(Source: ECI/ABP News/ABP Majha)
Floods New York: అమెరికాలో వరదల బీభత్సం! కొట్టుకుపోయిన రోడ్లు, వందల విమానాల రద్దు
న్యూయార్క్‌లో ముఖ్యంగా ఆదివారం నాడు హడ్సన్ వ్యాలీ సహా కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది ఇంచ్‌ల మేర వర్షం కురిసిందని అక్కడి వాతావరణ సంస్థలు వెల్లడించాయి.
అమెరికాలోని న్యూయార్క్ స్టేట్‌లో వరదలు భీభత్సం రేపుతున్నాయి. కుండపోత వర్షపాతం వల్ల వరదలు ఏర్పడి వినాశనాన్ని సృష్టించాయి. సోమవారం (జూలై 10) వెర్మోంట్ ప్రాంతంలో నివాస ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కాలనీలను వరదలు ధ్వంసం చేశాయి. తాజా వరదలు చూస్తుంటే సరిగ్గా దశాబ్దం క్రితం వచ్చిన ఉష్ణమండల తుపాను ఐరీన్ యొక్క పోలికలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్నోచోట్ల పలుచోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. చాలా విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కెన్నడీ, లగార్డియా, నెవార్క్ విమానాశ్రయాల్లో వందల సంఖ్యలో విమానాలను ఎయిర్ పోర్టుల అధికారులు రద్దు చేశారు. బోస్టన్‌లోని లోగాన్ విమానాశ్రయంలో 200కి పైగా విమానాలు రద్దు అయినట్లుగా స్థానిక వార్తా పత్రికలు రాశాయి.
న్యూయార్క్‌లో ముఖ్యంగా ఆదివారం నాడు హడ్సన్ వ్యాలీ సహా కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది ఇంచ్‌ల మేర వర్షం కురిసిందని అక్కడి వాతావరణ సంస్థలు వెల్లడించాయి. న్యూయార్క్‌లోని హడ్సన్ వ్యాలీలో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె నివాసం జల దిగ్బంధంలో చిక్కుకుంది. పెంపుడు శునకంతో కలిసి ఇంటి నుంచి బయటపడే ప్రయత్నంలో ఉండగా ఒక్కసారిగా అలలు ఎగసిపడడంతో ఆమె నీటిలోపడి చనిపోయారు. సోమవారం నాటికి ఆ భీభత్సం వెర్మోంట్‌లో కనిపించింది. వరదల విషయంపై వెర్మోంట్ గవర్నర్ ఫిల్ స్కాట్ మాట్లాడుతూ.. వరదల వల్ల వెర్మోంట్‌లో ఆరుగురు చనిపోయారని అన్నారు. పదేళ్ల క్రితం ఐరీన్ వచ్చిన సమయంలో జరిగిన నష్టం కంటే ఇప్పుడు అధికంగా జరుగుతుందని గవర్నర్ ఫిల్ స్కాట్ చెప్పినట్లుగా న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
భారీ వర్షాలు అమెరికా ఈశాన్య రాష్ట్రాలు అంతటా ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అనేక మందిని తరలించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరింతగా వర్షాలు పడతాయనే అంచనాలతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయింది. న్యూయార్క్, కనెక్టికట్‌లను తాకిన తుపాను నెమ్మదిగా కదులుతూ న్యూ ఇంగ్లండ్‌కు చేరింది. న్యూయార్క్, న్యూహ్యాంప్‌షైర్, వెర్మాంట్, కనెక్టికట్, మసాచుసెట్స్, మైన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో మెరుపు వరదలు సంభవించాయి. తుపాను భీభత్సానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది.
New York Turns Into a Flooding Sea! Flash floods hit New York - video via About Nature#BreakingNews #Breaking #Flood pic.twitter.com/05lCpHHmwW
— Brett Murphy (@bmurphypointman) July 11, 2023