్లెట్ తగిలిందని న్యాయవాది చెప్పుకొచ్చారు. తనను క్షమించాలని కోరారని తెలిపారు. మరోవైపు నహేల్ తల్లి మౌనియా మీడియాతో మాట్లాడుతూ.. తమ బిడ్డ అరబ్ యువకుడి తరహాలో కనిపించినందుకే అతడి ప్రాణాలు తీశారని ఆరోపించారు.
'తనిఖీల పేరుతో కాల్చి చంపడం ఇదేం కొత్తగా'
ఆందోళనకారులు ఫ్రెంచ్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఫ్రాన్స్ లో ఇలా ట్రాఫిక్ తనిఖీల సమయంలో పోలీసులు కాల్చి చంపడం కొత్తేమీ కాదని ఆరోపిస్తున్నారు. 2022 లో 13 మందిని తనిఖీల పేరుతో పోలీసులు కాల్చి చంపారని చెబుతున్నారు. ఈ ఏడాది నహేల్ తో పాటు మరో ముగ్గురిని ఇలాగే కాల్చి చంపారని అంటున్నారు. వచ్చే ఏడాది పారిస్ లో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనలు ఆ దేశాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial