Bird Flu in Human: చైనాలో బర్డ్ ఫ్లూ వైరస్ కలవరం, మనిషికి సోకిన స్ట్రెయిన్ - ప్రపంచంలోనే తొలికేసు
Bird Flu: చైనా మధ్య ప్రాంతంలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఓ నాలుగేళ్ల బాలుడికి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకింది.
చైనాలో బర్డ్ ఫ్లూ ఆందోళన ప్రపంచాన్ని కలవర పెడుతోంది. బర్డ్ ఫ్లూ సోకేందుకు కారణమయ్యే వైరస్ ఇప్పటిదాకా కేవలం కోళ్లు, పక్షుల్లో మాత్రం వ్యాప్తి చెందుతుండగా, తాజాగా ఆ వైరస్ ఓ మనిషికి సోకింది. ప్రపంచంలోనే బర్డ్ ఫ్లూ వైరస్ ఒక మనిషికి సోకడం ఇదే తొలిసారి. ఈ కేసు తాజాగా చైనాలో నమోదైంది. బర్డ్ ఫ్లూ వ్యాధికి H3N8 అనే స్ట్రెయిన్ కారణం. ఈ వైరసే తొలిసారిగా మనిషికి సోకింది. ఈ మేరకు చైనా ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. అయితే, ఈ వైరస్ మనిషికి సోకినా, అది మానవుల్లో వ్యాప్తి చెందే రేటు చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు.
చైనా మధ్య ప్రాంతంలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఓ నాలుగేళ్ల బాలుడికి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకింది. అతనికి జ్వరంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడంతో పరీక్షలు చేయించగా, అది H3N8 వైరస్ అని తేలిందని చైనా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ బాలుడితో ఇటీవల దగ్గరగా ఉన్న వ్యక్తులను కూడా గుర్తించి వారికి కూడా పరీక్షలు జరిపామని, వారికి వైరస్ సోకినట్లు ఎక్కడా పరీక్షల్లో తేలలేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
H3N8 వైరస్ సోకిన బాలుడి ఇంట్లో కోళ్లు, కాకుల్ని బాగా పెంచుతున్నారు. ఈ వైరస్ పక్షుల్లో కాకుండా గతంలో గుర్రాలు, కుక్కలు, రకరకాల పక్షుల్లో గుర్తించారు. కానీ, మనుషుల్లో గుర్తించడం మాత్రం ఇదే తొలిసారని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.
ప్రాథమిక అంచనా ప్రకారం, ఈ వేరియంట్‌కు మానవుల్లో ఒకరి నుంచి మరొకరికి సమర్థవంతంగా సంక్రమించే సామర్థ్యం ఇంకా లేదని ఆరోగ్య కమిషన్ అంచనా వేసింది. కాబట్టి, ఇది మనుషుల్లో అంటువ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని నిర్ధారించినట్లు కమిషన్ తెలిపింది. బర్డ్ ఫ్లూలోనే ఎన్నో రకాల స్ట్రెయిన్‌లు చైనాలో ఉన్నాయి. కానీ, పౌల్ట్రీ పరిశ్రమలో పని చేసే వారికే ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరం బర్డ్ ఫ్లూలోని H10N3 స్ట్రెయిన్ ఒకరికి సోకినట్లుగా చైనా ఆరోగ్యశాఖ ప్రకటించింది.
చైనాలో అనేక జాతుల పక్షులను పెంచుతారు. అంతేకాక, అడవి పక్షులు భారీ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి, వైరస్‌లు పరివర్తన చెందడానికి అనువైన వాతావరణం ఉంటుంది.