Sri Lanka Crisis: రగులుతున్న శ్రీలంక- నిరసనకారుల దాడిలో అధికార పార్టీ ఎంపీ మృతి
శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దయానియంగా మారుతున్నాయి. రాజపక్స రాజీనామా చేసినా ఆందోళనకారులు శాంతించలేదు. ఈ సంఘర్షణలో ఓ ఎంపీ మృతి చెందారు.
ప్రభుత్వ అనుకూల మరియు వ్యతిరేక నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలో శ్రీలంక అధికార పార్టీ ఎంపీ సోమవారం మరణించారు. శ్రీలంక అంతటా వ్యాపించిన ఘర్షణల్లో డజన్ల కొద్దీ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రజల మధ్య ఘర్షణల్లో ఎంపీ అమరకీర్తి అతుకోరాల మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కొలంబో-కాండీ హైవేపై ఉన్న నిట్టంబువా పట్టణంలో ఎంపీ అమరకీర్తి అతుకోరాల నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు ఆయనపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ ప్రతిఘటన నుంచి కాపాడుకునేందుకు ఆయన సమీపంలోని భవనంలో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించారు. అక్కడే చనిపోయాడని అధికారులు తెలిపారు.
#BREAKING Ruling-party MP killed in Sri Lanka clashes: police pic.twitter.com/Ri6umuPWiX
— AFP News Agency (@AFP) May 9, 2022
శ్రీలంకలో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. ఎక్కడికక్కడ నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా... వందమందికిపైగా గాయపడ్డారు.
#BREAKING Two killed, 139 wounded in Sri Lanka clashes: officials pic.twitter.com/RRlOu2fc9L
— AFP News Agency (@AFP) May 9, 2022
మధ్యాహ్నమే శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిరసనలు హోరెత్తుతున్నాయి. రాజపక్స రాజీనామా చేయాలని ప్రజలు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆయన ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన మరుక్షణమే పరిస్థితులు ఒక్కసారిగా చేజారిపోతున్నట్టు కనిపిస్తోంది. నిరసన పర్వం శ్రీలంకలో సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స కారణమంటూ వారు పదవి నుంచి వైదొలగాలని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ నిరసనలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుండడంతో అధ్యక్షుడు గొటబాయ ఇటీవల రెండు సార్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఆహార, ఇంధన, ఔషధాల కొరతపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. దానికి తోడు ప్రతిపక్షాలు అధికార పక్షంపై రోజురోజుకూ ఒత్తిడి పెంచుతున్నాయి. అందుకే మహింద రాజపక్స రాజీనామా చేశారు. అయినా పరిస్థితులు చల్లబడలేదు.