Somnath in IndiGo Flight: ఇస్రో చీఫ్‌కు ఇండిగో ఫ్లైట్‌లో గ్రాండ్ వెల్‌కం - అదిరిపోయేలా ప్రయాణికుల చప్పట్లు, వీడియో
సోమనాథ్ ఇండిగో విమానంలో ప్రయాణించారు. తమతో పాటు ఇస్రో చైర్మన్ కూడా ప్రయాణిస్తున్నందుకు విమానంలోని క్యాబిన్ సిబ్బంది గర్వపడ్డారు.
ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మూన్ మిషన్ ను ఇస్రో చీఫ్ డాక్టర్ ఎస్. సోమనాథ్ పర్యవేక్షించారు. సైన్స్ రంగంలో దేశానికి గొప్ప విజయాలు అందించిన హీరోగా ప్రస్తుతం దేశ ప్రజలు ఆయన్ని చూస్తున్నారు.
దీంతో ఆయన ఎక్కడికి వెళ్లినా ఆప్యాయంగా జనాలు స్వాగతిస్తున్నారు. ఇస్రో విజయానికి అభినందనలు తెలుపుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి విమానంలో జరిగింది. సోమనాథ్ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నారు. తమతో పాటు ఇస్రో చైర్మన్ కూడా ప్రయాణిస్తున్నందుకు విమానంలోని క్యాబిన్ సిబ్బంది గర్వపడ్డారు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఇండిగో సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎయిర్ హోస్టెస్ పూజా షా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఎయిర్ హోస్టెస్ పూజ సోమనాథ్‌తో మీరు దేశానికి హీరో అని అన్నారు. ‘‘మా ఇండిగో విమానంలో సోమ్‌నాథ్‌కు సేవ చేసే అవకాశం లభించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. దేశ హీరోలు మా విమానంలో ప్రయాణించడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’’ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. సోమనాథ్‌ని ఆమె ప్రయాణీకులకు పరిచయం చేశారు. “విమానంలో ఇస్రో చైర్మన్ శ్రీ S. సోమనాథ్ మనతో ఉన్నారని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. సోమనాథ్, ఆయన టీమ్‌కు మా అభినందనలు. సార్ మీరు భారతదేశం గర్వపడేలా చేశారు. మీరే దేశానికి హీరోలు’’ అని మాట్లాడారు.
విమానంలో సోమనాథ్ ఉన్నారని తెలియగానే ప్రయాణికులు ఆయన్ను చూసేందుకు సీటు వైపు తిరిగారు. సోమనాథ్ గౌరవార్థం ఆయన కోసం చప్పట్లు కొట్టారు. క్యాబిన్ క్రూ ఒకరు స్నాక్స్, శీతల పానీయాలతో సోమనాథ్ వద్దకు వెళ్లారు. సోమ్‌నాథ్‌కి ఓ నోట్ ఇచ్చారు.
View this post on Instagram