Sheikh Hasina Resign: బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా, దేశం విడిచి పోయిన షేక్ హసీనా
Bangladesh Protests: బంగ్లాదేశ్‌కు ప్రధానిగా షేక్ హసీనా 2009 నుంచి ఉన్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేత్రిగా ఉన్న మహిళగా ఈమె పేరుపొందారు.
Sheikh Hasina News: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే బంగ్లాదేశ్ లో అల్లర్లు పెద్ద సమస్యగా మారింది. దేశమంతా అస్థిరత నెలకొన్న వేళ షేక్ హసీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే అల్లర్ల కారణంగా వందలాది మంతి మృతి చెందారు. అయితే, ఢాకాలోని ప్రధాని ఇల్లు, కార్యాలయాన్ని ఆందోళన కారులు ముట్టడించారు. దీంతో ప్రధాని షేక్ హసీనా తన సోదరితో కలిసి దేశం విడిచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి హెలికాప్టర్ వీడియోలు కూడా బయటికి వచ్చాయి.
ప్రధాని ఇంటి ముట్టడి
ఈ అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఢాకాలో విపరీతమైన నిరసనల కారణంగా ప్రధాన మంత్రి తన అధికారిక నివాసాన్ని విడిచి వెళ్లారు. ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే వివరాలు తెలియదు. ఇప్పుడు ఢాకాలో పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. ప్రధాన మంత్రి ఇల్లు కూడా అల్లరి మూకల చేతిలో ఉంది’’ అని చెప్పినట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
A senior official from the Bangladesh Prime Minister's Office, who requested anonymity, speaks to ANI -"Prime Minister Sheikh Hasina left the official residence in Dhaka after violence erupted. Her current whereabouts are unknown. The situation in Dhaka is highly sensitive, and… pic.twitter.com/Kb84w1OxQZ
— ANI (@ANI) August 5, 2024
బంగ్లాదేశ్‌లో సైనిక పాలన
బంగ్లాదేశ్‌లో సైనిక పాలన ప్రకటించారు. ఈ మేరకు ఆ దేశ ఆర్మీ చీఫ్ సైనిక పాలన ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేప్రయత్నం చేస్తామని, త్వరలోనే బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు.
2009 నుంచి బంగ్లాదేశ్‌ను షేక్ హసీనా పరిపాలిస్తూనే ఉన్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడిపిన మహిళగా ఈమె పేరుపొందారు. బంగ్లాదేశ్ దేశంలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో రిజర్వేషన్ కోటాను రద్దు చేయాలనే డిమాండ్‌తో గత నెలలో నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసనలు చాలా ఉద్ధృతంగా జరుగుతున్నాయి. విద్యార్థి సంఘాలు, ప్రధాని పార్టీ వ్యతిరేకులు ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. పలువురు విద్యార్థి సంఘాలు, కార్యకర్తలు ‘పూర్ణ్ అసహయోగ్ ఆందోళన్’ అనే కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. రాజధాని ఢాకాతో పాటు దేశంలో వేర్వేరు ప్రాంతాలకు ఈ ఆందోళనలు విస్తరించాయి. ఈ నిరసనల్లో దాదాపు 300 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయాయి.
మొబైల్ నెట్‌వర్క్‌లు బంద్
దేశమంతా నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆగస్టు 4 సాయంత్రం నుంచే నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్టు హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆగస్టు 5 నుంచి 3 రోజులపాటు ప్రభుత్వం అధికారిక సెలవులను ప్రకటించింది. ఘర్షణల వేళ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఢాకా ప్రాంతంలో 4జీ ఇంటర్నెట్ సేవలు ప్రస్తుతానికి నిలిపేశారు. 3జీ, 4జీ నిలిపివేయడం కారణంగా.. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగించుకోవడం బంద్ అయిపోయింది. అయితే, మొబైల్ ఇంటర్నెట్ సేవలు ఎప్పటికి పునరుద్ధరిస్తానేది అధికారులు ఇంకా వెల్లడించలేదు.