Idalia Hurricane: అమెరికాను కుదిపేస్తున్న ఐడాలియా తుఫాన్, లక్షల ఇళ్లకు పవర్ కట్
Idalia Hurricane: అమెరికాలో ఐడిలియా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది.
Idalia Hurricane:
మూడు రాష్ట్రాల్లో బీభత్సం
అమెరికాలో ఐడాలియా తుపాను (Idalia Hurricane) అతలాకుతలం చేస్తోంది. మొత్తం మూడు రాష్ట్రాలపై విరుచుకు పడుతోంది. నార్త్ కరొలినా, జార్జియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో భారీ వర్షాల ధాటికి వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. గంటకు 60 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కేటగిరీ -3 హరికేన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా చరిత్రలోనే ఇంత భారీగా ఆస్తినష్టం మిగిల్చిన తుపాను ఇదేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జార్జియా, కరోలినాలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగా 9.36 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. బిగ్‌బెండ్ ప్రాంతంలోని సముద్ర మట్టం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. గత 125 ఏళ్లలో ఇదే రికార్డు. వరదల ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు ఐదు అడుగుల మేర నీళ్లు నిలిచిపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఫ్లోరిడాలోని పెస్కో కౌంటీలో వేలాది ఇళ్లు నీట మునిగాయి. ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రంలో ఎంత నష్టం వాటిల్లిందనే లెక్కలు వేసుకుంటున్నారు అధికారులు. ఇది భారీగానే ఉండే అవకాశాలున్నాయి. సౌత్ కరోలినాలో చార్లెస్టన్ హార్బర్‌లో 9 అడుగులపైగానే నీటి మట్టం నమోదైంది. 2016లో వచ్చిన మాథ్యూ, 2017లో వచ్చిన ఇర్మా తుపానులతో పోల్చుకుంటే ఐడాలియా తుపాన్ అన్ని రికార్డులనూ బద్దలు కొడుతోంది. చాలా చోట్ల రహదారులు మూసేశారు. ఫ్లోరిడాలో సుమారు లక్షా 40 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జార్జియాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా లక్షా 20 వేల ఇళ్లు చీకట్లోనే మగ్గుతున్నాయి. ఉత్తర కరోలినాలోనూ వేలాది ఇళ్లలో పవర్ సప్లై నిలిచిపోయింది. ప్రజలందరూ తాగునీటి విషయంలో జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు.